సాక్షి, హైదరాబాద్: పరీక్షల్లో చూచిరాతల వల్ల విద్యావ్యవస్థ నాశనమవుతోందని హై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తల్లిదండ్రులు తమ పిల్లలకు 90% మార్కులు రావాలని కోరుకుంటున్నారని, అవి ఎలా వచ్చినా ఫర్వాలేదనే ధోరణితో ఉన్నారని పేర్కొంది. కాపీ కొట్టి రాశారా? చదివి రాశారా? అనేది పట్టించుకోవడం లేదని, ఇది ఎంత మాత్రం హర్షణీయం కాదంది. ‘జ్ఞానంతో పనిలేకుండా మార్కులు వస్తే చాలనుకుంటున్నారు. తల్లిదండ్రులుగా బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నామా? పిల్లలు చూసి రాస్తే టీచర్లపై (ఇన్విజిలేటర్లు) క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. అప్పుడే పరిస్థితిలో మార్పు వస్తుంది.
ఎక్కడో ఓచోట కఠిన చర్యలు ప్రారంభించాలి. మాస్ కాపీ యింగ్‌కు జిల్లా విద్యాశాఖ అధికారులు, ముఖ్య కార్యదర్శులను వ్యక్తిగతంగా బాధ్యు లుగా చేస్తే సరైన ఫలితం ఉంటుంది’ అని హైకోర్టు స్పష్టం చేసింది. సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, బాధ్యు లైన అధికారులపై తీసుకుంటున్న చర్యలను వివరించాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ మంతోజ్ గంగారావుతో కూడిన ధర్మాసనం మంగళ వారం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో మాస్ కాపీయింగ్, పుస్తకాలు చూసి రాయటాన్ని నిరోధించటంలో విద్యాశాఖ విఫలమైందని ఏలూరుకు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్ గుంటుపల్లి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. పదో తరగతి పరీక్షల సందర్భంగా 405 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్ తెలిపారు.
మున్నాభాయ్‌లు తయారవుతున్నారు...
ఈ సమయంలో పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ మాస్ కాపీయింగ్‌ను ప్రభు త్వాలు సీరియస్‌గా తీసుకోవడం లేదని, సీసీ కెమెరాలున్నా వాటికి చిక్కకుండా కొన్ని పాఠశాలలు ఉత్తీర్ణత శాతం పెంచుకోవడానికి విద్యార్థులకు జవాబులు చెబుతున్నాయ న్నారు. వీటిని కట్టడి చేయడంలో ప్రభు త్వాలు విఫలమవుతున్నాయని, తద్వారా మున్నాభాయ్‌లు తయారవుతున్నారని చెప్పారు. బాధ్యులను ప్రాసిక్యూషన్ చేసిన సందర్భాలు లేవన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ... టీచర్లు, విద్యార్థులు కుమ్మక్కవుతుంటే ప్రభుత్వాలు ఎంత వరకు కట్టడి చేయగలుగుతాయని ప్రశ్నించింది. సీసీ కెమెరాల ఏర్పాటే పరిష్కారం కాదని, అంతకు మించి ఏదైనా జరగాల్సి ఉందని తెలిపింది. చూచిరాతలు మన విద్యావ్యవస్థను నాశనం చేస్తున్నాయని, దీనికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని పేర్కొంది.
ఇన్విజిలేటర్లకు సర్క్యులర్లు ఇస్తాం...
మాస్ కాపీయింగ్ జరిగితే క్రిమినల్ కేసులతో పాటు ప్రాసిక్యూషన్ చేస్తామని ఇన్విజిలేటర్లందరికీ సర్కులర్లు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజయ్‌కుమార్ తెలిపారు. తదుపరి విచారణ నాటికి సర్కులర్‌ను కోర్టుకు సమర్పిస్తామని నివేదించారు.
చూచిరాతలతో విద్యావ్యవస్థ నాశనం
Published Wed, Jan 24 2018 1:47 AM | Last Updated on Sat, Sep 15 2018 4:15 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment