‘సెటిల్’ చేసుకొని విడిపోయినా ఆమె పగ చల్లారలేదు
*వివాహిత దారుణ హత్య
*భర్త వ్యాపార భాగస్వామే సూత్రధారి
*నిందితులలో పోలీసు కాంట్రాక్ట్ ఉద్యోగి
*అంబర్‌పేట్ పోలీసుల తీరుపై విమర్శలు
సాక్షి, హైదరాబాద్: వ్యాపార లావాదేవీల్లో తలెత్తిన వివాదం భాగస్వాముల మధ్య స్పర్థలకు దారి తీసింది. ఫలితంగా ఇద్దరూ ‘సెటిల్’ చేసుకొని విడిపోయారు. అయినా అతనిపై ఆమెకు ద్వేషం తగ్గలేదు. పగ చల్లారలేదు.దీంతో ఓ నిండు ప్రాణం గాలిలో కలసిపోయింది. ఒక ఠాణా అధికారుల నిర్లక్ష్యం కుట్రకు దారి తీయగా... మరో పోలీస్ స్టేషన్ అధికారుల అలసత్వం పదేళ్ల బిడ్డకు కన్నతల్లిని దూరం చేసింది.
ఇవీ బుధవారం అత్తాపూర్‌లోని పిల్లర్ నెం.113 వద్ద మూసీ నదిలో ముక్కలుగా లభించిన సునీత హత్య వెనుక ఉన్న కఠోర వాస్తవాలు. మహిళల రక్షణకు పెద్దపీట వేస్తున్నామని, వారికి ఎదురయ్యే సమస్యలపై తక్షణం స్పందిస్తామని చెప్పుకుంటున్న పోలీసు ఉన్నతాధికారులు సునీత కేసులో సిబ్బంది చూపిన నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించి, బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం కోరుతోంది.
అసలేమైందంటే...
అంబర్‌పేట్ ప్రాంతానికి చెందిన కృష్ణ, అదే ప్రాం తంలో నివసించే ఓ మహిళ, మరికొందరు కలిసి కొన్నేళ్ల క్రితం సనత్‌నగర్ ప్రాంతంలో ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీని స్థాపించారు. ఇందులో కృష్ణ భార్య సునీత (44)తో పాటు మరికొందరూ డెరైక్టర్లుగా ఉన్నారు. సంస్థకు సంబంధించిన వివాదాలపై కంపెనీ లా బోర్డ్‌తో పాటు ఇతర చోట్లా భాగస్వాములపై కృష్ణ వ్యాజ్యాలు దాఖలు చేశారు. దీంతో కక్షకట్టిన భాగస్వామ్య మహిళ తనకు మాజీ హోం మంత్రి సహా మరికొందరితో దగ్గరి బంధుత్వం ఉందని బెదిరించింది.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 10న లావాదేవీలు సెటిల్ చేసుకున్న కృష్ణ కంపెనీ నుంచి పూర్తిగా తప్పుకున్నారు. అయినప్పటికీ తనపై వ్యాజ్యాలు దాఖలు చేశాడని ఆ మహిళ కృష్ణపై కక్ష పెంచుకుంది. తనకు పరిచయస్తుడైన జగన్నాథనాయుడిని రంగంలోకి దింపింది. ఆయన వివిధ ఠాణాల్లో పార్ట్‌టైమ్ రైటర్‌గా విధులు నిర్వర్తిస్తుంటాడు. అతడి సహకారంతో కృష్ణ మాజీ భాగస్వామి ఈ ఏడాది మార్చి 14న సనత్‌నగర్ ఠాణాకు చెందిన ఓ ఎస్సైతో పాటు మరికొందరు కానిస్టేబుళ్లనూ రంగంలోకి దింపింది.
ఆ రోజు కృష్ణ ఇంటికి వెళ్లిన బృందం మూసాపేట్‌లో జరిగిన అనిల్ అనే వ్యక్తి హత్య కేసులో అనుమానితుడిగా ఆరోపిస్తూ సనత్‌నగర్ ఠాణాకు తీసుకువచ్చారు. ఆ సమయంలో అక్కడే ఉన్న జగన్నాథనాయుడు కల్పించుకుంటూ మాజీ భాగస్వామి అయిన మహిళతో ఎందుకు స్పర్థలు పెంచుకున్నావంటూ కృష్ణను బెదిరించాడు. కొన్ని తెల్లకాగితాలపై సంతకాలు పెట్టాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. అయినా ఫలితం లేకపోవడంతో కృష్ణను వదిలేశారు.
దారుణంగా చంపేసి, ముక్కలుగా నరికేసి
ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో కృష్ణ ఈ విషయాన్ని ఎక్కడా చెప్పలేదు. ఇంతలో బీహార్‌లోని పాట్నాలో ఉద్యోగం రావడంతో కుటుంబాన్ని ఇక్కడే వదిలి, అక్కడికి వెళ్లిపోయారు. అదే సమయంలో జగన్నాథనాయుడు సహా మరికొందరు కృష్ణపై కక్ష తీర్చుకునేందుకు ఆయన భార్యకు హాని చేయాలని పథకం వేశారు.
ఇదిలా ఉండగా... ఈ ఏడాది మార్చి 10న సైబరాబాద్ పోలీసులు ఓ వ్యభిచార గృహంపై దాడి చేసి కుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడితో పాటు అతడి సెల్‌ఫోన్‌నూ సనత్‌నగర్ ఠాణాలో అప్పగించారు. రైటర్‌గా పని చేస్తున్న జగన్నాథనాయుడుఆ సెల్‌ఫోన్‌లోని సిమ్‌ను చేజిక్కించుకుని దాని ద్వారానే తన కుట్రను అమలు చేశాడు.
సనత్‌నగర్ ఠాణా అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని సిమ్‌కార్డును దొరకబుచ్చుకున్నాడు. దాని ద్వారా ఏప్రిల్ 23 నుంచి సునీతతో సంప్రదింపులు జరుపుతూ ఆమెకు ఉచ్చు బిగించారు. గత నెల 16న మాయమాటలు చెప్పి ఇంటి నుంచి బయటకు రప్పించిన జగన్నాథనాయుడు బృందం ఆమెను కిడ్నాప్ చేశారు. తాను దూరంగా వెళ్లిపోతున్నానంటూ ఆమె సెల్‌ఫోన్ నుంచి భర్తతో పాటు మరికొందరికి ఎస్సెమ్మెస్‌లు పెట్టి ఫోన్‌ను అంబర్‌పేట్‌లోనే పడేశాడు.
నేరుగా అత్తాపూర్‌లోని పిల్లర్ నెం.113 వద్దకు తీసుకువెళ్లి దారుణంగా హత్య చేసి ముక్కలుగా నరికేశారు. మృతదేహం ఎవరికీ దొరకకూడదనే ఉద్దేశంతో గోనె సంచుల్లో పెట్టి మూసీ నదిలో పడేశారు. తన భార్య సెల్ నుంచి వచ్చిన ఎస్సెమ్మెస్ చూసి కంగారుపడిన కృష్ణ అంబర్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు.
బాధ్యత మరిచి హేళన చేసిన ఖాకీలు...
ఓ పక్క తన భార్య కనిపించ డం లేదని ఆందోళనలో ఉన్న కృష్ణకు అంబర్‌పేట్ పోలీసుల నుంచి సహకారం లభించకపోగా, సూటిపోటి మాటలు, హేళనలు ఎదురయ్యాయి. పరిస్థితిని గమనించిన కృష్ణ అతి కష్టం మీద సనత్‌నగర్ ఠాణా నుంచి గల్లంతైన సిమ్‌కార్డు ద్వారానే తన భార్యతో దుండగులు సంప్రదింపులు జరిపినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని అంబర్‌పేట్ పోలీసులకు తెలిపి, ఓ ఎస్సైతో కలిసి సనత్‌నగర్ ఠాణాకు వెళ్లి దీన్ని నిర్ధారించుకున్నారు. అయినా సరైన స్పందన లేకపోయింది. సనత్‌నగర్ ఠాణా సైబరాబాద్ పరిధిలోకి వస్తుందని తెలుసుకున్న ఆయన శుక్రవారం పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌ను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు.
కేసును మానవతా దృక్పథంతో పరిశీలించిన ఆయన పరిధుల విషయం పక్కనపెట్టి తక్షణం స్పందించారు. తమ సిబ్బందినే రంగంలోకి దింపి వివిధ కోణాల్లో దర్యాప్తు చేయించారు. ఈలోగా అంబర్‌పేట్ అధికారులూ కదిలారు. జగన్నాథనాయుడిని అనుమానించి బుధవారం అదుపులోకి తీసుకుని విచారించగా... నేరం అంగీకరించాడు. అత్తాపూర్ బ్రిడ్జి వద్దకు వచ్చిన అధికారులు మృతదేహం కోసం సాయంత్రం వరకు గాలించినా దొరకలేదు.
చివరకు జగన్నాథనాయుడిని సంఘటనా స్థలానికి తీసుకువచ్చి వెతకగా... సునీత తల, మరికొన్ని భాగాల మినహా మృతదేహం దొరికింది. మృతదేహంలోని మిగిలిన ముక్కల కోసం గాలిస్తున్న పోలీసులు ఈ హత్యతో సంబంధం ఉన్న ఇతర నిందితుల కోసం వేట మొదలుపెట్టారు.అంతవరకూ బాగానే ఉంది. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకుంటారోనని అందరూ చర్చించుకుంటున్నారు.