మెట్రో రెండోదశకు రెడ్ సిగ్నల్?
సుమారు 100 కి.మీ మార్గంలో రెండోదశ ప్రతిపాదనలు
పలు మార్గాల్లో ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ అధ్యయనం
రూ.25 వేల కోట్ల వ్యయమవుతుందని ప్రాథమిక అంచనా
రాష్ట్ర సర్కారు కోర్టులో బంతి
సిటీబ్యూరో:మహానగరం రూపురేఖలు మార్చనున్న మెట్రోరైలు ప్రాజెక్టు రెండోదశ కాగితాలకే పరిమితమైంది. పనులు ముందుకు సాగేందుకు అవసరమైన ఆస్తుల సేకరణ, నష్టపరిహారం పంపిణీ వంటి సమస్యలు జటిలంగా మారడం, ట్రాఫిక్ ఇక్కట్లు అధిగమించడం కష్టంగా మారడం వంటి చిక్కులతో మొదటిదశ పనులే ఆపసోపాలు పడుతూ ముందుకు సాగుతున్న విషయం విదితమే. ఇదే తరుణంలో ఏడాది క్రితం ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ అధికారులు, నిపుణుల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పలు మార్గాల్లో మెట్రో రెండో దశపై అధ్యయనం నిర్వహించింది. ఈ బృందాలు నగరంలోని పలు రద్దీ మార్గాల్లో ప్రయాణించి రెండోదశపై ఆచరణీయ ప్రతిపాదనలు సిద్ధంచేశారు. కానీ ఇవన్నీ ఏడాదిగా కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఫలక్‌నుమా మార్గాల్లో మొత్తం 72 కి.మీ మార్గంలో మొదటి దశ పనులు జరుగుతున్నాయి. ఈ పనులు 2018 డిసెంబరు నాటికి పూర్తిచేస్తామని నిÆ గతంలో స్పష్టంచేసింది. ఈ ఏడాది జూన్ 2న నాగోల్–బేగంపేట్, మియాపూర్–ఎస్.ఆర్.నగర్ రూట్లలో మెట్రోరైలు పరుగులు తీయడం తథ్యమని ప్రభుత్వ వర్గాలు తరచూ చెబుతున్న విషయం విదితమే.
రెండోదశపై అధ్యయనంతోనే సరి...
నాగోల్–ఎల్బీనగర్, ఎల్బీనగర్–హయత్‌నగర్, మియాపూర్–పటాన్‌చెరు, రాయదుర్గం–శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, నాగోల్–ఫలక్‌నుమా–శంషాబాద్ విమానాశ్రయం, తార్నాక–మౌలాలి, ఉప్పల్–యాదాద్రి తదితర మార్గాల్లో సుమారు 100 కి.మీ మేర మెట్రో రెండోదశ పనులు చేపట్టాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనలపై సమగ్ర అధ్యయనం చేపట్టాలని ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ అధికారులను కోరడంతో కార్పొరేషన్ ఇంజినీర్లు, నిపుణులు, నగర మెట్రోరైలు విభాగం అధికారులు రంగంలోకి దిగి ఏడాది క్రితమే సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వానికి నివేదించారు. కానీ ఈ ప్రతిపాదనలపై ఇప్పటివరకుఒక్క అడుగూ ముందుకుపడకపోవడం గమనార్హం.
100 కి.మీ..రూ.25 వేల కోట్లు..?
రెండోదశ మెట్రో ప్రాజెక్టును వంద కిలోమీటర్ల మార్గంలో చేపట్టేందుకు కిలోమీటరుకు రూ.250 కోట్ల చొప్పున సుమారు రూ.25 వేల కోట్లు అంచనా వ్యయం అవుతుందని ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రస్తుత తరుణంలో ఈస్థాయిలో వ్యయం చేసే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదన్నది సుస్పష్టం. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా రెండోదశకు నిధులు విదిల్చే స్థితిలో లేదు. తాజా బడ్జెట్‌లో దేశంలో పలు మెట్రోరైలు ప్రాజెక్టులకు పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తంచేసిన విషయం విదితమే. ఈనేపథ్యంలో రెండోదశ మెట్రో ప్రాజెక్టుకు రూ.25 వేల కోట్ల పెట్టుబడి పెట్టి చేపట్టేందుకు ఎవరు ముందుకొస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. మరోవైపు మెట్రో రెండోదశకు జైకా, ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ తదితర ఆర్థిక సంస్థలు చేయూతనందింస్తాయా అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికే రూ.14,132 కోట్ల అంచనా వ్యయంతో మూడు కారిడార్లలో 72 కి.మీ మేర చేపట్టిన మెట్రో ప్రాజెక్టు గడువు భూసేకరణ చిక్కులతో 18 నెలలపాటు పెరగడంతో ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.3 వేల కోట్ల మేర పెరిగిన విషయం విదితమే. ఈ తరుణంలో మెట్రో రెండోదశ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందా..? ఏళ్లుగా కాగితాలకే పరిమితమౌతుందా అన్నది రాష్ట్ర ప్రభుత్వమే తేల్చాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.