హెచ్‌సీయూలో తెరుచుకున్న మెస్‌లు
మూడో రోజూ వర్సిటీలో కొనసాగిన ఆంక్షలు
మంచినీరు, ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ
76వ అకడమిక్ కౌన్సిల్ సమావేశం వాయిదా
హైదరాబాద్: వరుస ఆందోళనలతో అట్టుడికిన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో గురువారం కూడా పోలీసు ఆంక్షలు కొన సాగాయి. సిబ్బంది, విద్యార్థులు మినహా ఇతరులెవరినీ లోనికి అనుమతించలేదు. అయితే ప్రొఫెసర్లు, విద్యార్థి, ప్రజా సంఘాల ఒత్తిడికి తలొగ్గిన యాజమాన్యం మెస్‌లు సహా మంచి నీరు, ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించింది. వర్సిటీలో మొత్తం 22 హాస్టళ్లు ఉండగా వీటిలో 4 వేల మంది వసతి పొందుతున్నారు. వీరి కోసం పది మెస్‌లున్నాయి. మెస్సుల్లో పనిచేస్తున్న సిబ్బందిపై విద్యార్థులు దాడి చేయడం తో బుధవారం ఆయా మెస్‌లను బంద్ చేసి నిరసనకు దిగిన విషయం తెలిసిందే. స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ ప్రకాశ్‌బాబు, చీఫ్ వార్డెన్ నాగరాజు, ప్రొఫెసర్లు మీనాహరిహరన్, పద్మజ విజ్ఞప్తి మేరకు గురువారం మెస్‌లను పున రుద్ధరించారు. రెండు రోజులుగా ఇబ్బందులు పడ్డ విద్యార్థులు మెస్‌లు తెరుచుకోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు వర్సిటీలో ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో గురువారం జరగాల్సిన 76వ అకడమిక్ కౌన్సిల్ సమావేశం వాయిదా వేశారు.
ఆందోళన విరమించి విధుల్లోకి..
కొందరు విద్యార్థుల దాడితో సహాయ నిరాకరణ చేస్తున్న బోధనేతర ఉద్యోగులను గురువారం వీసీ చర్చలకు ఆహ్వానించారు. బోధనేతర ఉద్యోగుల సంఘం జేఏసీ నేతలు ఆర్.గంగరాజు, నిరంజన్‌రెడ్డి, తుకారాం, శంకరయ్య, పూల్‌సింగ్, రఘురామ్ తదితరులు వీసీతో చర్చలు జరిపారు. తమపై దాడి చేసిన వారితో క్షమాపణలు చెప్పించడంతో పాటు భవిష్యత్తులో మళ్లీ దాడులకు పాల్పడమని లిఖితపూర్వక హామీ ఇప్పించాలని డిమాండ్ చేశారు. తమకు తగు రక్షణ కల్పించాలన్నారు. ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరిస్తామని, ఆందోళన విరమించాలని వీసీ సూచించడంతో తాత్కాలికంగా ఆందోళనను విరమిస్తున్నట్లు వారు ప్రకటించారు.
వీసీ దిష్టిబొమ్మ దహనం
కాగా, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వర్సిటీ షాపింగ్ కాంప్లెక్స్‌లో వీసీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు జుహైల్ మాట్లాడుతూ.. రోహిత్ మృతి ఘటనలో వీసీ ప్రథమ ముద్దాయి అని ఆరోపించారు. వర్సిటీ గేట్లకే కాక విద్యార్థుల గళాలకూ తాళం వేయాలని వీసీ చూస్తున్నారని, అరెస్టు చేసి జైలుకు పంపిన వారిని విడుదల చేయించాలని డిమాం డ్ చేశారు. మరోవైపు వంటావార్పు కార్యక్రమ సమయంలో పోలీసుల లాఠీచార్జీలో గాయపడి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పీహెచ్‌డీ విద్యార్థి ఉదయ్‌భానును.. రోహిత్ వేముల తల్లి రాధిక పరామర్శించారు.