
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ మట్టిపొరల్లోంచి మొలకెత్తిన వీర గాథ మేడారం సమ్మక్క–సారలమ్మల దివ్య చరిత్ర అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత పేర్కొన్నారు. కోట్లాది భక్తుల కొంగు బంగారమై వెలసిన సమ్మక్క–సారలమ్మలు ఆత్మగౌరవానికి, పౌరుషానికి ప్రతీక అని కొనియాడారు. వారి పోరాట పటిమ నేటి తరానికి స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.
మేడారం సమ్మక్క–సారలమ్మ దివ్య చరిత్రను తెలంగాణ జాగృతి సాంస్కృతిక విభాగం పాటల రూపంలో రూపొందించిన సీడీలను ఆదివారం ఆమె ఆవిష్కరించారు. కరువుతో అల్లాడుతున్న అడవి బిడ్డలను శిస్తు కట్టాలని పీడించడమే కాకుండా చిన్న రాజ్యమైన మేడారంపై చతురంగ దళాలతో దాడి చేసిన కాకతీయ సేనను సంప్రదాయ ఆయుధాలతో నిలువరించే ప్రయత్నం చేసిన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, నాగులమ్మల త్యాగాలను స్మరించుకుందామని పేర్కొన్నారు.
సమ్మక్క–సారలమ్మల దివ్య చరిత్రను సమాజానికి తెలియజేసేందుకు కష్టపడ్డ జాగృతి సాంస్కృతిక విభాగం కన్వీనర్ కోదారి శ్రీనును ఆమె అభినందించారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, ఉపాధ్యక్షుడు మేడే రాజీవ్ సాగర్, యూత్, స్టూడెంట్ విభాగాల కన్వీనర్లు కోరబోయిన విజయ్ కుమార్, పసుల చరణ్ పాల్గొన్నారు.
ప్రజల కోసమే ‘గులాబీ జెండా’: ఎంపీ కవిత
సాక్షి, హైదరాబాద్: స్వరాష్ట్రాన్ని సాధించుకొని తెలంగాణ బిడ్డ కాలర్ ఎగరేసే విధంగా చేసింది విద్యుత్ కార్మికులు, ఉద్యోగులేనని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇచ్చి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని, దేశమంతా తెలంగాణ గురించే చర్చించుకుంటోందని పేర్కొన్నారు. వివిధ కార్మిక సంఘాల నుంచి పలువురు టీఆర్‌ఎస్ కార్మిక విభాగానికి అనుబంధంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక విభాగం (టీఆర్‌వీకేఎస్)లో చేరారు.
తెలంగాణ భవన్‌లో ఆదివారం జరిగిన చేరికల కార్యక్రమంలో ఆమె కార్మిక నాయకులకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గులాబీ జెండా ప్రజల కోసమే పనిచేస్తోందని చెప్పారు. 20 వేలకుపైగా కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగులను సీఎం కేసీఆర్ రెగ్యులరైజ్ చేశారని, అది ఓర్వని విపక్షాలు కోర్టులకు వెళ్తున్నాయని విమర్శించారు. కార్మికులకు పీఆర్సీ, హెల్త్ కార్డుల అంశాలను పరిశీలిస్తామన్నారు.