మందులోడా.. ఓరి మాయలోడా..
మన దగ్గర..
ఆ.. వంకాయలు.. టమాటాలు.. కొత్తిమీర కట్టోయ్..
హైతీలో అయితే..
ఆ.. పారసిటమాల్..సిప్రోఫ్లాక్సిన్.. పెన్సిలిన్నోయ్..
మెడికల్ షాపు పెట్టాలంటే మనకేం కావాలి.. ముందు లైసెన్సు తీసుకుని ఉండాలి.. ఫార్మసీ చదివుండాలి.. హైతీకెళ్తే.. అదేమీ అక్కర్లేదు.. ఓ మాంచి దిట్టమైన ప్లాస్టిక్ బకెట్.. కాసింత ఎండలో తిరిగే ఓపిక ఉంటే చాలు.. ఎవరైనా.. ఫార్మసిస్టు అయిపోవచ్చు. హైతీలో చాలా మందికి ఇలాంటి మందులు కొనడమంటే.. ఏవో చాక్లెట్లు కొన్నట్లే కొంటారు.
అలాగని.. ఈ బిజినెస్ అంత ఈజీ కాదు కూడా.. అసలే పోటీ.. దీంతో మన సరుకు ఆకర్షణీయంగా కనిపిస్తేనే.. వినియోగదారుడు కొంటాడు.. అందుకే.. టాబ్లెట్లను ఏది పడితే అలా పెట్టేయడానికి లేదు.. గులాబీ రంగు మాత్ర పక్కన.. నీలం రంగు టాబ్లెట్లు వచ్చేటట్లు సర్దాలి.. ఇంద్రధనస్సు రంగులన్నీ.. మన బకెట్లోనే కనిపించాలి. అప్పుడే కస్టమర్ చూపును మనం ఆకర్షించగలం.
వాస్తవానికి ఇలా మందులు అమ్మడం నిషిద్ధమే.. కానీ పట్టించుకునేవాడెవడు.. ప్రభుత్వమూ లైట్ తీసుకుంటుంది.దీంతో హైతీ రాజధాని పోర్టో ప్రిన్స్‌లో ఇలాంటి వారిదే రాజ్యం. వీటిల్లో ఎక్కువ మందులు చైనా నుంచి వస్తాయి. మరికొన్ని ఎక్స్‌పైరీ అయిపోయినవీ ఉంటాయి. అంతేకాదు.. వీరు అసలు డాక్టర్లను మించి.. రోగులకు సలహాలు ఇచ్చేస్తుంటారు. అవి ఎలాగుంటాయంటే.. మొటిమలకు కూడా పవర్‌ఫుల్ యాంటీ బయాటిక్స్ ఇచ్చేస్తారన్నమాట. ‘ఏ.. వాళ్లు మా దగ్గర ఏమీ దాయరు. అన్నీ చెబుతారు. అన్నిటికీ మా దగ్గర మందుంది’ అని వీళ్లు గొప్పగా చెబుతారు.