
నన్ను, నా కుటుంబాన్నిచంపుతామంటున్నారు
హైదరాబాద్ : మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ శనివారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను కలిశారు. భేటీ అనంతరం అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ గత 15 రోజులుగా బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, తనతో పాటు కుటుంబ సభ్యుల్ని చంపుతామంటున్నారని.... ఇదే విషయాన్ని పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకు వెళ్లినా ప్రయోజనం లేదన్నారు. అందుకే గవర్నర్ను కలిసినట్లు అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు.
కాగా అంజన్ కుమార్ యాదవ్ను గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లో బెదిరించినట్లు హుస్సేనీఆలం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. కొందరు తనకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన గత నెల 31న హుస్సేనీఆలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఫిర్యాదుపై కేసు నమోదు చేయాలా? వద్దా అనే సంశయంతో హుస్సేనీఆలం పోలీసులు నాంపల్లిలోని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించగా...కేసు నమోదు చేయాలని కోర్టు ఈనెల 5న ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఐపీసీ సెక్షన్ 507 కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోన్ కాల్స్ ఎక్కడ నుంచి వచ్చాయన్న విషయంపై విచారణ చేపట్టారు.