London Stock Exchange
-
గిఫ్ట్ సిటీ, ఎల్ఎస్ఈలలో లిస్టింగ్
న్యూఢిల్లీ: రుణ సెక్యూరిటీలు, షేర్లను ఐఎఫ్ఎస్సీ–గిఫ్ట్ సిటీతోపాటు.. లండన్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎల్ఎస్ఈ)లలో లిస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇందుకు యూకేతో కలసి అవకాశాలను అన్వేషిస్తున్నట్లు తెలియజేశారు. గిఫ్ట్ సిటీలో కార్యకలాపాల విస్తరణకు యూకే సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. వేగవంత, విస్తార ఫిన్‌టెక్ భాగస్వామ్యానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలియజేశారు. ఇండియా– యూకే 12వ ఎకనమిక్, ఫైనాన్షియల్ సదస్సు ముగింపు సందర్భంగా సీతారామన్ పలు అంశాలను వెల్లడించారు. ఐఎఫ్ఎస్సీ లిస్టింగ్‌తో ప్రారంభించి తదుపరి లండన్ లిస్టింగ్‌వైపు దృష్టిపెట్టనున్నట్లు గతంలోనే పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. వెరసి తొలుత ఐఎఫ్ఎస్సీ లిస్టింగ్‌నకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలియజేశారు. ఈ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విదేశీ పెట్టుబడులను సమకూర్చుకునేందుకు మసాలా, గ్రీన్ బాండ్లను సైతం రుణ సెక్యూరిటీల లిస్టింగ్ జాబితాలో చేర్చనున్నట్లు పేర్కొన్నారు. ఇక ఎల్ఎస్ఈలో భారత కంపెనీల ప్రత్యక్ష లిస్టింగ్ ప్రణాళికలను యూకే ఆర్థిక మంత్రి జెరెమీ హంట్ ఈ సందర్భంగా ప్రశంసించారు. -
లండన్ బ్రిడ్జి ఉగ్రవాది.. పాత నేరస్తుడే
లండన్: లండన్‌లోని ‘లండన్ బ్రిడ్జి’పై శుక్రవారం కత్తితో పొడిచి ఇద్దరిని హతమార్చిన ఉగ్రవాది ఉస్మాన్‌ఖాన్(28) గతంలో ఉగ్రవాద నేరాలపై ఏడేళ్ల క్రితం శిక్ష అనుభవించిన విషయాన్ని స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు వెల్లడించారు. లండన్ స్టాక్ ఎక్సే్ఛంజిపై బాంబు దాడికి యత్నించినందుకు, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద శిక్షణ శిబిరాన్ని నడిపినందుకు ఉస్మాన్‌ఖాన్‌కు గతంలో జైలుశిక్ష పడింది. జైలు శిక్ష అనుభవిస్తున్న ఉస్మాన్.. పెరోల్‌పై బయటికొచ్చి శుక్రవారం లండన్ బ్రిడ్జిపై పేట్రేగిపోయాడు. కత్తితో పొడిచి ఇద్దరిని హతమార్చిన ఉస్మాన్ మరో ముగ్గురిని గాయపరిచాడు. ఉస్మాన్‌కు ఉగ్రనేరాలపై 2012లో శిక్ష పడింది. 2018లో లైసెన్స్ (పెరోల్)పై జైలు నుంచి విడుదలయ్యాడు. -
లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో యాక్సిస్ బ్యాంక్ గ్రీన్ బాండ్లు
లండన్: లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో గ్రీన్ బాండ్ల జారీ ద్వారా ప్రైవేట్ రంగంలోని యాక్సిస్ బ్యాంక్ 50 కోట్ల డాలర్లు సమీకరించింది. అంతర్జాతీయంగా లిస్టైన తొలి భారత గ్రీన్ బాండ్ ఇది. యాక్సిస్ బ్యాంక్ గ్రీన్ బాండ్‌ను క్లైమెట్ బాండ్స్ స్టాండర్డ్స్ బోర్డ్ సర్టిఫై చేసింది. ఈ గ్రీన్ బాండ్ల ద్వారా సమీకరించిన నిధులను హరిత ఇంధనోత్పత్తి, రవాణా, మౌలిక ప్రాజెక్టుల్లో ఇన్వెస్ట్ చేస్తామని బ్యాంక్ తెలిపింది. 2022 కల్లా 1,75,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుదుత్పత్తి చేయాలన్న భారత ప్రభుత్వ లక్ష్యానికి తోడ్పాటునందిస్తామని యాక్సిస్ బ్యాంక్ ఎండీ, సీఈఓ శిఖ శర్మ చెప్పారు. గ్రీన్ బాండ్ల లిస్టింగ్ విషయంలో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ అగ్రస్థానంలో ఉంది. కాగా 500కోట్డ డాలర్ల మీడియమ్ టర్మ్ నోట్(ఎంటీఎఎన్) ప్రోగ్రామ్ కింద యాక్సిస్ బ్యాంక్ జారీ చేసిన తొలి గ్రీన్ బాండ్ ఇదని శిఖ శర్మ పేర్కొన్నారు. -
అమరావతిలో ‘లండన్ ఐ’
అలాంటి కేంద్రం ఏర్పాటుకు సీఎం పరిశీలన సాక్షి, హైదరాబాద్: లండన్‌లోని థేమ్స్ నది ఒడ్డున ఆకర్షణీయ పర్యాటక స్థలం ‘లండన్ ఐ’ తరహాలో అమరావతి నగరంలో పర్యాటక ఆకర్షక కేంద్రం ఏర్పాటుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం చంద్రబాబు నేతృత్వంలోని బృందం శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటలకు ఢిల్లీ నుంచి లండన్ బయలుదేరి వెళ్లింది. లండన్ పార్లమెంట్ స్క్వేర్‌లోని మహాత్మాగాంధీ విగ్రహానికి చంద్రబాబు నివాళులు అర్పించారు. తొలుత ఆయన థేమ్స్ నది ఒడ్డున ఉన్న లండన్ ఐని సందర్శించారు. అనంతరం వాణిజ్య, వ్యాపారవేత్తలతో తూర్పు లండన్‌లోని ద్వీప ప్రాంతమైన కేనరీ వార్ఫ్‌లో చంద్రబాబు భేటీ అయ్యారు. వారిని అమరావతి అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందిగా కోరారు. కేనరీ వార్ఫ్‌ను ఆర్థిక జిల్లాగా ఒక ప్రైవేటు సంస్థ అభివృద్ధి చేసింది. 20 కంపెనీల పవర్ పాయింట్ ప్రజంటేషన్ చంద్రబాబుతో భేటీ అయితే లండన్ స్టాక్ ఎక్స్చేంజి సీఈవో నిఖిల్ రాఠీ, ప్రతినిధులు తమ సంస్థపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఆర్థిక జిల్లా ఏర్పాటు, అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన, వాటికి ఆర్థిక వనరులు సమకూర్చటం, అమరావ తిలో భాగస్వామ్య అవకాశాలపై ఆ సంస్థ ప్రతినిధులతో సీఎం చర్చించారు. అమరావతికి అవసరమైన నిధుల సమీకరణలో సాయం చేసేందుకు లండన్ స్టాక్ ఎక్స్చేంజి ముందుకు వచ్చింది. యూకేలో స్మార్ట్ సిటీ నైపుణ్యంపై చంద్రబాబు బృందానికి 20 కంపెనీల ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ లండన్ అథారిటీ, ఆర్ఐసీఎస్, ఐకాం, బెనాయ్, అరూప్, మోట్ మ్యాక్ డొనాల్ట్, కెటపల్ట్, స్టాడ్వీఅరేనా, వొడాఫోన్, రోల్స్ రాయిస్, హెర్బట్ స్మిత్ ఫ్రీహిల్స్, జేసీబీ, యూకే ఎక్స్పోర్ట్ ఫైనాన్స్, ఏఆర్ఎం, మేస్, గ్లీడ్స్ తదితర సంస్థలు పాల్గొన్నాయి. అమరావతి వచ్చి పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఈ సందర్భంగా కంపెనీలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. సానుకూలంగా స్పందించిన కంపెనీలు వెంటనే అమరావతికి తమ బృందాలను పంపిస్తామని సీఎంకు హమీనిచ్చాయి. ఈ పర్యటనలో సీఎం వెంట మంత్రులు యనమల రామకృష్ణుడు, పి నారాయణ, గంటా శ్రీనివాసరావు, సీఎం కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్, మౌలిక సదుపాయాల కల్పన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ పలువురు అధికారులు పాల్గొన్నారు. లండన్ పర్యటనలో భాగంగా చంద్రబాబు స్థానికంగా ఉన్న తెలుగు వారితో సమావేశం కానున్నారు. -
పౌండ్ల రూపంలో బాండ్ల జారీకి ఎయిర్టెల్ రెడీ
బాండ్ల విలువ రూ.5,000 కోట్లు న్యూఢిల్లీ: దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ రూ.5,000 కోట్ల(50 కోట్ల గ్రేట్ బ్రిటన్ పౌండ్) స్టెర్లింగ్ బాండ్లను జారీ చేయనున్నది. ఈ బాండ్లను లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్ట్ చేస్తామని ఎయిర్టెల్ గ్రూప్ కోశాధికారి హర్జిత్ కోహ్లి చెప్పారు. ఈ బాండ్ల జారీ ద్వారా సమీకరించిన మొత్తంతో ప్రస్తుతమున్న రుణాలను రీ ఫైనాన్స్ చేస్తామని చెప్పారు. అంతర్జాతీయంగా రుణ పరిస్థితులు, మార్కెట్ల స్థితిగతులు వంటి అంశాలతో పాటు వివిధ సంస్థల నుంచి అనుమతులు రావల్సి ఉందని పేర్కొన్నారు. ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని ఈ బాండ్లు ఎప్పుడు జారీ చేసేదీ వెల్లడిస్తామని తెలిపారు. ఇప్పటికే డాలర్లు, యూరోలు, క్రోనార్ కరెన్సీల్లో బాండ్లను జారీ చేశామని, ఈ బాండ్లను సింగపూర్, ఫ్రాంక్ఫర్ట్, స్విట్జర్లాండ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ల్లో లిస్ట్ చేశామని వివరించారు.