
ఎస్టీ గురుకులాలకు కీర్తిని తెచ్చారు
హైదరాబాద్: పర్వతారోహణలో గిరిజన విద్యార్థులు కొత్త చరిత్రను సృష్టించి, ఎస్టీ గురుకులాలకు ఎనలేని కీర్తిప్రతిష్టలను తీసుకొచ్చారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అన్నారు. గత ఏడాది మౌంట్ రెనాక్‌ను అధిరోహించిన 16 మంది ఎస్టీ గురుకులాల విద్యార్థులు, ఒక కోచ్‌ను, ఇటీవల కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన ఎస్టీ విద్యార్థులు జి.సింధు, ఎన్.కృష్ణలను శుక్రవారం సంక్షేమ భవన్‌లో మంత్రి చందూలాల్ ఘనంగా సన్మానించారు.
గతంలో ఇచ్చిన హామీ మేరకు వీరికి రూ.51 వేల చొప్పున ప్రోత్సాహకాన్ని కూడా అందజేశారు. అలాగే ఇంటర్మీడియెట్‌లో స్టేట్‌ర్యాంకులు సాధించిన డి.నాగమణి, టి.భావనలకు రూ. 25 వేల చొప్పున, అత్యధిక మార్కులను సాధించిన మరో 8 మంది విద్యార్థులకు రూ.15 వేల చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 9వ తరగతి నుంచే సివిల్స్‌కు శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఎస్టీ విద్యార్థులకు ఎప్పటికప్పుడు వైద్యసేవలను అందించేందుకు ఎస్టీ సంక్షేమశాఖ కేంద్ర కార్యాలయంలో 24 గంటలు నడిచేలా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీశాఖ కమిషనర్ లక్ష్మణ్, ఎస్టీ గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.