మెట్రో భూములు ఎవరికీ ఇవ్వం
రాజకీయ ఆరోపణలు అవాస్తవం: మెట్రో రైలు ఎండీ
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైల్ ప్రాజెక్టు భూములను ప్రైవేటు వ్యక్తులు ఎవరికీ ఇచ్చే ప్రసక్తే లేదని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టంచేశారు. రాయదుర్గంలో మెట్రో రైలుకు కేటాయించిన 31.5 ఎకరాల భూ ములను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నించినందునే.. ప్రాజెక్టు పనులు చేయలేమని ప్రభుత్వానికి ఎల్ అండ్ టీ లేఖ రాసిందంటూ కొందరు నాయకులు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.
2012 ఆగస్టు 28న జీవో నంబర్ 123తో ప్రభుత్వం శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం గ్రామంలోని సర్వే నంబర్ 83/1లో 15 ఎకరాల భూమిని హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు టెర్మినల్ స్టేషన్, పార్కింగ్ స్థలం అభివృద్ధి కోసం ఇచ్చినట్లు తెలిపారు. మూడో కారిడార్‌ను శిల్పారామం నుంచి రాయదుర్గం వరకు పొడిగించాల్సిన కారణంగా రాయదుర్గంలో ఈ 15 ఎకరాల భూమి ని ఇచ్చినట్టు వివరించారు. ఎల్ అండ్ టీ ఆధీనంలో ఉన్న ఆ స్థలాన్ని వేరే వ్యక్తులకు అప్పగించే ప్రశ్నే లేదని స్పష్టంచేశారు. కాగా, గురువారం ఎన్వీఎస్‌రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను కలిశారు. అనంతరం మీడి యాతో మాట్లాడుతూ మెట్రో రైలు ముందు కు సాగుతోందని, ఆగడంలేదని తెలిపారు.