వారిది రెండు నాల్కల ధోరణి | Minister Harish Rao comments on oppositions | Sakshi
Sakshi News home page

వారిది రెండు నాల్కల ధోరణి

Published Wed, Jul 27 2016 3:14 AM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM

వారిది రెండు నాల్కల ధోరణి

వారిది రెండు నాల్కల ధోరణి

- ప్రతిపక్షాలపై మంత్రి హరీశ్ మండిపాటు
- ప్రాజెక్టులపై అపోహలు సృష్టిస్తున్నారు
- కర్ణాటకలో ఆలమట్టి కోసం 22 గ్రామాలు ముంచుతున్నారు
- దీనిపై జైపాల్‌రెడ్డి మాట్లాడరేమి?
- భూసేకరణపై టీడీపీది ఢిల్లీలో ఒక మాట.. గల్లీలో ఒక మాట
- 2018 నాటికి మల్లన్నసాగర్ పూర్తి చేస్తాం
 
 సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రజలంతా ఒక వైపు ఉంటే, ప్రతిపక్షాలు మరొక వైపు ఉన్నాయి. ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలని చూస్తుంటే.. ప్రతిపక్షాలు వారిని రెచ్చగొట్టే పనిలో ఉన్నాయి. ప్రాజెక్టులపై అపోహలు, అనుమానాలు సృష్టిస్తున్నాయి’’ అని సాగునీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రతిపక్షాలు అభివృద్ధిని అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆయన ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, చింత ప్రభాకర్, పార్టీ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. ‘‘అసలు ప్రతిపక్షాల సమస్య ఏంటి? వీళ్లు సమైక్య రాష్ట్రంలో గోదావరి ప్రాజెక్టులను పట్టించుకోక తెలంగాణను ఎండబెట్టారు.

వారి పాపం వల్లే రైతుల ఆత్మహత్యలు జరిగాయి’’ అని హరీశ్ అన్నారు. ప్రజలను మెప్పించి, ఒప్పించి భూసేకరణ జరిపి ప్రాజెక్టులు కడతామని స్పష్టంచేశారు. ‘‘ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చిద్దామంటే తప్పులు బయట పడిపోతాయని, తలవంచుకోవాల్సి వస్తుందని కాంగ్రెస్ సభ నుంచి వెళ్లిపోయింది. కాంగ్రెస్, టీడీపీ, సీపీఎంలవి రెండు నాల్కల ధోరణి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడం కోసం 22 గ్రామాలను, 1.20 లక్షల ఎకరాలను ముంచుతున్నారు. దేశం మొత్తంలో ఏ ప్రాజెక్టు కింద ఇంత ముంపు లేదు.  జాతీయ నాయకుడైన జైపాల్‌రెడ్డి దీనిపై స్పందించాలి’’ అని అన్నారు.

 కాంగ్రెస్, టీడీపీ తోడు దొంగలు
 టీడీపీ గల్లీలో 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలంటుందని, ఢిల్లీలో మాత్రం రద్దు చేయాలంటోందని హరీశ్ పేర్కొన్నారు. ‘‘ఏపీలో రైతుల నుంచి టీడీపీ బలవంతంగా భూములు లాక్కోలేదా? అమరావతి రాజధానికి 500 ఎకరాలు సరిపోతుంది. మరి 54 వేల ఎకరాలను ఎందుకు సేకరిస్తున్నారు? అమరావతి రింగ్‌రోడ్డుకు 4,200 ఎకరాలు, గన్నవరం ఎయిర్‌పోర్టుకు 2,500 ఎకరాలు, మచిలీపట్నం పోర్టుకు 15 వేల ఎకరాలు, కాకినాడ సెజ్‌కు 6 వేల ఎకరాలు, నెల్లూరు సెజ్‌కు 12 వేల ఎకరాలు, దొనకొండ ఇండస్ట్రియల్ హబ్‌కు 28 వేల ఎకరాలు, వాన్‌పిక్ కోసం 16 వేల ఎకరాలు సేకరించలేదా?  ఏపీ చేయొచ్చు కానీ.. బీడు భూములకు రెండు పంటలకు సాగునీరందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తే తప్పా..? ఇక్కడ మాట్లాడే హక్కు టీడీపీకి ఉందా ? ఇది విధానమేనా? కాంగ్రెస్, టీడీపీ తోడు దొంగలు’’ అంటూ మంత్రి దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వస్తే గతంలో కాంగ్రెస్ సేకరించిన భూములను రైతులకు వెనక్కి ఇస్తామని టీడీపీ హామీ ఇచ్చిందని, మరి ఇప్పుడు గంగవరం పోర్టు, కాకినాడ సెజ్, వాన్‌పిక్ భూములకు సంబంధించి ఎన్ని ఎకరాలు వాపస్ ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. నందిగ్రామ్‌లో సీపీఎం చేసిందేమిటి.. అక్కడ భూసేకరణ కోసం 14 మంది రైతులను పొట్టన బెట్టుకోలేదా అని నిలదీశారు.

 తక్కువ ముంపుతో కడతాం
 అతి తక్కువ ముంపుతో ప్రాజెక్టులను రీ డిజైన్ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని, మల్లన్న సాగర్ ప్రాజెక్టులో 50 టీఎంసీల రిజర్వాయర్ కోసం కేవలం 8 గ్రామాలే ముంపునకు గురవుతున్నాయన్నారు. కానీ గతంలో ఎల్లంపల్లిలో 20 టీఎంసీల కోసం 21 గ్రామాలు, మిడ్‌మానేరులో 28 టీఎంసీల కోసం 18 గ్రామాలు, పులిచింతల లో 45 టీఎంసీల కోసం 28 గ్రామాలు ముంచారన్నారు. కాంగ్రెస్ ప్రతిపాదించిన పాలమూరు-రంగారెడ్డిలో 115 టీఎంసీల కోసం 32 గ్రామాలు ముంపునకు గురవుతుండగా, తాము ఆ ప్రాజెక్టునే 92 టీఎంసీలతో కేవలం 6 గ్రామాలు, డిండిలో 23 టీఎంసీల రిజర్వాయర్‌తో 8 గ్రామాలు మాత్రమే ముంపునకు గురయ్యేలా రీ డిజైన్ చేశామన్నారు. ఏపీకి మూడో పంటకు నీరివ్వడానికి కాం గ్రెస్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి దగ్గరుం డి పులిచింతల ప్రాజెక్టు కట్టించారని, ఈ ప్రాజెక్టులో మునిగేది తెలంగాణ, లబ్ధి పొందేది మాత్రం ఏపీ అన్నారు. జైపాల్‌రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడొద్దని, విపక్షాలు ఇకనైనా రాష్ట్ర పునర్నిర్మాణానికి కలసి రావాలని హితవు పలికారు.
 
 2018 నాటికి మల్లన్నసాగర్ పూర్తి
 ‘‘ఉమ్మడి రాష్ట్రంలో ఏ చిన్న ప్రాజెక్టుకు కూడా నోచుకోని జిల్లా మెదక్. అందుకే మల్లన్న సాగర్‌ను తలపెట్టాం. 80శాతం సాగు, 10శాతం హైదరాబాద్‌కు తాగునీరు, 10శాతం పారిశ్రామిక అవసరాలకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టును 2018 నాటికల్లా ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తాం’’ అని హరీశ్ చెప్పారు. 8 గ్రామాల్లో ఆరు గ్రామాలు ఇప్పటికే అంగీకరించాయని, మరో రెండు గ్రామాలను ఒప్పించే పనిలో ఉండగానే ప్రతిపక్షాలు కుట్ర చేశాయన్నారు. ఇక్కడ ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న కాంగ్రెస్, సీపీఎంలు ఏపీలో జరుగుతున్న వ్యవహారాలపై ఎందుకు స్పందించడం లేదని, అక్కడ ఎందుకు ఉద్యమాలు చేయడం లేదని నిలదీశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement