అమరావతిలో ‘లండన్ ఐ’ | 'London Eye' in Amravati | Sakshi
Sakshi News home page

అమరావతిలో ‘లండన్ ఐ’

Published Sat, Mar 12 2016 3:28 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

అమరావతిలో ‘లండన్ ఐ’ - Sakshi

అమరావతిలో ‘లండన్ ఐ’

అలాంటి కేంద్రం ఏర్పాటుకు సీఎం పరిశీలన
 
 సాక్షి, హైదరాబాద్: లండన్‌లోని థేమ్స్ నది ఒడ్డున ఆకర్షణీయ పర్యాటక స్థలం ‘లండన్ ఐ’ తరహాలో అమరావతి నగరంలో పర్యాటక ఆకర్షక కేంద్రం ఏర్పాటుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం చంద్రబాబు నేతృత్వంలోని బృందం శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటలకు ఢిల్లీ నుంచి లండన్ బయలుదేరి వెళ్లింది. లండన్ పార్లమెంట్ స్క్వేర్‌లోని మహాత్మాగాంధీ విగ్రహానికి చంద్రబాబు నివాళులు అర్పించారు. తొలుత ఆయన థేమ్స్ నది ఒడ్డున ఉన్న లండన్ ఐని సందర్శించారు. అనంతరం వాణిజ్య, వ్యాపారవేత్తలతో తూర్పు లండన్‌లోని ద్వీప ప్రాంతమైన కేనరీ వార్ఫ్‌లో చంద్రబాబు భేటీ అయ్యారు. వారిని అమరావతి అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందిగా కోరారు. కేనరీ వార్ఫ్‌ను ఆర్థిక జిల్లాగా ఒక ప్రైవేటు సంస్థ అభివృద్ధి చేసింది.

 20 కంపెనీల పవర్ పాయింట్ ప్రజంటేషన్
 చంద్రబాబుతో భేటీ అయితే లండన్ స్టాక్ ఎక్స్చేంజి  సీఈవో నిఖిల్ రాఠీ, ప్రతినిధులు తమ సంస్థపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఆర్థిక జిల్లా ఏర్పాటు, అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన, వాటికి ఆర్థిక వనరులు సమకూర్చటం, అమరావ తిలో భాగస్వామ్య అవకాశాలపై ఆ సంస్థ ప్రతినిధులతో  సీఎం చర్చించారు. అమరావతికి అవసరమైన నిధుల సమీకరణలో సాయం చేసేందుకు లండన్ స్టాక్ ఎక్స్చేంజి ముందుకు వచ్చింది.

యూకేలో స్మార్ట్ సిటీ నైపుణ్యంపై చంద్రబాబు బృందానికి 20 కంపెనీల ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ లండన్ అథారిటీ, ఆర్‌ఐసీఎస్, ఐకాం, బెనాయ్, అరూప్, మోట్ మ్యాక్ డొనాల్ట్, కెటపల్ట్, స్టాడ్‌వీఅరేనా, వొడాఫోన్, రోల్స్ రాయిస్, హెర్బట్ స్మిత్ ఫ్రీహిల్స్, జేసీబీ, యూకే ఎక్స్‌పోర్ట్ ఫైనాన్స్,  ఏఆర్‌ఎం, మేస్, గ్లీడ్స్ తదితర సంస్థలు పాల్గొన్నాయి. అమరావతి వచ్చి పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఈ సందర్భంగా కంపెనీలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. సానుకూలంగా స్పందించిన కంపెనీలు వెంటనే అమరావతికి తమ బృందాలను పంపిస్తామని సీఎంకు హమీనిచ్చాయి. ఈ పర్యటనలో సీఎం వెంట మంత్రులు యనమల రామకృష్ణుడు, పి నారాయణ, గంటా శ్రీనివాసరావు, సీఎం కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్, మౌలిక సదుపాయాల కల్పన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ పలువురు అధికారులు పాల్గొన్నారు. లండన్ పర్యటనలో భాగంగా చంద్రబాబు స్థానికంగా ఉన్న తెలుగు వారితో సమావేశం కానున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement