విజయవాడ, న్యూస్‌లైన్: పీజీ మెడికల్ ఎంట్రన్స్ ప్రశ్నపత్రం లీకేజీపై దర్యాప్తు నివేదిక ఇప్పటికే సిద్ధమైందని, శుక్రవారం గవర్నర్ నరసింహన్‌కు అందజేసే అవకాశం ఉందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ రవిరాజు వెల్లడించారు. సీఐడీ నివేదిక ఆధారంగా ప్రవేశపరీక్ష మళ్లీ నిర్వహించాలా... వద్దా అనేది గవర్నర్ నిర్ణయిస్తారని చెప్పారు. కాగా, గురువారం ఉదయం నుంచి హెల్త్ యూనివర్సిటీలో వీసీ, రిజిస్ట్రార్, సంబంధిత ఇతర అధికారులను అదనపు ఎస్పీ యు.రవిప్రకాశ్ నేతృత్వంలో దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు. నాన్‌లోకల్ అభ్యర్థులు గుంటూరు జిల్లాలోనే ఎక్కువ మంది ఉన్నారనే వార్తల నేపథ్యంలో సీఐడీ అధికారులు ఆ దిశగా దృష్టి సారించారు. కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
విజయవాడలోని జూనియర్ డాక్టర్లు మరికొంతమంది అనుమానిత విద్యార్థుల జాబితాను సీఐడీ అధికారులకు అందజేశారు. ప్రశ్నపత్రం లీకైందని సీఐడీ దర్యాప్తులో తేలితే రీ-ఎగ్జామ్ తప్పదని యూనివర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ రీ-ఎగ్జామ్ పెట్టిస్తారా, లేక అనుమానిత విద్యార్థుల ర్యాంకులను విత్‌హెల్డ్‌లో ఉంచి, కొత్తగా ర్యాంకులు ప్రకటిస్తారా అనేది వేచి చూడాల్సిందే.