మెట్రో కారిడార్లలో జర భద్రం
ఉప్పల్: నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న మెట్రోరైలు పనుల్లో తరచూ అపశ్రుతులు చోటుచేసుకుంటున్నాయి. ఓవైపు ట్రాఫిక్ రాకపోకలు సాగుతుండగానే మరోవైపు మూడు కారిడార్లలో మెట్రో పిల్లర్ల నిర్మాణం, సెగ్మెంట్ల బిగింపు, స్టేషన్ల నిర్మాణం, రోడ్ల విస్తరణ తదితర పనులు కొనసాగుతున్నాయి. ఫలితంగా నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవడమే గాక అక్కడక్కడా ప్రమాదాలూ సంభవిస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో మెట్రో రూట్లలో రాకపోకలు సాగించడానికి వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. శనివారం ఉదయం ఉప్పల్, నారాయణగూడలో ప్రమాదాలు జరిగాయి. ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద జరిగిన ప్రమాదం ఓ వ్యక్తి ప్రాణాల మీదకొచ్చింది. పిల్లర్ పైభాగం నుంచి పొడవాటి ఇనుప పైపు పడడంతో తీవ్రంగా గాయపడిన సదరు వ్యక్తి ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. నారాయణగూడలో బస్‌షెల్టర్ కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద...
వనస్థలిపురం వైదేహినగర్‌కు చెందిన ఈశ్వర్‌ప్రసాద్ (48) చర్లపల్లిలోని ఎంజీఆర్‌ఎం కంపెనీలో మేనేజర్ (అకౌంట్స్). శనివారం ఉదయం 9.30 ప్రాంతంలో ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై ఉప్పల్ మీదుగా చర్లపల్లికి బయలు దేరారు. ఉప్పల్ సర్వే ఆఫ్ ఇండియా మెట్రో స్టేషన్ పిల్లర్ కె.గ్రేడ్ వద్దకు చేరుకోగానే అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఐరన్ పైపును అకస్మాత్తుగా రోడ్డుపైకి తీసుకు రావడంతో ఆ పైపు ఈశ్వర్ ప్రసాద్ తలకు తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు ఈశ్వర్ ప్రసాద్‌ను ఉప్పల్ ఆది త్య ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఉప్పల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుండగా ప్రత్యక్ష సాక్షుల కథనం మరోలా ఉంది. ఈశ్వర్‌ప్రసాద్ ద్విచక్రవాహనంపై సర్వే ఆఫ్ ఇండి యా మెట్రోస్టేషన్ వద్దకు రాగానే పిల్లర్ పైనుంచి సుమారు ఆరు మీటర్ల పొడవాటి ఇనుప పైపు తలపై పడగా అక్కడికక్కడే కుప్పకూలి పోయారని అంటున్నారు. పైభాగంలో భారీ ఎత్తున పనులు చేపడుతున్న సమయంలో కింద రోడ్డుపై ట్రాఫిక్‌ను నియంత్రించక పోవడంపై విమర్శలు వస్తున్నాయి.
నిర్మాణ సంస్థ, మెట్రో అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగినప్పటికీ ఎల్ అండ్ టీ అధికారులు, సిబ్బంది స్పందించలేదని, క్షతగాత్రుడిని ఆసుపత్రిలో చేర్పించేందుకు కూడా చొరవ చూపలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా భద్రత చర్యలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.