
ఉవ్వెత్తున ఎగిసిన నిరసన జ్వాల
- సాక్షిపై చంద్రబాబు దాష్టీకానికి వ్యతిరేకంగా వాడవాడలా ఆందోళనలు
- మద్దతు తెలుపుతున్న అన్ని జర్నలిస్టు, ప్రజా సంఘాలు
సాక్షి, నెట్‌వర్క్: ‘సాక్షి’పై చంద్రబాబు దాష్టీకానికి నిరసనగా ఊరూవాడా ఆందోళనలు హోరెత్తుతున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను అడ్డుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని జిల్లాల్లో ఐదో రోజూ నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఏపీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, ఎమ్మార్పీఎస్, బీఎస్పీ, ప్రజాసంఘాలు, రైతుసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు,మద్దతు తెలిపాయి. కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించి ఆయా వినతిపత్రాలు అందించారు.
సోమవారం అనంతపురం సప్తగిరి సర్కిల్ వద్ద మానవహారం నిర్మించారు. అనంతరం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షడు శంకరనారాయణ, ఎమ్మేల్యే విశ్వేశ్వరరెడ్డి తదితరులు జిల్లా కలెక్టర్ కోన శశిధర్‌కు వినతిపత్రం అందిచారు. కడపలో కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టు సంఘాలు ధర్నా నిర్వహించాయి. విజయవాడలో ప్రదర్శన నిర్వహించారు.
నిరంకుశ పాలనకు చరమగీతమే..
ప్రభుత్వం అక్రమాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ చానల్ ప్రసారాలను నిలిపివేయించిన పాలనకు ప్రజలు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాల నేతలు హెచ్చరించారు. ‘సాక్షి’ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని కిసాన్‌ఘాట్ సమావేశ భవనంలో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. వక్తలు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు సాక్షి చానల్‌పై కక్ష కట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా జర్నలిస్టుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ వద్ద సోమవారం భారీ ధర్నా, ర్యాలీ నిర్వహించారు.సాక్షి ప్రసారాలను నిలుపుదల చేయడాన్ని నిరసిస్తూ తూర్పు గోదావరి జిల్లాలో అన్ని జర్నలిస్టు సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. విజయనగరం జిల్లా కలెక్టరేట్ జంక్షన్‌లో జర్నలిస్టు ఐక్యవేదిక పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించింది. వెంటనే గవర్నర్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఏలూరులో నిర్వహించిన ధర్నా జరిపారు. విశాఖపట్నంలో సాక్షి సిబ్బంది, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు నగరంలోని సాక్షి కార్యాలయం నుంచి జీవీఎంసీ కార్యాలయం మీదుగా పోలీస్ కమిషనర్ కార్యాలయం వరకు భారీ బైకు ర్యాలీ నిర్వహించారు.
తిరగబడుతున్న కేబుల్ ఆపరేటర్లు
సాక్షి ప్రసారాలు నిలిపివేయడంపై విశాఖలోని పెందుర్తినాయుడు తోటలో కేబుల్ ఆపరేటర్లు ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రారంభించారు.
‘సాక్షి’ గొంతు నొక్కేందుకు చంద్రబాబు కుట్ర
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ధ్వజం
నెల్లూరు(సెంట్రల్): రాష్ట్రంలో సాక్షి చానల్ గొంతు నొక్కాలని చంద్రబాబు సర్కారు ప్రయత్నిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ధ్వజమెత్తారు. నెల్లూరులోని సీపీఎం కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు వాస్తవ సమాచారాన్ని చేరవేస్తున్న సాక్షి చానల్‌పై కక్ష కట్టి ప్రసారాలను నిలిపివేయడం సిగ్గు చేటన్నారు. సాక్షి ప్రసారాలను పునరుద్ధరించాలన్నారు.
నిషేధం దారుణం: రామకృష్ణ
సాక్షి, విజయవాడ బ్యూరో: ముఖ్యమంత్రి స్థానంలో ఉండి సాక్షిపై కక్షగట్టినట్టు నిషేధం విధించడం దారుణమని, మీడియా గొంతు నొక్కే ఇలాంటి చర్యలు మానుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హితవు పలికారు. విజయవాడలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్ధేశపూర్వకంగా ఒక మీడియాపై ఆంక్షలు పెట్టి ఇబ్బంది పెట్టే చర్యలు సరికాదన్నారు.