కన్సల్టెన్సీదే కీలక పాత్ర | CID police files chargesheet in Vijayanagar PGCET scam | Sakshi
Sakshi News home page

కన్సల్టెన్సీదే కీలక పాత్ర

Published Sun, Mar 30 2014 2:02 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

కన్సల్టెన్సీదే కీలక పాత్ర - Sakshi

కన్సల్టెన్సీదే కీలక పాత్ర

పీజీ మెడికల్ స్కాంపై సీఐడీ చీఫ్ కృష్ణప్రసాద్
 
 సాక్షి, హైదరాబాద్: పీజీ వైద్యవిద్య ప్రవేశపరీక్ష (పీజీఎంఈటీ-2014) ప్రశ్నపత్రాల లీకేజీ స్కాంలో హైదరాబాద్‌కు చెందిన వర్టెక్స్ కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ కీలక పాత్ర పోషించింది. సీఐడీ చీఫ్ టి.కృష్ణప్రసాద్ శనివారం విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. కన్సల్టెన్సీ నిర్వాహకుడు కె.మునీశ్వర్‌రెడ్డి దేశవ్యాప్తంగా 12 మంది దళారుల్ని ఏర్పాటు చేసుకుని లీకేజీ వ్యవహారం పూర్తిచేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు తొమ్మిది మంది నిందితుల్ని అరెస్టు చేసినట్లు చెప్పారు. ‘‘తొలి 100 లోపు ర్యాంకులు సాధించిన వారిలో దాదాపు 25 మంది మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడినట్లు అనుమానిస్తున్నాం. ఈ ప్రశ్నపత్రం ఎక్కడ నుంచి లీకైందనేది ఇంకా స్పష్టం కాలేదు. పరారీలో ఉన్న దళారులు, విద్యార్థుల్ని అరెస్టు చేయడానికి 12 ప్రత్యేక బృందాలు దేశవ్యాప్తంగా గాలిస్తున్నాయి’’ అని కృష్ణప్రసాద్ వివరించారు. మరోవైపు శనివారం అర్ధరాత్రి వరకు విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలోని  ముఖ్య అధికారులతో పాటు పరీక్షల విభాగం ఉద్యోగులను ఐజీ నవీన్‌కుమార్ నేతృత్వంలో సీఐడీ అధికారులు విచారించారు.
 
 లీకేజీ ఎక్కడి నుంచి?...
 
 పీజీఎంఈటీ ప్రశ్నపత్రాల్ని మునీశ్వర్‌రెడ్డి కర్ణాటకలోని మణిపాల్‌లో ఉన్న ప్రింటింగ్ ప్రెస్ నుంచే చేజిక్కించుకున్నట్లు సీఐడీ నిర్ధారించినట్లు తెలిసింది. ప్రశ్నపత్రాలను ఫిబ్రవరి 8న ముద్రించి అదే నెల 25న హెల్త్ వర్సిటీకి డెలివరీ ఇచ్చింది. అయితే మునీశ్వర్‌రెడ్డి మాత్రం ఫిబ్రవరి 2 రాత్రే కొందరు అభ్యర్థులకు ప్రశ్నాపత్రం ప్రతుల్ని చూపించాడని తేలింది. దీంతో ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకుడితో పాటు ఇద్దరు ప్రతినిధుల్నీ సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. లీకేజీ ప్రశ్నపత్రల ప్రతులతో మునీశ్వర్‌రెడ్డి తాను కొంతమంది వైద్య విద్యార్థులకు, దళారుల ద్వారా మరికొందరికి ఎర వేశాడు.
 
 వారితో పాటు వారి తల్లిదండ్రులతోనూ మాట్లాడటానికి నాలుగు సెల్‌ఫోన్లు (9030314444, 9980099968, 9030132828, 9030132121) వినియోగించాడు. ఒక్కో అభ్యర్థీ రూ. 90 లక్షల నుంచి రూ. 1.10 కోట్ల వరకు చెల్లించేలా బేరం కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్‌గా రూ. 10 లక్షల చొప్పున వసూలు చేశాడు. మిగతా మొత్తం ర్యాంకు వచ్చిన తరవాత చెల్లించే వరకు ష్యూరిటీగా పదో తరగతి, ఇంటర్, ఎంబీబీఎస్ డిగ్రీ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు బ్లాంక్ చెక్కుల్నీ తీసుకున్నాడు. ఆయా అభ్యర్థులకు పరీక్ష రాయడంపై తర్ఫీదుకు ప్రత్యేక క్లాసులు ఏర్పాటు చేశాడు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1 మధ్యకాలంలో ముంబై సమీప గుర్గావ్‌లోని షోహమ్ రెసిడెన్సీ, ఇంపీరియల్ హైట్స్‌ల్లో ఉన్న వసతిగృహాలతో పాటు హైదరాబాద్‌లోని సాయినాథ్ ఇంటికీ క్లాసుల కోసం వచ్చిన అభ్యర్థుల సెల్‌ఫోన్లన్నీ తీసేసుకున్నాడు. వారికి ప్రశ్నపత్రం, కీ అందించాడు. రెండ్రోజుల పాటు వాటి తర్ఫీదు తర్వాత ఆ ప్రశ్నపత్రాలన్నీ మళ్లీ వెనక్కి తీసేసుకున్నాడు. వారిని విమానాల్లో వారివారి పరీక్షాకేంద్రాలకు పంపించేశాడు. మార్చి 2న పీజీఎంఈటీ-2014కు వారంతా హాజరయ్యారు. ఇలా మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడినవారు రెండో ర్యాంక్ (సాయిసుధ) సహా 100లోపు అనేక ర్యాంకులు కైవశం చేసుకున్నారు. అయితే వారి ర్యాంకులపై తోటి విద్యార్థులు సందేహం వ్యక్తం చేయడంతో పీజీఎంఈటీ-2014 స్కాంపై దర్యాప్తునకు సీఐడీ రంగప్రవేశం చేసింది. ఈ వ్యవహారంలో కీలక సూత్రదారులైన మునీశ్వర్‌రెడ్డి, సాయినాథ్‌లను సీఐడీ అధికారులు పట్టుకున్నారు. వారి ద్వారా మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన కడపకు చెందిన జగదీప్ (12వ ర్యాంక్), హైదరాబాద్‌కు చెందిన ఏవీ ఆనంద్ (16వ ర్యాంక్), గుంటూరుకు చెందిన భీమేశ్వరరావు (25వ ర్యాంక్), కరీంనగర్‌కు చెందిన బి.శ్రీనివాస్ (3వ ర్యాంక్), డి.శ్రావణి (28వ ర్యాంక్), సి.గురివిరెడ్డి (8వ ర్యాంక్), బి.వెంకటేశ్వరరావు (45వ ర్యాంక్)లను అరెస్టు చేశారు. నిందితుల నుంచి నగదు, సర్టిఫికెట్లు, బ్లాంక్ చెక్కులు, కారు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న దళారులతో పాటు మిగతా విద్యార్థుల కోసం గాలిస్తున్నారు.
 
 చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఆదేశం...
 
 పీజీఎంఈటీ-2014 స్కాం దర్యాప్తు పురోగతిపై సీఐడీ చీఫ్ కృష్ణప్రసాద్ శనివారం మధ్యాహ్నం గవర్నర్ నరసింహన్‌ను కలసి నివేదికను సమర్పించారు. ఈ నివేదికను గవర్నర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించి... అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఈ నివేదిక సీఎస్ పి.కె.మహంతికి చేరింది. నివేదికను కూలంకషంగా పరిశీలించి మంగళవారంలోగా ఆయన తన అభిప్రాయాన్ని గవర్నర్‌కు నివేదిస్తారని తెలిసింది. కాగా, పరీక్షపత్రం లీకేజీ వ్యవహారంలో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్లు డాక్టర్ రవిరాజు, డాక్టర్ బాబూలాల్‌లు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని గుంటూరు జిల్లా ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఏకుల కిరణ్‌కుమార్ డిమాండ్ చేశారు. లీకేజీకి మూలకారకులైన వర్సిటీ అధికారులు, ప్రింటింగ్ ప్రెస్ యాజమాన్యాన్ని వదిలివేసి దళారులు, విద్యార్థులను అరెస్టు చేయడం అనుమానాలకు తావిస్తుందన్నారు.
 
 ఏవరీ మునీశ్వర్‌రెడ్డి?...
 
 వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి సమీపంలోని మునిమిరెడ్డిగారిపల్లెకు చెందిన కొమ్మూరి మునీశ్వర్‌రెడ్డి తమిళనాడులో ఎంబీఏ చదివాడు. 2006లో హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో వర్టెక్స్ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ను ఏర్పాటు చేశాడు. తర్వాత కార్యాలయాన్ని బంజారాహిల్స్ రోడ్ నం.2కు మార్చాడు. దీనికి బె ంగళూరులోని జయనగర్‌లోనూ శాఖ ఉంది. మన రాష్ట్రంతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లోని ప్రైవేట్ ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్న మునీశ్వర్‌రెడ్డి... విద్యార్థులకు మేనేజ్‌మెంట్ కోటా సీట్లు ఇప్పించడంలో దళారిగా వ్యవహరించేవాడు. వైద్యవిద్యలో రేడియాలజీ సీటుకు రూ. 1.5 కోట్లు, పీడియాట్రిక్స్‌కు రూ. 70 లక్షల చొప్పున వసూలు చేసి, యాజమాన్యాలతో పంచుకునేవాడు. ఇదే వ్యవహారాల్లో ఉన్న వి.సురేష్, బస్వరాజు (బెంగళూరు), అంజూసింగ్ (ముంబై), ధనుంజయ్‌కుమార్ చౌహన్ (బీహార్), డి.సాయినాథ్, భూషణ్‌రెడ్డి (హైదరాబాద్)లతో జత కట్టాడు. వీరితో సహా మొత్తం 12 మంది దళారుల్ని ఏర్పాటు చేసుకున్న మునీశ్వర్‌రెడ్డి పీజీఎంఈటీ-2014 స్కాంకు తెర లేపాడు.
 
 పాత నోటిఫికేషన్‌తోనే మళ్లీ పరీక్ష!
 పీజీ వైద్య ప్రవేశ పరీక్షలో అవకతవకలు నిరూపణ అయితే పరీక్ష రద్దు చేసి మళ్లీ ప్రవేశపరీక్ష నిర్వహిస్తామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం చెప్పారు. రెండు మూడు రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందన్నారు. మరోవైపు పీజీఎంఈటీ పాత నోటిఫికేషన్‌తోనే మళ్లీ పరీక్ష నిర్వహించేందుకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సిద్ధమైంది. ఇప్పటికే ప్రశ్నాపత్రాల కూర్పు ప్రక్రియ కూడా మొదలుపెట్టినట్టు తెలిసింది. గతంలో వివిధ యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి వచ్చిన ప్రశ్నలనే తీసుకుం టారా? లేదా కొత్తగా ఎయిమ్స్, పీజీఐ-చండీగఢ్ తదితర ప్రముఖ సంస్థలకు లేఖ రాసి తెప్పించుకుంటారా? అనేది ఇంకా తేలలేదు. ఇక పీజీఎంఈటీ స్కాంలో నిందితులైన అభ్యర్థులను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టనున్నారు. మళ్లీ పరీక్ష నిర్వహించేటట్లయితే ఏప్రిల్ 15లోగా ఈ ప్రక్రియ పూర్తి చేసి, అదే నెల 25 నాటికి ఫలితాలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. భారతీయ వైద్యమండలి నిబంధనల ప్రకారం జులై 7 తర్వాత కౌన్సెలింగ్ నిర్వహించడానికి అవకాశం లేదు. అప్పటికి సీట్లు ఏవైనా సీట్లు మిగిలిపోతే ఆ విద్యా సంవత్సరానికి అవి రద్దయినట్టే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement