సబర్మతి తరహాలో మానేర్ డ్యాం
టాటా గ్రూప్ ప్రతినిధులతో కేసీఆర్
- హైదరాబాద్‌కు మించిన ఆకర్షణలు.. ‘కరీంనగర్ అభివృద్ధి’పై సమీక్ష
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ లోయర్ మానేర్ డ్యాం రివర్ ఫ్రంట్‌ను అత్యద్భుత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ‘‘హైదరాబాద్‌లోని పర్యాటక స్థలాల్లో సైతం లేని ఆకర్షణలు కల్పించండి. కరీంనగర్ సమీప ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులంతా రివర్ ఫ్రంట్‌ను తప్పనిసరిగా సందర్శించేలా ప్రత్యేకతలు ఉట్టిపడాలి. ఆ మేరకు అవసరమైన సదుపాయాలు కల్పించాలి. హైదరాబాద్‌వాసులకు కూడా కరీంనగర్ వెళ్లి రివర్ ఫ్రంట్ చూసొద్దామనే ఆసక్తి కలగాలి’’ అని అభిప్రాయపడ్డారు. మానేర్ రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై కరీంనగర్ జిల్లా నేతలతో పాటు టాటా బృందంతో ముఖ్యమంత్రి మంగళవారం ప్రగతి భవన్‌లో చర్చలు జరిపారు.
ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్ తదితరులు భేటీలో పాల్గొన్నా రు. టాటా గ్రూప్ ప్రతినిధులు షనేశ్, సూర్యప్రకాశ్ తమ ప్రజంటేషన్‌ను సీఎంకు చూపించారు. ‘‘మానేర్ డ్యాంను పర్యాటక కేంద్రంగా, కరీంనగర్ నగరాన్ని టూరిస్ట్ హబ్‌గా రూపొందించడం మా ప్రాజెక్టు లక్ష్యం. కరీంనగర్‌లో మరిన్ని సాంస్కృతిక, ఆహ్లాదకర కార్యక్రమాలు రూపొందించాం. తెలంగాణ ఉద్యమాన్ని, చరిత్రను ప్రతిబిం బించేలా డిజైన్ చేశాం’’ అని వారు వివరించారు. దేశంలోనే తొలి రివర్ ఫ్రంట్‌గా గుర్తింపు పొందిన గుజరాత్‌లోని సబర్మతీ రివర్ ఫ్రంట్‌ను అధ్యయనం చేయాలని వారికి సీఎం సూచించారు. ‘‘అక్కడి ఆకర్షణలు, సదుపాయాలన్నీ మానేర్ డ్యాం వద్ద ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించండి.
కరీంనగర్ చరిత్రకు అద్దం పట్టేలా రూపొందించండి’’ అని కరీంనగర్ నగరాభివృద్ధి జిల్లా నేతలకు సీఎం పలు సూచనలు చేశారు. ‘‘నగరాన్ని అందంగా ఎలా మలచుకోవచ్చో ఎంపీ, ఎమ్మెల్యేలు ఆలోచించాలి. పచ్చదనముండాలి. రాగి, వేప, సిల్వర్ ఓక్ మొక్కలు పెంచాలి. ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలి. ఇందుకు ఒక అటవీ శాఖ అధికారిని ప్రత్యేకించాలి. శాతవాహన వర్సిటీ చుట్టూ కేబీఆర్ పార్క్ తరహాలో గ్రీన్ వాక్ వే ఏర్పాటు చేయాలి. వీటన్నింటికీ ఓ సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలి’8 అని సూచించారు. అభివృద్ధి ప్రణాళికపై చర్చించేందుకు జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలతో సీఎం బుధవారం మళ్లీ భేటీ కానున్నారు.