మీడియాతో మాట్లాడుతున్నవేణుగోపాల్ రెడ్డి, రవిరాజు
విచారణాధికారి ప్రొ.వేణుగోపాల్‌రెడ్డి
నేటి నుంచి నాగార్జున వర్సిటీలో ఫిర్యాదుల స్వీకరణ
విచారణకు మరికొందరు నిపుణుల నియామకం
సాక్షి, హైదరాబాద్/విజయవాడ: పీజీ వైద్య విద్య ప్రవేశ పరీక్ష (పీజీ సెట్)లో అవకతవకలపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్టు విచారణాధికారి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ.వేణుగోపాల్‌రెడ్డి చెప్పారు. ఈ వ్యవహారంపై వివిధ వర్గాల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు నాగార్జున విశ్వవిద్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామని, గురువారం ఉదయం 10 గంటల నుంచి ఇక్కడ ఎవరైనా తమకు ఉన్న అనుమానాలు, ఆధారాలను తెలపవచ్చని చెప్పారు. ఆయన బుధవారం విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ కార్యాలయంలో వైస్ చాన్స్‌లర్, రిజిస్ట్రార్, ఇతర అధికారులతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. పలువురు విద్యార్థులు, వైద్య విద్యార్థి సంఘాల నుంచి వచ్చిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని వాటిపైన విచారణ జరుపుతున్నామని ఆయన చెప్పారు. ప్రశ్నపత్రం లీక్ అయిందా లేదా, ఒకవేళ లీక్ అయి ఉంటే యూనివర్సిటీ నుంచే బయటకు వచ్చిందా.. ప్రశ్నపత్రాలు ప్రింటింగ్‌కు వెళ్లిన సమయంలో అయిందా, ఇందులో అధికారుల పాత్ర ఎంత అన్న విషయాలను పరిశీలిస్తామన్నారు. నిపుణులైన మరికొంతమంది అధికారులను విచారణకు వినియోగిస్తున్నామని అన్నారు. విచారణలో తోడ్పాటునందించేందుకు ఎంసెట్ నిర్వహణలో అనుభవమున్న రఘునాథ్, నిర్మల కుమార్ ప్రియ, సూర్యప్రకాష్, వి.ఎస్.దత్, ఎన్.నారాయణరెడ్డి, జీఎన్‌పి కేశవరావులను నియమించినట్టు తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి చెందిన సిబ్బంది అజయ, వాసు కూడా సహకరిస్తారని చెప్పారు. నాగార్జున వర్సిటీలో ఏర్పాటు చేసే గ్రీవెన్స్ సెల్‌లో ఫర్యాదులు స్వీకరించేందుకు ఆ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య చలం, ఆచార్య చంద్రశేఖర్‌లను నియమిస్తున్నట్టు తెలిపారు. ఇక్కడ ఎవరైనా ఏవైనా ఆధారాలు ఇస్తే ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తామన్నారు. వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తిచేసి గవర్నర్‌కు నివేదిక ఇస్తామని చెప్పారు.
ప్రశ్నపత్రాలను నిపుణులే తయారుచేశారు: వీసీ
మెడికల్ పీజీసెట్ ప్రశ్నపత్రాలను నిపుణులైన వారే తయారు చేశారని వైద్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ రవిరాజు తెలిపారు. ఎయిమ్స్, జిప్‌మెర్, కర్ణాటక మెడికల్ సెట్ తదితర ఉన్నతస్థాయి ప్రవేశ పరీక్షలకు ప్రశ్నపత్రాలు ఇచ్చిన ప్రొఫెసర్ల నుంచే ఇక్కడ కూడా ప్రశ్నలు తీసుకున్నామన్నారు. ఏ విభాగంలో ఎన్ని ప్రశ్నలుండాలి, ఎక్కడ నుంచి తీసుకోవాలన్న అంశాల్లో అన్ని నియమాలను పాటించామని అన్నారు.
న్యాయం జరగకపోతే పోరాటం: జూడాలు
పీజీ ప్రవేశ పరీక్షలో సుమారు రూ.200 కోట్ల కుంభకోణం జరిగిందని జూనియర్ వైద్యుల సంఘం (జూడా) ఆరోపించింది. దీనిపై కూలంకషంగా దర్యాప్తు జరిపి ప్రతిభ కలిగిన విద్యార్థులకు న్యాయం చేయాలని కోరింది. లేదంటే ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే సర్వీసులు నిలిపివేస్తామని, ఎమర్జెన్సీ సేవలను కూడా నిలిపివేసేందుకు వెనుకాడబోమని హెచ్చరించింది.