
లిఫ్ట్ తలపై పడి ఒకరి మృతి
హైదరాబాద్: సరిగా పనిచేయని లిఫ్ట్‌ను ఉపయో గించబోయి.. అది తలపై పడడంతో బుధవారం డి.శ్రీనివాస్ అనే వ్యాపారి మృతి చెందాడు. హైదరా బాద్ చింతల బస్తీలోని భవిష్య్ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీనివాస్‌కు భార్య సునీత, ముగ్గురు పిల్లలు మౌనిక, రితిక, ముకుంద్ ఉన్నారు. ఉదయం 7.30 గంటల సమయంలో తన కుమారుడు ముకుంద్‌ను స్కూల్‌కు పంపేందుకు శ్రీనివాస్ లిఫ్ట్ వద్దకు వచ్చారు. అక్కడి బటన్‌ను రెండు మూడు సార్లు నొక్కినా లిఫ్ట్ రాకపోవడంతో చెక్క తలుపు మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలోంచి లోపలకు తల పెట్టి చూశారు. అదే సమయంలో లిఫ్టు పైనుంచి వేగంగా కిందకు వచ్చి శ్రీనివాస్ తలపై పడడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
దీనిని గమనించిన చుట్టుపక్కల ఫ్లాట్ల వారు వెంటనే ఆయనను అంబులెన్స్‌లో బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. కానీ, శ్రీనివాస్ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా.. ఈ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ సరిగ్గా పనిచేయడం లేదని, దానిని ఉపయోగించవద్దని నిర్వాహకులు సూచించినట్లు తెలిసింది. అయినా కొందరు ఉపయోగిస్తున్నారు.