- మెట్రో పనులు పూర్తి
- ఆలందూరుమార్గం రెడీ
- ప్రారంభానికి చర్యలు
కోయంబేడు - ఆలందూరు మధ్య మెట్రో రైలు మార్గం పనులు ముగిశాయి. రైల్వే స్టేషన్లలో పనులు ముగియడంతో ఇక మెట్రో రైలు ప్రారంభానికి ముహూర్తం కోసం అధికారులు కసరత్తుల్లో పడ్డారు.
చెన్నై : చెన్నైలో ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించే విధంగా మెట్రో రైలు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. చాకలిపేట నుంచి అన్నా సాలై వైపుగా జెమిని, సైదా పేట, గిండి మీదుగా మీనంబాక్కం వరకు ఓ మార్గం, సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి కోయంబేడు మీదుగా వడపళని, గిండిలను కలుపుతూ సెయింట్ థామస్ మౌంట్ వరకు మరో మార్గంలో మెట్రో రైలు సేవలకు చర్యలు చేపట్టారు. ఈ మార్గాల్లో పనులు శరవేగంగా జరుగుతూ వస్తున్నాయి. బ్రెజిల్‌లో రూపుదిద్దుకున్న మెట్రో రైలు బోగీలు చెన్నై చేరాయి.
కోయంబేడు - ఆలందూరు మధ్య వంతెన మీద రైలు పయనించేందుకు తగ్గ అన్ని పనులు ముగిశాయి. ట్రైల్ రన్, ఇతర సాంకేతిక వ్యవహారాలకు సంబంధించి అన్ని పనులు ముగించారు. ఈ మార్గంలో ఏడు రైల్వే స్టేషన్ల ఏర్పాటు పనులు ముగిశాయి. కోయంబేడు, సీఎంబీటీ, వడపళని, అశోక్ నగర్, ఈక్కాట్టు తాంగల్, ఆలందూరు రైల్వే స్టేషన్లలో తుది మెరుగులు దిద్దే పనిలో పడ్డారు. ఈ పనులు ముగియనుండడంతో, ఆ స్టేషన్ల పరిసరాల్లో ప్రకటన బోర్డుల ఏర్పాటుకు ఆయా సంస్థల్ని ఆహ్వానించే పనిలో పడ్డారు.
కోయంబేడు- ఆలందూరు మార్గంలో ప్రతి నాలుగు నిమిషానికి ఒక రైలు నడిపే విధంగా అన్ని చర్య ల్ని ఆ ప్రాజెక్టు అధికారులు తీసుకున్నారు. అయితే, రైలు సేవలు ఎప్పటి నుంచి నడపాలోనన్న ముహూర్తం ఎంపికలో నిమగ్నమయ్యారు. అన్ని పను లు ముగిసిన దృష్ట్యా, మంచి ముహూర్తం లభించగానే, ఆ మార్గంలో రైలును పట్టాలెక్కించి ప్రయాణికులతో పరుగులు తీయించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ మార్గంలో రోజుకు వే లాది మంది మెట్రో రైలు సేవల్ని పొందుతారన్న పరిశీలనను సైతం అధికారులు పూర్తి చేసినా, ప్రారంభోత్సవ ముహూర్తం మాత్రం ఎప్పుడు కుదురుతుందో..!