
హరితహారం. నేడే శ్రీకారం
ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం
మొక్కల సంరక్షణకుప్రతిజ్ఞ చేద్దాం..
ఇది అందరి సామాజిక బాధ్యత
సిటీబ్యూరో: మహోద్యమానికి సమయం ఆసన్నమైంది. నగరాన్ని హరిత వనంగా మార్చేద్దాం.. అంటూ నగర ప్రజలు కదలనున్నారు. ప్రతి వీధి, రహదారి, పార్కు, శ్మశానం.. ప్రాంతమేదైనా నేడు 28.80 లక్షల మొక్కలను నాటనున్నారు. అంతేకాదు.. నాటిన ప్రతి మొక్కను కాపాడతామని ప్రతిజ్ఞ చేయనున్నారు. ఈ గ్రీన్ ఉద్యమంలో లక్షలాది మంది స్వచ్ఛందంగా పాల్గొనున్నారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, సినీ, క్రీడా, న్యాయ రంగాలకు చెందిన ప్రముఖులు భాగస్వాములు కానున్నారు.
ఉద్యోగులు, సంస్థలు సామాజిక బాధ్యతగా కదులుతున్నాయి. లక్షలాది మొక్కలను నాటి సంరక్షించే బాధ్యతను తీసుకోనున్నాయి. ఇదిలా ఉండగా, గత పదేళ్లలో గ్రేటర్ పరిధిలో నాటిన మొక్కలు 10 లక్షలలోపు మాత్రమే. ఇందులోనూ చిన్నపాటి ఈదురు గాలులకు నేలకూలే కొండ తంగేడు (పెల్టోఫామ్) రకానికి చెందినవే అధికం. ఈదురు గాలులకు, గాలివానను తట్టుకుని నిలిచే రావి, మర్రి, జువ్వి, చింత, నేరేడు, మద్ది, కానుగ, కదంబం, సీమచింత వంటి చెట్లను నాటాలని నిర్ణయించి ఆయా మొక్కలను సిద్ధం చేశారు.
తీసుకోవాల్సిన చర్యలివే..
మొక్కను నాటేందుకు ఒక అడుగు పొడవు, వెడల్పు, లోతున గుంత తీయాలి.గుంతలో సగం వరకు సారవంతమైన మట్టిని, పశువుల ఎరువును 2:1 నిష్పత్తిలో నింపాలి.మొక్క ఉన్న క్యారీ బ్యాగుకు పదునైన బ్లేడుతో గాట్లు పెట్టి కింది భాగానికి వృత్తాకారంలో గాటు పెట్టి మొక్కతో పాటు ఉన్న మట్టి తొలగకుండా మొక్కను గుంతలో పెట్టి మట్టితో నింపాలి.నాటిన తరవాత పాదు తడిచేలా నీరు పోయాలి. మొక్క గాలికి వంగకుండా ఊతకర్రను కట్టాలి.మొక్క చుట్టూ నీరు ఆవిరి కాకుండా ఎండుటాకులు, ఎండుగడ్డి, వరిపొట్టు వేయాలి. రక్షణగా ట్రీగార్డ్ ఏర్పాటు చేయాలి. ఇప్పటికే ఉన్న పెద్ద చెట్ల నీడలో మొక్కలు నాటొద్దు.
హరితహారంలో ‘సాక్షి’ సైతం..
నగరంలో ఉద్యమస్ఫూర్తితో జరుగుతున్న హరితహారంలో ‘సాక్షి’ దినపత్రిక భాగమైంది. ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఇప్పటికే ‘హరిత హైదరాబాద్’ పేరిట సిటీ అంతా మొక్కలు నాటుతున్నారు.
మొక్కల పంపిణీ
బంజారాహిల్స్: హరితహారంలో భాగంగా మేయర్ బొంతు రామ్మోహన్ ఆదివారం ఉదయం బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వద్ద సినీ తారలు రకుల్ ప్రీత్‌సింగ్, రాశీఖన్నాతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం పార్కుకు వచ్చిన వాకర్లకు మొక్కలు పంపిణీ చేశారు. మేయర్ మాట్లాడుతూ.. సంపన్న దేశాల నగరాల్లో సగటున ఒక మనిషికి నాలుగు వేల మొక్కలు ఉంటే, నగరంలో మాత్రం ఆ సంఖ్య 3 వేలుగా ఉందన్నారు. అడవులను 33 శాతం పెంచాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ హరితహారాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారన్నారు. రకుల్ ప్రీత్‌సింగ్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను గ్రీన్ సిటీగా మార్చేందుకు మేము సైతం అంటూ ప్రతి ఒక్కరు ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ పాల్గొన్నారు.
మొక్కలు నాటడం అందరి బాధ్యత మేయర్ బొంతు రామ్మోహన్
సిటీబ్యూరో: గ్రేటర్ ప్రజలు సామాజిక బాధ్యతగా హరితహారంలో మొక్కలు నాటాలని జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పిలుపునిచ్చారు. ఇప్పటికే ఊహించిన దానికంటే అధికసంఖ్యలో సంస్థలు మెగా హరితహారంలో భాగస్వాములు అవుతున్నాయన్నారు. సోమవారం మెగా హరితహారంలో భాగంగా ఒకేరోజు 25 లక్షల మొక్కలు నాటనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డితో కలిసి మేయర్ విలేకరులతో మాట్లాడారు. మూడేళ్లలో 10 కోట్ల మొక్కలు నాటాలన్న సీఎం కేసీఆర్ సంకల్పించారన్నారు. ఇందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ భాగమవుతున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితి మేరకు 35 లక్షల మొక్కలు నాటే అవకాశం ఉందన్నారు. గ్రీన్ హైదరాబాద్ వెబ్‌సైట్‌ను వినియోగించుకోవడం ద్వారా అందరికీ సమాచారం వెళ్లిందన్నారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, అటవీశాఖ వంటి సంస్థలన్నీ ఏర్పాట్లు పూర్తి చేశాయని మేయర్ తెలిపారు. ఒక్కరోజులో కార్యక్రమం ఆగిపోదని, వర్షాకాలం పొడవునా మొక్కలు నాటవచ్చన్నారు. అవసరమైన వారికి వాటిని అందజేస్తామన్నారు. కమిషనర్ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో సోమవారం ఒక్కరోజే 1.70 లక్షల మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. వీటి నిర్వహణకు ఈ సంవత్సరానికి రూ. 22.50 కోట్లు ఖర్చు చేస్తున్నామని, మూడేళ్లలో మొత్తం రూ. 54 కోట్లు ఖర్చవుతుందన్నారు. ముఖ్యమైన ఆలయాలు, చర్చిల వద్ద ఔషధ మొక్కలు పంపిణీ చేస్తున్నామన్నారు. సమావేశంలో బయో డైవర్సిటీ విభాగం అడిషనల్ కమిషనర్ శివకుమార్ నాయుడు, డెరైక్టర్ దామోదర్ తదితరులు పాల్గొన్నారు.