ఐటీఐఆర్ ప్రాజెక్టుకు నిధులివ్వండి
కేంద్ర మంత్రి రవిశంకర్‌కు మంత్రి కేటీఆర్ లేఖ
♦ కేంద్రం మద్దతు లేక ముందుకు కదలని ప్రాజెక్టు
♦ రూ.3,275 కోట్లు మంజూరు చేసినా విడుదల చేయలేదు
♦ అంగీకరించిన మేరకు నిధులివ్వాలని విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్లుగా కేంద్రం నుంచి మద్దతు లేకపోవడంతో ఐటీఐఆర్ ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందని ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. కేంద్రానికి ఈ ప్రాజెక్టు పట్ల స్పష్టత లేకపోవడం వల్ల అనేక అనుమానాలు నెలకొన్నాయని, వీటివల్ల గందరగోళం తలెత్తిందన్నారు.
ఐటీఐఆర్ ప్రాజెక్టుపై విధాన పరమైన స్పష్టత ఇవ్వడంతోపాటు ఇప్పటికే ప్రాజెక్టులో భాగంగా నాలుగేళ్ల కిందట ఆమోదించిన నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు. హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టుకు నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ఆదివారం లేఖ రాశారు.
రెండు సార్లు డీపీఆర్ సమర్పించాం..
2013 సెప్టెంబర్‌లో ప్రతిష్టాత్మక ఐటీఐఆర్ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతివ్వడం జాతీయ స్థాయిలో ఆసక్తి రేకెత్తించిందని, అయితే ఇప్పటివరకు ఎలాంటి నిధులు విడుదల కాలేదని పేర్కొన్నారు. ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు 2008లో కేంద్రం వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఐటీఐఆర్‌లను మంజూ రు చేయాలని నిర్ణయించిందని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టులకు మౌలిక వసతుల కల్పన కోసం కేంద్రం అవసరమైన వయబిలిటీ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్) ఇవ్వాల్సి ఉంటుందన్నారు. హైదరాబాద్‌లో 202 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఐటీఐఆర్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ఐటీ శాఖ 2010లో ప్రతిపాదిం చగా, అప్పటి కేంద్రం ఆమోదించిందన్నారు.
మౌలిక వసతుల కల్పన కోసం రూ.4,863 కోట్లను రెండు దశల్లో సహాయం చేయాలని కేంద్రాన్ని కోరుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు సార్లు ఐటీఐఆర్ డీపీఆర్ సమర్పించామన్నారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించి రూ.3,275 కోట్లను (తొలి దశ రూ.165 కోట్లు, రెండో దశ రూ.3,110 కోట్లు) కేంద్రం మంజూరు చేసిందన్నారు. అనేక సార్లు విజ్ఞప్తి చేసినా పూర్తిస్థాయి నిధుల విడుదల మాత్రం జరగలేదన్నారు. తాను స్వయంగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కలసి ఐటీఐఆర్‌కు సహకరించాల్సిందిగా కోరానని గుర్తుచేశారు. కేంద్రం అంగీకరించిన మేరకు నిధులను విడుదల చేయాలని కోరారు. కేంద్రం ఇచ్చే ఈ సాయం హైదరాబాద్‌కు మరిన్ని పెట్టుబడులు తేవడంతోపాటు యువతకు ఉద్యోగాలు వస్తాయని విజ్ఞప్తి చేశారు.
కాకతీయ టెక్స్‌టైల్స్ పార్కు శంకుస్థాపన వాయిదా
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లాలో ఈ నెల 16న నిర్వహించ తలపెట్టిన కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్క్ శంకుస్థాపన కార్యక్రమాన్ని వాయిదా వేశామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఆదివారం ఆయన ట్వీటర్ ద్వారా తెలిపారు.
ఐటీలో తెలంగాణ మేటి
సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఐటీ, అనుబంధ రంగాల్లో రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని కేటీఆర్ తన లేఖలో ప్రస్తావించారు. తెలంగాణ ఐటీ ఎగుమతులు జాతీయ సగటు కన్నా అధికంగా ఉన్నాయన్నారు. 2016–17లో జాతీయ సగటు కన్నా 4 శాతం అధిక ఐటీ ఎగుమతులను రాష్ట్రం సాధించిందని పేర్కొన్నారు. గత మూడేళ్లలో ఐటీ రంగంలో ప్రత్యక్ష ఉపాధి 3,23,396 నుంచి 4,31,891 మందికి పెరిగిందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్‌ఐపాస్ విధానం ద్వారా ప్రపంచ ప్రసిద్ధ సంస్థలైన గూగుల్, యాపిల్, అమెజాన్, సేల్స్ ఫోర్స్ వంటి కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాయని వివరించారు. ఇన్నొవేషన్ రంగంలోనూ తెలంగాణ దూసుకుపోతోందన్నారు. దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ టీ–హబ్‌ను ఏర్పాటు చేశామన్నారు. టీ–హబ్‌ను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ గతేడాది స్వయంగా సందర్శించి, స్టార్టప్‌లపై ప్రశంసలు కురిపించారని గుర్తుచేశారు. తెలంగాణ యువతకు వృత్తి నైపుణ్యం అందించడానికి టాస్క్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు.