
ఎంబీసీ కార్పొరేషన్ ఫైలుపై సీఎం సంతకం
సాక్షి, హైదరాబాద్: అత్యంత వెనుకబడిన తరగతుల (ఎంబీసీ) అభ్యున్నతికి రాష్ట్రంలో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలిపారు. కార్పొరేషన్ ఫైలుపై శుక్రవారం సంతకం చేశారు. సంబంధిత ఉత్తర్వులు శనివారం వెలువడనున్నాయి. బీసీ కార్పొరేషన్‌ను కొనసాగిస్తూనే.. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎంబీసీడీసీ) ఏర్పాటు చేస్తామని ఇటీవల సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే.
బడ్జెట్లోనే నిధులు కేటాయించి, కార్పొరేషన్ ద్వారా ఎంబీసీల సంక్షేమం, అభివృద్ధికి ఖర్చు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈనెల 20న జనహితలో ఎంబీసీ వర్గాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో సీఎం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ ఏర్పాటుకు ఫైలు సిద్ధమైంది. కాగా, ఎంబీసీ ప్రతినిధులతోనే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని సీఎం ముందుగానే ప్రకటించారు. దీంతో నామినేటేడ్ పదవుల భర్తీలో భాగంగా ఈ పదవులూ పార్టీ శ్రేణులను ఊరిస్తున్నాయి.