భార్యతో గొడవపడి ఇంటికి నిప్పు పెట్టాడు!
హైదరాబాద్: మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి భార్యతో గొడవపడి తన ఇంటికే నిప్పు పెట్టుకున్న ఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి అపార్టుమెంట్ మొత్తం పొగ వ్యాపించింది. ఫైర్ సిబ్బంది సకాలంలో మంటలను ఆర్పివేయడంతో పెనుప్రమాదం తప్పింది.
పోలీసుల కథనం ప్రకారం.. మైసమ్మగూడకు చెందిన చింతల రాజు, మంజుల, తన ఇద్దరు కుమారులతో కలిసి బహదూర్‌పల్లిలోని మహేశ్ క్యాసిల్ అపార్టుమెంట్‌లోని 204 ఫ్లాట్‌లో ఉంటున్నాడు. శనివారం రాత్రి 10 గంటల తప్పతాగి ఇంటికి వచ్చిన రాజు భార్యతో గొడవపడ్డాడు. ఆగ్రహంతో ఊగిపోతూ ఇంట్లోని వస్తువులకు నిప్పుపెట్టాడు. క్షణాల్లో మంటలు వ్యాపించి దట్టమైగ అపార్టుమెంట్ మొత్తం అలుముకుంది. స్థానికులు దుండిగల్ పోలీసులు, ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. పక్కఫ్లాట్స్ ( 201, 203, 205) లో ఉండే వారు సెలవులకు ఊళ్లకు వెళ్లడంతో పెనుప్రమాదం తప్పింది. నిందితుడు రాజును పోలీసులు స్టేషన్‌కు తరలించారు.