ర్యాంకర్లకు బిగుస్తున్న ఉచ్చు
సాక్షి, హైదరాబాద్: పీజీ వైద్యవిద్య ప్రవేశపరీక్ష స్కాంలో దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. దళారులు, లీకువీరులతో పాటు అడ్డదారిలో ర్యాంకులు సాధించిన వైద్య విద్యార్థులను, వారి తల్లిదండ్రులనూ ఈ కేసులో నిందితులుగా చేర్చాలని రాష్ట్ర నేర పరిశోధన విభాగం సీఐడీ నిర్ణయించింది. ఇప్పటికే కొందరు ర్యాంకర్ల తల్లిదండ్రుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. వీరిలో పలువురు వైద్యులు కూడా ఉన్నారు. గురువారం ఉదయం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను డీజీపీ బి.ప్రసాదరావు, సీఐడీ అదనపు డీజీ కృష్ణప్రసాద్, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ ఎం.మహేందర్‌రెడ్డి రాజ్‌భవన్‌లో కలిశారు. పీజీ వైద్యవిద్య ప్రవేశపరీక్ష స్కాం కేసు దర్యాప్తు పురోగతిని గవర్నర్‌కు వారు వివరించారు.
అక్రమాలు చోటుచేసుకున్న దృష్ట్యా పరీక్షను రద్దు చేయాలని డీజీపీ సిఫారసు చేసినట్లు తెలిసింది. ప్రశ్నపత్రం లీక్ ద్వారా 18 నుంచి 26 మంది వరకు విద్యార్థులు లబ్ధి పొందారని గవర్నర్‌కు తెలిపినట్లు సమాచారం. ఈ స్కాంతో సంబంధం ఉన్న ఏ ఒక్కర్నీ వదిలిపెట్టవద్దని గవర్నర్ ఆదేశించినట్లు తె లిసింది. భేటీ అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడుతూ, అక్రమాలు జరిగినట్లు నిర్ధారించామని, మరో రెండ్రోజుల్లో కేసు కొలిక్కి వస్తుందని చెప్పారు.
చేతులు మారింది నల్లధనమేనా?
ప్రాథమిక ఆధారాలు, దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలను బట్టి ఈ స్కాం భారీ మొత్తంతో ముడిపడి ఉన్నట్లు సీఐడీ నిర్ధారించింది. ముఠాతో ముందే ఒప్పందం కుదుర్చుకున్న వైద్య విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు రూ. 25 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు చెల్లించి లీకైన ప్రశ్నపత్రాల్ని చేజిక్కించుకున్నట్లు తేలింది. దళారులతో సంప్రదింపులు జరిపిన తరవాతే విద్యార్థుల తల్లిదండ్రులు ఈ భారీ మొత్తంలో చెల్లింపులు చేసి ఉంటారని సీఐడీ అనుమానిస్తోంది. నేరం జరుగుతోందని తెలిసీ సహకరించిన ఆరోపణలతో ఆయా అనుమానిత ర్యాంకర్ల తల్లిదండ్రుల్నీ ఈ కేసులో నిందితులుగా చేర్చాలని నిర్ణయించింది. వీరిని తక్షణం అరెస్టు చేయకున్నా అభియోగాలు నమోదు చేసి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేయాలని భావిస్తోంది. మరోవైపు పరారీలో ఉన్న నిందితులు, అనుమానితుల కోసం ప్రత్యేక బృందాలు దేశవ్యాప్తంగా గాలిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ర్యాంకర్ల తల్లిదండ్రులు దళారులకు చెల్లించింది లెక్కల్లో చూపని నల్లధనంగా సీఐడీ అనుమానిస్తోంది. దీంతో ఈ అంశాన్ని ఆదాయపు పన్ను శాఖకు నివేదించాలని నిర్ణయించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ర్యాంకర్ల తల్లిదండ్రుల్లో వైద్యులు, వ్యాపారులు, ఉద్యోగులు ఉన్నారు. సీఐడీ నివేదిక ఆధారంగా ఐటీ అధికారులు సైతం వారికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఈ భారీ ఆర్థిక లావాదేవీల కోసం హవాలా, హుండీ మార్గాలను ఆశ్రయించి ఉంటారని సీఐడీ అనుమానిస్తోంది. ఆధారాలు లభించిన తరవాత అవసరమైతే ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ)కి సమాచారమివ్వాలని నిర్ణయించింది.