డిప్యూటీ సీఎం ఇలాకాలో పతంగి పాగా
మలక్‌పేట...
దిల్‌సుఖ్‌నగర్: మలక్‌పేట్ నియోజకవర్గంలో ఎంఐఎం మరోసారి పట్టు నిలుపుకొంది. మొత్తం 6 డివిజన్లకుగాను నాలుగు డివిజన్లలో ఆ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. గత బల్దియా ఎన్నికల్లో ఎంఐఎం మూడు డివిజన్లు సాధించగా ఈ సారి మరో సీటును అదనంగా గెలుపొందడం విశేషం. కాగా ఇదే నియోజకవర్గ పరిధిలోని ఆజంపురా డివిజన్‌లోనే డిప్యూటీ సీఎం మహమూద్ అలీ నివాసం ఉంది. ఆయన తన సొంత ఇలాకాలో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడంలో విఫలమయ్యారు. గత బల్దియా ఎన్నికల్లో మూడు డివిజన్లలో ఎంఐఎం, మూడు డివిజన్లలో టీడీపీ, ఒక స్థానంలో ఎంబీటీ గెలుపొందింది. ఈసారి పునర్విభజనతో డివిజన్ల సంఖ్య ఆరుకు తగ్గినా ఎంఐఎం తన ప్రాబల్యాన్ని మరింత పెంచుకుంది.
కాగా గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అనూహ్యంగా పుంజుకుంది. మూసారాంబాగ్‌లో తీగల సునారితారెడ్డి, సైదాబాద్ నుంచి సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి టీఆర్‌ఎస్ తరఫున ఘన విజయం సాధించడం విశేషం. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 11378 ఓట్లు సాధించగా, తాజా ఎన్నికల్లో 26 వేల పైచిలుకు ఓట్లు సాధించి ఓటు బ్యాంక్‌ను గణనీయంగా పెంచుకోగలిగింది. గతంలో నియోజకవర్గంలో తిరుగులేని తెలుగుదేశం పార్టీ ఈ సారి తుడుచుపెట్టుకుపోవడం గమనార్హం. పార్టీ తరఫున హేమాహేమీలు బరిలోకి దిగినా పరాజయం పాలయ్యారు. గత ఎన్నికల్లో అజాంపురా నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికైన ఎంబీటీ నాయకుడు అమ్జదుల్లాఖాన్ ఈ సారి అక్భర్‌భాగ్ డివిజన్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.