ఎంత కఠినం
సోషల్ మీడియాలో పుడుతున్న లవ్
అపనమ్మకం, మనస్పర్థలతో బ్రేకప్
బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్న కొందరు యువకులు
సోషల్ మీడియా.. భావాలను పంచుకునేందుకు అత్యంత వేగవంతమైన ‘ఈ’ టెక్నాలజీ. ఇప్పటి ఫాస్ట్ జనరేషన్‌కు తగ్గట్టుగా వచ్చిన ఫేస్‌బుక్, ట్విట్టర్, హైక్, వాట్సప్ వంటి వాటిలో రిలేషన్‌షిప్స్, బ్రేకప్స్ కూడా అంతే వేగంగా జరిగిపోతున్నాయి. తొలినాళ్లలో మనస్తత్వం నచ్చి తిరిగిన యువతీ యువకులు.. ఆ తర్వాత ఏదో కారణంతో బ్రేకప్ చేప్పేసుకుంటున్నారు. కొంతమంది తమ ప్రేమ పెళ్లి వరకు వెళ్లకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. కొందరు అబ్బాయిలు సైకోలుగా మారి అమ్మాయిని పీడించి బలవన్మరణానికి పాల్పడేలా చేస్తున్నారు. అలాంటి వాటిలో కొన్ని..– సాక్షి, సిటీబ్యూరో
మోసాన్ని తట్టుకోలేక..
ఉష ప్రముఖ చానల్‌లో యాంకర్. సోషల్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌లో ఆమెను వేలాది మంది ఫ్యాన్స్ అనుకరిస్తున్నారు. ఫొటోలకు లక్షల్లో లైక్స్.. అందులో కొంత మంది ఫ్యాన్స్ పెట్టిన కామెంట్లకు రెస్పాన్స్ ఇచ్చింది. అలా రమేశ్ పరిచయమయ్యాడు. డైరెక్ట్ కలవకుండానే ఓ సంవత్సరం పాటు ఫేస్‌బుక్, వాట్సప్‌లో చాటింగ్ చేసుకుంటూ ఒకరికొకరు స్నేహితులుగా మారారు. ఆ తర్వాత స్నేహం కాస్త ప్రేమగా మారి చివరకు సహజీవనానికి దారితీసింది. ఇలా నాలుగేళ్లు బాగానే సాగింది. అమ్మాయి వివాహం ప్రస్తావన ఎత్తేసరికి అబ్బాయి ప్లేట్ ఫిరాయించాడు. దీంతో మనస్థాపం చెందిన ఆమె ఆత్మహత్య చేసుకుంది. ‘నన్ను అభిమానించే ఫ్యాన్స్ అందరికీ బై, నన్ను ఇన్నాళ్లు అభిమానించిన నా ఫ్యాన్స్‌ను మిస్సైతున్నా’ అని ఫేస్‌బుక్‌లో చివరి పోస్టు చేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.
‘లొంగలేదని’ దారుణం
ఉద్యోగ కోసం వరంగల్ నుంచి వచ్చిన రణధీర్, కరీంనగర్ నుంచి వచ్చిన లావణ్యకు జాబ్ కన్సల్టెన్సీలో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరికి వేర్వేరు కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చినప్పటికీ, వారి పరిచయాన్ని వాట్సప్ స్నేహంగా మార్చింది. ఇలా కొన్ని నెలల్లోనే ప్రేమపక్షుల్లాగా మారి సిటీలోని అన్ని ప్రాంతాల్లో చక్కర్లు కొడుతూ కలిసి ఫొటోలు దిగారు. ఆ తర్వాత అబ్బాయి తీరు నచ్చని అమ్మాయి వాట్సప్‌ను బ్లాక్ చేసింది. దీంతో ఆమెను వశం చేసుకోవాలనుకున్న రణధీర్.. ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలను, సన్నిహితంగా ఉన్న వీడియోలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేస్తానని తరచూ అమ్మాయికి మెసేజ్‌లు పంపేవాడు. ఈ బెదిరింపులకు లావణ్య భయపడలేదు. అయితే రోజుకో ఫొటో ఫేస్‌బుక్‌లో పోస్టు చేసేసరికి అమ్మాయి స్నేహితులు, కుటుంబ సభ్యులు వాటిని చూశారు. దీంతో తనకు నలుగురిలో అవమానం జరిగిందని లావణ్య.. రణధీర్‌కు ఫోన్ చేసి ఆ పోస్టును, ఫొటోలు డిలీట్ చేయాలని కోరింది. అయితే, తాను కోరినప్పుడు కలవాలని, లక్షల్లో డబ్బులివ్వాలని బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టాడు. దీన్ని తట్టుకోలేక మనస్థాపం చెందిన లావణ్య హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
తన ప్రేమను నమ్మలేదని..
అబ్బాయి పేరు అభిలాష్, అమ్మాయి పేరు నేహ. నగరంలోని ఓ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఇద్దరూ ఫేస్‌బుక్ ద్వారా స్నేహితులయ్యారు. అభిలాష్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. నేహ హైదరాబాద్‌లోనే చదువు కొనసాగించింది. మనుషులు దూరమైనా ప్రతిరోజూ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వాట్సప్, ఫేస్‌బుక్ చాట్‌లో ప్రతి విషయం షేర్ చేసుకునేవారు. అలా ఏడాది గడిచాక అబ్బాయి అమెరికాలో ఇతర అమ్మాయిలతో కలిసి దిగిన ఫొటోలు ఫేస్‌బుక్ పేజీలో కనిపించడంతో నేహ ఆవేదనకు గురై ‘లవ్ బ్రేకప్’ విషయం అబ్బాయికి తెలియచేసింది. రెండు నెలలు పాటు నేహకు నచ్చజెప్పేందుకు అభిలాష్ ప్రయత్నించాడు. ఆమె ఎంతకీ స్పందించలేదు. నేహ వేరే యువకుడితో పెళ్లికి సిద్ధమైందన్న వార్త తెలిసి అభిలాష్ స్నేహితుల సహాయంతో నేహతో ఓసారి ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడేందుకు ఒప్పించాడు. తన ప్రేమను నేహ ఎంతటికీ నమ్మకపోవడంతో ఫేస్‌బుక్ లైవ్‌లో ఆమె చూస్తుండగానే అభిలాష్ ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.