సాక్షి, హైదరాబాద్: గగనతల దాడులతోనైనా మావోయిస్టులను కట్టడి చేయాలని పోలీసులు ప్రణాళికలు రచిస్తుంటే.. విమానాలు, విమానాశ్రయాలపై దాడులు చేసి విధ్వంసాలు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు మావోయిస్టులు వ్యూహాలు రచిస్తున్నారు. విమానాశ్రయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా అసాల్ట్, డిమాలిషన్, సెక్యూరిటీ పేర్లతో మూడంచెల వ్యవస్థల్ని రూపొందిస్తున్నారు.
మావోయిస్టుల దాడుల వ్యూహంపై ముందస్తుగా ఉప్పందుకున్న నిఘా వర్గాలు ఏపీ సహా ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ప్రభుత్వాలను అప్రమత్తం చేశాయి. ఇటీవల ఛత్తీస్‌గఢ్ పోలీసులు స్వాధీనం చేసుకున్న కొన్ని పత్రాల్లోని వివరాల ఆధారంగా నిఘా వర్గాలు ఈ దాడుల అంశాలపై స్పష్టమైన అభిప్రాయానికి వచ్చాయి.
పటిష్టమైన దాడులు చేసేందుకు మావోయిస్టులు ఇప్పటికే సైన్యం తరహాలో సాయుధ బెటాలియన్లను ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ డీజీపీ ఎదుట ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు రవీందర్ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. తాను కూడా ఈ తరహా బెటాలియన్లను లీడ్ చేసినట్లు చెప్పాడు. మూడంచల్లో వ్యూహం రచిస్తున్నారు. వీటిలో.. అసాల్ట్ పార్టీ ముందుగా ఆయా సమాచార వ్యవస్థలపై దాడి చేసి ధ్వంసం చేస్తుంది. తర్వాత గార్డులు, విమానాశ్రయ సిబ్బందిపై విరుచుకుపడుతుంది.
సెక్యూరిటీ పార్టీ విమానాశ్రయంలో ఉన్న వారికి సాయం చేసేందుకు బయట నుంచి వచ్చే పోలీసులను అడ్డుకుంటుంది. మూడోదైన డిమాలిషన్ పార్టీ అదను చూసుకుని విమానాశ్రయంలో నిలిచి ఉన్న విమానాలు, రాడార్, రేడియో వంటి అంతర్గత సమాచార వ్యవస్థలతో పాటు ఇంధన డిపోలను ధ్వంసం చేస్తుంది.
విమానాశ్రయాలపై మావోల కన్ను!
Published Mon, Sep 1 2014 2:41 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement