'టీడీపీని లోకేశ్ భూస్థాపితం చేస్తాడు'
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా అడిగే దమ్ము ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో కేబినెట్ సెక్రటరీపై ఎగిరితే ఏం రాదని అన్నారు. విభజన అంశాలపై, ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ఎందుకు చంద్రబాబు గట్టిగా నిలదీయడం లేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవం తాకట్టుపెట్టేపని బాబు చేయొద్దని సూచించారు. ప్రధానికి కొఠారి ద్వారా రాయభారం నడపాల్సిన అవసరం ఏమిటని, విభజన హామీలను అమలుపర్చాలని కొఠారిని అడిగినట్లు లీకులు ఇవ్వడం దేనికని ప్రశ్నించారు. అసలు కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు ఎందుకు అల్టిమేటం ఇవ్వడం లేదని మండిపడ్డారు.
ఇక చంద్రబాబు తనయుడు లోకేశ్ వ్యవహారంపై అంబటి స్పందిస్తూ లోకేశ్కు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని, లేదంటే పదవులను త్యాగం చేస్తామని కొందరు సీనియర్ మంత్రులు అంటున్నారని, అసలు అలా త్యాగం చేయాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. వీళ్లంతా చంద్రబాబు ఆదేశాలమేరకు లోకేశ్కు భజన బృందంగా తయారయ్యారన్నారు. తనను పొగడటం మాని లోకేశ్ను పొగడాలని, అలా చేస్తేనే మంత్రులకు ఇక మంచి మార్కులు ఉంటాయని చంద్రబాబు చెప్పడం వల్లే వాళ్లు బాజాభజంత్రీలతో తెగ మోస్తున్నారని అన్నారు. చంద్రబాబుకు 60 విద్యలు తెలిస్తే లోకేశ్ కు డబుల్ విద్యలు తెలుసిని దుయ్యబట్టారు.
లోకేశ్కు వైశ్రాయ్ విద్యలు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే విద్య, కబ్జా చేయడంలో కూడా గొప్ప విద్య నేర్చుకున్నారని అన్నారు. కబ్జాలు చేసే విషయంలో బాబుది డిగ్రీ అయితే.. లోకేశ్ ది పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని విమర్శించారు. ఈ రెండేళ్ల కాలంలో దౌర్భాగ్య పాలన చేశారని అది బాబుది కాదని లోకేశ్ దే అని చెప్పారు. రాజ్యాంగేతర శక్తిగా ఉన్న లోకేశ్ బాబు.. రాజ్యాంగ శక్తిగా వచ్చేందుకు ఉవ్విళ్లూరుతున్నారని చెప్పారు. అందుకే మంత్రులంతా బాజాభజంత్రీలు వాయిస్తున్నారన్నారు.
లోకేశ్ ది ఐరన్ లెగ్ అని, వచ్చి రాగానే మనీ ట్రాన్స్ఫర్ స్కీం అంటూ ఘోరంగా వైఫల్యం చెందిన విషయం అందరికి తెలుసని అన్నారు. హైదరాబాద్ కార్పొరేషన్లో ఎన్ని సీట్లు లోకేశ్ వల్ల వచ్చాయో అందరికీ తెలుసని, అది మాములు ఫలితాలు కావని.. ఎంతో కష్టపడి ఒక్కటంటే ఒక్కటే స్థానం దక్కించుకున్నాడని అన్నారు. ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీని భూస్థాపితం చేయడానికి లోకేశ్ పుట్టాడని అన్నారు.