- ఆర్‌కేపీకి వచ్చిన పోలీసు బృందం
మెడికల్ అన్‌ఫిట్ స్కాంలో దర్యాప్తు ముమ్మరం
Published Fri, Aug 26 2016 11:22 PM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
రామకృష్ణాపూర్ : మెడికల్ అన్‌ఫిట్ స్కాం దర్యాప్తు చేపట్టిన పోలీసు అధికారులు విచారణను ముమ్మరం చేశారు. బెల్లంపల్లి డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ సాగిస్తున్నారు. అటు మెడికల్ అన్‌ఫిట్ స్కాం వెలుగులోకి రావడమే కాక దీనికి సూత్రదారి అయిన సలీం ఆత్మహత్యకు పాల్పడటంతో ఈ కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు సైతం ప్రతిష్టాత్మకంగా దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా పోలీసు అధికారుల బృందం శుక్రవారం రామకృష్ణాపూర్‌ను సందర్శించింది.
రాజిరెడ్డి ఇంట్లో సోదాలు..
కుంభకోణానికి సూత్రదారి అయిన సలీం ఆత్మహత్య ఘటన గత మంగళవారం జరిగిన సంగతి తెల్సిందే. మృతుడి వద్ద సూసైడ్ లేఖ కూడా పోలీసులకు లభ్యమైంది. ఈ లేఖలో బెలంపల్లికి చెందిన ఇద్దరితోపాటు రామకృష్ణాపూర్ చెందిన సింగరేణి కార్మికుడు రాజిరెడ్డి పేరు కూడా ఉంది. దీంతో పోలీసులు శుక్రవారం భగత్‌సింగ్‌నగర్‌లోని రాజిరెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇందులో ఒక బొమ్మ తుపాకి లభించినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా ఈ కేసుకు సంబంధించి రాజిరెడ్డి ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారు. ఇదే విషయమై మందమర్రి సీఐ సదయ్యను ఫోన్లో సంప్రందించగా రాజిరెడ్డి ఇంట్లో దొరికింది బొమ్మ తుపాకి అని దానిని ఎగ్జిబిషన్‌లలో బెలూన్లు కొట్టేందుకు వినియోగించేదనన్నారు. మెడికల్ అన్‌ఫిట్ కేసుకు సంబంధించి బాధితుల నుంచి ఇప్పటివరకు తమకు 25 ఫిర్యాదులు వచ్చాయని ఇంకా బాధితులు ఎవరైనా ఉంటే నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని తెలిపారు.
Advertisement