ప్రత్యూష ఆస్తి నాకేం అవసరం లేదు...
హైదరాబాద్: 'ప్రత్యూష పేరు మీద ఉన్న ఆస్తి ఒక్క రూపాయి కూడా నాకు వద్దు. తనపై జాలితోనే నాకు ప్రేమ పుట్టింది. ప్రత్యూషకు ఉన్న ఆస్తి రూ.2 కోట్లు అనాథాశ్రమానికి రాసి కట్టుబట్టలతో వచ్చినా ఆమెను మంచిగా చూసుకుంటాను' అని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన బాల మద్దులేటి రెడ్డి, తులసమ్మల కుమారుడు వెంకట మద్దులేటి రెడ్డి చెప్పాడు.
బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావును నిన్న మద్దులేటి రెడ్డి కలసి ప్రత్యూషతో తన ప్రేమ వ్యవహారాన్ని వివరించారు. నారాయణగూడలోని కుబేరా టవర్స్‌లో అచ్యుతరావుతో కలసి మద్దులేటి రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ప్రత్యూష చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో నా స్నేహితుడి బంధువులు అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
వారిని చూసేందుకు వెళ్లినప్పుడే నేను ప్రత్యూషను కలిశాను. అలా మా పరిచయం పెరిగింది. నేను రిజిష్టర్ బుక్‌లో రాసిన వివరాల ఆధారంగా ప్రత్యూష నాకు ఫోన్ చేసింది. ‘నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటారా’ అని అడిగింది. నాక్కూడా తనపై ఇష్టం ఉన్నందున వెంటనే ఒప్పుకున్నాను’’ అని చెప్పాడు. ఇప్పటికే తన తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడించానని, ఆమె ప్రేమ విషయాన్ని, మాటలు అన్నీ రికార్డ్ చేశానని, అవన్నీ భద్రంగా ఉంచానని తెలిపాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పుకుని ప్రత్యూషతో తన వివాహం జరిపించాలని కోరారు.
ఆపదలో ఉన్న ప్రత్యూషను అక్కున చేర్చుకుని తన రెండో కుమార్తెగా భావిస్తున్న సీఎం కేసీఆర్ అందరి హృదయాలను గెలుచుకున్నారని, ప్రత్యూష కోరుకున్న వ్యక్తితో వివాహాన్ని జరిపించి మనవతా దృక్పథాన్ని చాటుకోవాలని అచ్యుతరావు కోరారు. కేసీఆర్ మాదిరిగానే ఏపీ సీఎం చంద్రబాబు కూడా స్పందించి మద్దులేటిరెడ్డిని ఏపీ రాష్ట్రం తరఫున దత్తత తీసుకుంటే ఇద్దరు ముఖ్యమంత్రులు వియ్యంకులవుతారన్నారు.