
ఫిబ్రవరి మొదటి వారానికి అంతా సిద్ధం
♦ మేడారం జాతర ఏర్పాట్లపై కడియం
♦ చందూలాల్, ఇంద్రకర ణ్‌తో కలసి పోస్టర్ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత జరగనున్న తొలి సమ్మక్క సారలమ్మ జాతరను ప్రతిష్టాత్మకంగా భావించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లూ చేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు జరిగే జాతరకు తెలంగాణతోపాటు ఏపీ, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్‌ల నుంచి కోటి మందికిపైగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నం దున ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.
బుధవారం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్, ప్రభుత్వ సలహాదారు రమణాచారిలతో కలసి ఆయన మేడారం జాతర పోస్టర్లను ఆవిష్కరించారు. ఆరు నెలల క్రితమే జాతర ఏర్పాట్లను ప్రారంభించామని, రూ.154 కోట్లతో పనులు చేస్తున్నామని కడియం వివరించారు. ప్రస్తుతం రోడ్లు, భక్తులు దుస్తులు మార్చుకునే గదుల నిర్మాణం, లైటింగ్ ఏర్పాట్లు తదితర పనులు జరుగుతున్నట్లు చెప్పారు. వచ్చే నెల మొదటివారానికల్లా పనులు పూర్తవుతాయని, త్వరలో క్షేత్రస్థాయిలో వాటిని పరిశీలిస్తామన్నారు.
రూ.1.20 కోట్లతో గద్దెల వద్ద, ఆ ప్రాంగణంలో గ్రానైట్ ఫ్లోరింగ్ చేయిస్తున్నామని, స్టీల్ బారికేడ్లతోపాటు హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, అలాగే పరిసరాల్లో సీసీ కెమెరా పర్యవేక్షణను అందుబాటులోకి తెస్తామన్నారు. ఇటు పస్రా నుంచి నార్లాపూర్ మీదుగా వెళ్లే దారి, అటు తాడ్వాయి మీదుగా వచ్చే రోడ్డును రెండు లేన్లుగా విస్తరిస్తున్నట్లు చెప్పారు.
దేశంలోనే పెద్ద గిరిజన జాతరగా పేరున్న మేడారం ఉత్సవాన్ని సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈసారి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో మేడారం చేరుకునే ఏర్పాటు కూడా చేస్తున్నట్టు చెప్పారు. గురువారం నుంచి ఆహ్వానపత్రికలు పంపుతామన్నారు. మేడారం జాతరకు ఆసియాలోనే పెద్ద గిరిజన ఉత్సవంగా పేరుందని మంత్రి చందూలాల్ అన్నారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ కార్యదర్శి శివశంకర్, ఎస్సీ సెల్ చైర్మన్ రవి పాల్గొన్నారు.