
వైద్య వృత్తిని వ్యాపారంగా మార్చొద్దు
* తక్కువ ధరకే నాణ్యమైన వైద్యం అందించాలి
* డిజిటల్ డెంటల్ అంతర్జాతీయ సదస్సులో గవర్నర్ నరసింహన్
సాక్షి, హైదరాబాద్: వైద్య వృత్తిని వ్యాపారంగా మార్చొద్దని.. ఆపదలో వచ్చిన వారికి సేవాభావంతో వైద్యసేవలు అందించాలని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సూచించారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుని రోగులకు మరింత మెరుగైన సేవలు అందించాలన్నారు. హైదరాబాద్‌లోని మాదాపూర్ శిల్పకళావేదికలో శనివారం డిజిటల్ డెంటల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్-2016కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు.
కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు హంగులు, హడావుడి చేస్తూ రోగులను భయపెడుతున్నాయని, దీంతో పేద, మధ్య తరగతి రోగులు చికిత్సకు దూరంగా ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోగుల ఆర్థిక పరిస్థితిని బట్టి వారికి ఆ ధరల్లో నాణ్యమైన వైద్యసేవలు అందించాలని కోరారు. ఇండియన్ ప్రోస్థోడాంటిక్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ ప్రపుల్ల తోమాతి, జోర్దాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అతీఫ్ షేకర్ సయ్యిద్‌లు మాట్లాడుతూ.. దంత సంరక్షణలో భాగంగా విరిగిపోయిన, ఊడిపోయిన పళ్ల చికిత్సలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నట్లు చెప్పారు.
కంప్యూటర్ సహాయంతో త్రీడి ప్రింటింగ్, మెటల్ ప్రింటింగ్, శస్త్ర చికిత్స, రోబోటిక్ సర్జరీ వంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో డిజిటల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆర్గనైజింగ్ అధ్యక్షుడు జి.ప్రమోద్‌కుమార్, సెక్రటరీ ఎ.శ్రీకాంత్, జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్‌వీఎస్‌ఎస్ ప్రసాద్‌లతో పాటు పలువురు డాక్టర్లు పాల్గొన్నారు.