
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్– అమీర్‌పేట్ మార్గంలో ఏప్రిల్‌లో మెట్రోరైల్ ట్రయల్‌రన్‌కు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జూన్ తొలివారం నాటికి 17 కిలోమీటర్ల ఈ మార్గాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా పనులను పరుగెత్తిస్తు న్నారు. ఈ మార్గంలో మొత్తంగా 652 పిల్లర్ల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. వీటిపై మెట్రో పట్టాలు పరిచేందుకు వీలుగా వయాడక్ట్ సెగ్మెంట్ల ఏర్పాటు పనులు కూడా పూర్తికావచ్చాయి. ఫిబ్రవరి, మార్చిల్లో మెట్రోట్రాక్, విద్యుదీకరణ పూర్తి చేయనున్నారు.
లక్డీకాపూల్ వద్ద రైలు ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తిచేయడంతోపాటు ఈ మార్గంలోని పదిహేడు స్టేషన్ల నిర్మాణ పనులు శరవేగంగా చేస్తున్నారు. ప్రధానంగా ఎంజీబీఎస్ వద్ద రెండు కారిడార్లు కలిసే భారీ ఇంటర్ ఛేంజ్ మెట్రోస్టేషన్ ఏర్పాటు పనుల్లో వేగం పుంజుకుంది. నగరంలో ఒక చివర నుంచి మరో చివరకు(ఎల్బీనగర్– మియాపూర్) వరకు 29 కిలోమీటర్ల కారిడార్ పరిధిలో ఇప్పటికే 12 కిలోమీటర్ల మార్గంలో (అమీర్‌పేట్–మియాపూర్) మెట్రోరైళ్లు పరుగులు తీస్తున్న విషయం విదితమే. ఈ కారిడార్ పూర్తయితే నిత్యం సుమారు 6–7 లక్షల మంది మెట్రోరైళ్లలో రాకపోకలు సాగించే అవకాశాలున్నాయని, ప్రధాన రహదారిపై ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుముఖం పడుతుందని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు.
జూన్ నాటికి ఒకటి.. ఈ ఏడాది చివరికి మరోటి?
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 నాటికి అమీర్‌పేట్–హైటెక్ సిటీ మార్గంలోనూ మెట్రో పనులను పూర్తి చేసే దిశగా మెట్రో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జూబ్లీ చెక్‌పోస్ట్, పెద్దమ్మగుడి, శిల్పారామం ప్రాంతాల్లో మెట్రోస్టేషన్ల ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాల రీడిజైన్లు, స్వల్ప ఆటంకాలు మినహా అమీర్‌పేట్– హైటెక్‌సిటీ మార్గంలో మెట్రో పనుల పూర్తికి ఇబ్బందులు లేవని అధికారులు చెబుతున్నారు.
ఎంజీబీఎస్– జేబీఎస్ మార్గంలో ప్రధానంగా సుల్తాన్‌బజార్ ప్రాంతంలో పిల్లర్లు, వాటిపై వయాడక్ట్ సెగ్మెంట్ల ఏర్పాటు ప్రక్రియ జటిలంగా మారడం, పుత్లీబౌలి ప్రాంతంలో డబుల్ ఎలివేటెడ్ మార్గంలో చేపట్టిన పనులు నత్తనడకన సాగుతుండటంతో ఈ ఏడాది చివరినాటికి ఈ మార్గంలోనూ మెట్రోరైళ్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment