ITIR project
-
బీజేపీ క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్
సాక్షి, హైదారాబాద్: రాజధాని హైదరాబాద్ నగరానికి ఐటీఐఆర్ తీసుకురాని బీజేపీ క్షమాపణలు చెప్పాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఐటీఐఆర్‌ను మూలన పెట్టింది బీజేపీ ప్రభుత్వమే అని మండిపడ్డారు. బీజేపీ మంత్రి చేసిన ప్రకటనపై సమాచారం లేకపోవడం.. బండి సంజయ్ అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. బెంగళూరులాంటి సిటీలోనూ ఐటీఐఆర్ ఒక్క అడగు ముందుకు పడలేదన్నారు. బెంగళూరులోనూ ఐటీఐఆర్ ప్రాజెక్ట్ రాకపోవడానికి మేమే కారణమా అని ప్రశ్నించారు. 2014 నుంచి రాసిన లేఖలు, రిపోర్టులు బండి సంజయ్‌కు ఇస్తామని, ఐటీఐఆర్ తీసుకొచ్చే దమ్ము బండి సంజయ్‌కు ఉందా అని కేటీఆర్ నిలదీశారు. చదవండి: సీఎం కేసీఆర్ పీఆర్వో విజయ్ రాజీనామా! -
‘ఐటీఐఆర్’పై బీజేపీది అసత్య ప్రచారం
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్)కు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) పంపినా తెలంగాణ నుంచి ఎలాంటి సమాచారం లేదని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే ప్రకటించడం లోక్‌సభను తప్పుదోవ పట్టించడమేనని మంత్రి కె. తారక రామారావు విమర్శించారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుపై స్థానిక బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారంపై కేటీఆర్ గురువారం స్పందించారు. ఐటీఐఆర్‌కు సంబంధించి గతంలోనే ఎన్నోసార్లు రాష్ట్రం నుంచి విజ్ఞప్తులు వెళ్లిన విషయాన్ని బీజేపీ ఎంపీ బండి సంజయ్ వేసిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో కేంద్ర మంత్రి దాచిపెట్టారన్నారు. రాష్ట్రం ఏర్పడిన తొలిరోజు నుంచే రాష్ట్రానికి ఐటీఐఆర్ ప్రాజెక్టును తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాయడంతోపాటు కనీసం పది సందర్భాల్లో కేంద్రానికి ప్రత్యక్షంగా, లేఖల ద్వారా విజ్ఞప్తి చేశామన్నారు. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన బండారు దత్తాత్రేయకు కూడా 2016లో స్వయంగా తాను డీపీఆర్‌ను అందజేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. బీజేపీ నేతలు ఇప్పటికైనా ఐటీఐఆర్ ప్రాజెక్టును హైదరాబాద్‌కు తీసుకురావాలన్నారు. బీజేపీ నేతలవి అసత్య ప్రకటనలు రాష్ట్ర బీజేపీ నాయకులతోపాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా అసత్యాలతో ప్రజలను తప్పదోవ పట్టిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. ఐటీఐఆర్‌పై సత్వర నిర్ణయం తీసుకొని హైదరాబాద్ ఐటీ పరిశ్రమకు మరింత ఊతం అందించాలని 2014 జూన్ నుంచి 2021 జనవరి వరకు కేంద్రానికి పదేపదే విజ్ఞప్తి చేశామన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి పంపిన ప్రతి లేఖ, విజ్ఞప్తులు కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి రెండుసార్లు ఐటీఐఆర్‌కు సంబంధించిన డీపీఆర్‌లను సమర్పించినా తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తులను కేంద్రం బుట్టదాఖలు చేసిందన్నారు. పార్లమెంటు వేదికగా తాజాగా కేంద్ర మంత్రి కూడా ఇచ్చిన సమాధానాన్ని బట్టి ఐటీఐఆర్ రద్దుకే బీజేపీ మొగ్గు చూపుతున్నట్లు తేలుతోందన్నారు. -
ఐటీఐఆర్ సంగతేంటి?
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్)ను పునరుద్ధరించడం లేదా అంతకంటే మెరుగైన మరో కార్య క్రమాన్ని చేపట్టాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు కేంద్ర ప్రభు త్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు గురువారం ఆయన లేఖ రాశారు. కొన్నేళ్లుగా కేంద్ర ప్రభు త్వం చెప్తున్న మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాల స్ఫూర్తితో ఐటీఐ ఆర్‌ను ప్రారంభించాలని లేఖలో విన్నవిం చారు. కోవిడ్‌లాంటి సంక్లిష్ట సమయంలో ఐటీఐఆర్‌ను పునరుద్ధరిస్తే తెలంగాణలో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. 2014లో ఐటీఐఆర్ ప్రాజెక్టును సమీక్షించిన అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం అంతకంటే మేలైన పథకం తెస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఐటీఐఆర్ భాగస్వాములతో 2017లో విస్తృత స్థాయి చర్చలు జరిగినా కేంద్రం నుంచి ప్రకటన రాని విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఐటీఐఆర్‌ను ప్రకటించి పదేళ్లు.. ‘ఐటీఐఆర్ పేరిట కేంద్ర ప్రభుత్వం 2008లో ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకుని, 2010లో హైదరాబాద్, బెంగళూరు నగరాలను ఈ కార్యక్రమం కోసం ఎంపిక చేసింది. ఐటీఐఆర్ కోసం 49 వేల ఎకరాలతో పాటు మూడు క్లస్టర్లను కూడా గుర్తించారు. పెట్టుబడులు రప్పించేందుకు రూ.3,275 కోట్లతో వివిధ కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రభుత్వం అంగీకరించింది. రూ.165 కోట్లతో మొదటిదశను 2018 నాటికే పూర్తి చేసి, మిగతా పనులను వివిధ దశల్లో 20 ఏళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించారు. ఐటీఐఆర్ ప్రాజెక్టులో మొదటిదశలో గుర్తించిన పనులకు సంబంధించి అదనపు నిధుల కోసం తెలంగాణ ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నా నిధులు లేక ఐటీఐఆర్ కార్యక్రమాలు ప్రారంభం కాలేదు’అని కేటీఆర్ లేఖలో ప్రస్తావించారు. సీఎం లేఖలు రాసినా స్పందన లేదు.. ‘ఐటీఐఆర్ ప్రాజెక్టుకు సంబంధించి సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖలు రాసినా స్పందన లేదు. అయినా రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.57,258 కోట్ల నుంచి 2019–20 నాటికి రూ.1.28 లక్షల కోట్లకు చేరింది. ఐటీ రంగంలో ఆరేళ్లలో 110 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఇది జాతీయ సగటు కన్నా ఎక్కువ.. అలాగే ఉద్యోగుల సంఖ్య కూడా రెట్టింపైంది. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన సంక్షోభంలోనూ తెలంగాణ ఐటీ పరిశ్రమలు ఇబ్బందులు లేకుండా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి..’అని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. ఐటీ రంగం పూర్వస్థితికి చేరేందుకు కొంతసమయం పడుతుందని, హైదరాబాద్ ఐటీ రంగానికి ఊతమిచ్చేలా కేంద్రం నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. -
కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ‘ఐటీఐఆర్’ని సాధించాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఐటీఐఆర్ ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకూ అడగలేదని కేంద్రమంత్రి రవిప్రసాద్ పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించిన విషయాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గుర్తు చేశారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద భట్టి విక్రమార్కతో పాటు మంథని ఎమ్మెల్యే డి.శ్రీధర్‌బాబు, ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రాజెక్టుపై వాస్తవాలను ప్రజలకు తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం పక్కదోవ పట్టిస్తుందని, ఈ ప్రాజెక్టుతో 70 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని ఆయన తెలిపారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు తెలంగాణ హక్కు అని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రాజెక్టును ఎలాగైనా సాధించాలని సూచించారు. అంతేకాక తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్లో ఐటీఐఆర్ ప్రాజెక్టుతో 68 లక్షల మందికి లాభం చేకూరతుందని స్పష్టంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఐటీఐఆర్ ప్రాజెక్టు సాధించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. స్పీకర్ కూడా అసెంబ్లీలో ఐటీఐఆర్ ప్రాజెక్ట్ విషయాన్ని చర్చించడానికి సమయం ఇవ్వలేదని, ప్రభుత్వ ఆలోచన విధానం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తే.. ప్రభుత్వాన్నీ గట్టిగా నిలదీస్తామని ఎమ్మెల్యే ఈ మేరకు హెచ్చరించారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల వల్లే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందని అన్నారు. గత ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న మంత్రులు ఇప్పుడు మాట మార్చి గతంలో ఏ అభివృద్ధి జరగలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నదని అభిప్రాయపడ్డారు. -
ఐటీఐఆర్‌పై ప్రభుత్వ తీరు బాధాకరం
టీపీసీసీ నేత దాసోజు శ్రవణ్ సాక్షి, హైదరాబాద్: ఐటీఐఆర్‌పై టీఆర్ఎస్ ప్రభుత్వ తీరు బాధాకరమని, ఇది కొన్ని లక్షల ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టని టీపీసీసీ ప్రధాన అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ అన్నారు. గత మూడేళ్లుగా ఈ ప్రాజెక్టును ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన పార్టీ నేతలు మల్లు రవి, అద్దంకి దయాకర్ తదితర నేతలతో కలసి విలేకరులతో మాట్లాడారు. ఇది రూ.2.19 లక్షల కోట్ల ప్రాజెక్టని, 15 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని, ఇంతటి కీలకమైన ప్రాజెక్టుపై నిర్లక్ష్యం ఎందుకని నిలదీశారు. మంత్రి జగదీశ్‌రెడ్డి బుడ్డర్‌ఖాన్‌లా వ్యవహరిస్తున్నాడని, పోలీసులు కేసీఆర్‌కు కాపలా కుక్కల్లా మారారని శ్రవణ్ మండిపడ్డారు. -
ఐటీఐఆర్ ప్రాజెక్టుకు నిధులివ్వండి
కేంద్ర మంత్రి రవిశంకర్‌కు మంత్రి కేటీఆర్ లేఖ ♦ కేంద్రం మద్దతు లేక ముందుకు కదలని ప్రాజెక్టు ♦ రూ.3,275 కోట్లు మంజూరు చేసినా విడుదల చేయలేదు ♦ అంగీకరించిన మేరకు నిధులివ్వాలని విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్లుగా కేంద్రం నుంచి మద్దతు లేకపోవడంతో ఐటీఐఆర్ ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందని ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. కేంద్రానికి ఈ ప్రాజెక్టు పట్ల స్పష్టత లేకపోవడం వల్ల అనేక అనుమానాలు నెలకొన్నాయని, వీటివల్ల గందరగోళం తలెత్తిందన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుపై విధాన పరమైన స్పష్టత ఇవ్వడంతోపాటు ఇప్పటికే ప్రాజెక్టులో భాగంగా నాలుగేళ్ల కిందట ఆమోదించిన నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు. హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టుకు నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ఆదివారం లేఖ రాశారు. రెండు సార్లు డీపీఆర్ సమర్పించాం.. 2013 సెప్టెంబర్‌లో ప్రతిష్టాత్మక ఐటీఐఆర్ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతివ్వడం జాతీయ స్థాయిలో ఆసక్తి రేకెత్తించిందని, అయితే ఇప్పటివరకు ఎలాంటి నిధులు విడుదల కాలేదని పేర్కొన్నారు. ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు 2008లో కేంద్రం వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఐటీఐఆర్‌లను మంజూ రు చేయాలని నిర్ణయించిందని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టులకు మౌలిక వసతుల కల్పన కోసం కేంద్రం అవసరమైన వయబిలిటీ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్) ఇవ్వాల్సి ఉంటుందన్నారు. హైదరాబాద్‌లో 202 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఐటీఐఆర్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ఐటీ శాఖ 2010లో ప్రతిపాదిం చగా, అప్పటి కేంద్రం ఆమోదించిందన్నారు. మౌలిక వసతుల కల్పన కోసం రూ.4,863 కోట్లను రెండు దశల్లో సహాయం చేయాలని కేంద్రాన్ని కోరుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు సార్లు ఐటీఐఆర్ డీపీఆర్ సమర్పించామన్నారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించి రూ.3,275 కోట్లను (తొలి దశ రూ.165 కోట్లు, రెండో దశ రూ.3,110 కోట్లు) కేంద్రం మంజూరు చేసిందన్నారు. అనేక సార్లు విజ్ఞప్తి చేసినా పూర్తిస్థాయి నిధుల విడుదల మాత్రం జరగలేదన్నారు. తాను స్వయంగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కలసి ఐటీఐఆర్‌కు సహకరించాల్సిందిగా కోరానని గుర్తుచేశారు. కేంద్రం అంగీకరించిన మేరకు నిధులను విడుదల చేయాలని కోరారు. కేంద్రం ఇచ్చే ఈ సాయం హైదరాబాద్‌కు మరిన్ని పెట్టుబడులు తేవడంతోపాటు యువతకు ఉద్యోగాలు వస్తాయని విజ్ఞప్తి చేశారు. కాకతీయ టెక్స్టైల్స్ పార్కు శంకుస్థాపన వాయిదా సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లాలో ఈ నెల 16న నిర్వహించ తలపెట్టిన కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్ శంకుస్థాపన కార్యక్రమాన్ని వాయిదా వేశామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఆదివారం ఆయన ట్వీటర్ ద్వారా తెలిపారు. ఐటీలో తెలంగాణ మేటి సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఐటీ, అనుబంధ రంగాల్లో రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని కేటీఆర్ తన లేఖలో ప్రస్తావించారు. తెలంగాణ ఐటీ ఎగుమతులు జాతీయ సగటు కన్నా అధికంగా ఉన్నాయన్నారు. 2016–17లో జాతీయ సగటు కన్నా 4 శాతం అధిక ఐటీ ఎగుమతులను రాష్ట్రం సాధించిందని పేర్కొన్నారు. గత మూడేళ్లలో ఐటీ రంగంలో ప్రత్యక్ష ఉపాధి 3,23,396 నుంచి 4,31,891 మందికి పెరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ఐపాస్ విధానం ద్వారా ప్రపంచ ప్రసిద్ధ సంస్థలైన గూగుల్, యాపిల్, అమెజాన్, సేల్స్ ఫోర్స్ వంటి కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాయని వివరించారు. ఇన్నొవేషన్ రంగంలోనూ తెలంగాణ దూసుకుపోతోందన్నారు. దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ టీ–హబ్‌ను ఏర్పాటు చేశామన్నారు. టీ–హబ్‌ను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ గతేడాది స్వయంగా సందర్శించి, స్టార్టప్‌లపై ప్రశంసలు కురిపించారని గుర్తుచేశారు. తెలంగాణ యువతకు వృత్తి నైపుణ్యం అందించడానికి టాస్క్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. -
ఐటీఐఆర్ వెనక్కే..?
► మూడేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.. ► ఐటీఐఆర్ ప్రాజెక్టులో మార్పుచేర్పులకు కేంద్రం యోచన ► మౌలిక వసతుల కల్పనపై చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం ► తమ వాటా నిధుల విడుదలపై కేంద్రం మొండిచేయి ► సకాలంలో తొలిదశ పూర్తయ్యేందుకు ► సన్నగిల్లుతున్న అవకాశాలు... దీంతో పెట్టుబడులకు ముందుకురాని ప్రముఖ ఐటీ కంపెనీలు భాగ్యనగరం రూపురేఖలనే మార్చేసే భాగ్యరేఖ.. అంతర్జాతీయ స్థాయి కంపెనీల రాక.. రూ. రెండు లక్షల కోట్ల పెట్టుబడుల ప్రవాహం.. లక్షలాది కొలువుల ఆశాదీపం.. ఇదీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్)ప్రాజెక్టు గురించి ప్రభుత్వాలు చేసిన ప్రచారం. కానీ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టు ఇప్పుడు అటకెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. యూపీఏ ప్రభుత్వం 2013లో ఆర్భాటంగా ప్రకటించిన ఐటీఐఆర్ ప్రాజెక్టుకు సమూల మార్పులు చేయాలని తాజాగా కేంద్ర ప్రభుత్వం సంకల్పించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టు అమలు చేసే ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ఉద్దేశించిన రూ.3 వేల కోట్ల ఆర్థిక సహాయం అందజేసేందుకు కేంద్రం ససేమిరా అంటోందని సమాచారం. దీంతో 2013-18 మధ్యకాలంలో ఐటీఐఆర్ మొదటి దశను పూర్తిచేయాలన్న లక్ష్యం కాగితాలకే పరిమితమైంది. ఈ పరిణామాలతో సైబర్ సిటీగా పేరొందిన భాగ్యనగరం మరో సిలికాన్ వ్యాలీగా అవతరించే అవకాశాలను కోల్పోతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. మూడేళ్లుగా ఐటీఐఆర్‌కు కేంద్రం పైసా విదల్చకపోవడం.. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ రీజియన్ పరిధిలో వసతుల కల్పనపై చేతులెత్తేయడంతో విశ్వవ్యాప్తంగా పేరొందిన ప్రముఖ ఐటీ, హార్డ్‌వేర్ సంస్థలు ఇక్కడ ఆశించిన స్థారుులో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం లేదు. - సాక్షి, హైదరాబాద్ ఇదీ ప్రాజెక్టు స్వరూపం.. సుమారు 202 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఐదు క్లస్టర్లుగా ఏర్పాటు చేయాలనుకున్న ఐటీఐఆర్ పరిధిలో సైబరాబాద్, శంషాబాద్ ఎరుుర్‌పోర్టు, ఉప్పల్-పోచారం, సైబరాబాద్-ఎరుుర్‌పోర్ట్(గ్రోత్‌కారిడార్-1), ఎరుుర్‌పోర్ట్-ఉప్పల్ (గ్రోత్‌కారిడార్-2) ప్రాంతాలు ఉన్నారుు. మొదటి దశ ప్రాజెక్టును 2018 నాటికి పూర్తిచేయాలని సంకల్పించారు. ఈ ప్రాజెక్టుతో నగరానికి రూ. 2.18 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించవచ్చని ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థ ప్రైస్ వాటర్ కూపర్స్ అంచనా వేసింది. ఈ ప్రాజెక్టు పూర్తి కావడంతో సుమారు 25 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అప్పట్లో వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితి ఇదీ.. ఐటీఐఆర్ రీజియన్‌కు ఐటీ, హార్డ్‌వేర్ పరిశ్రమలు తరలిరావాలంటే రూ.13,093 కోట్ల అంచనా వ్యయంతో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయాలని 2013లోనే ప్రైస్ వాటర్ కూపర్స్ సంస్థ అంచనా వేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.3 వేల కోట్లు మిగతా రూ.10,093 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేయాలని నిర్దేశించింది. వసతుల కల్పనలో ప్రధానంగా తాగునీరు, మురుగు నీటిపారుదల, వాననీటి సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ, రహదారుల విస్తరణ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. ఈ ప్రతిపాదనలు వినడానికి బాగానే ఉన్నా.. మూడేళ్లుగా కార్యాచరణ మాత్రం మొదలుకాలేదు. కేంద్ర ప్రభుత్వం పైసా నిధులు విదల్చకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా చేపట్టాల్సిన పనులపై మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో ఈ ప్రాజెక్టుపై ముందడుగు పడడంలేదు. మౌలిక వసతులు లేకపోవడంతో ఐటీఐఆర్ రీజియన్ పరిధిలో పెట్టుబడులు పెట్టేందుకు విశ్వవ్యాప్తంగా పేరొందిన ప్రముఖ ఐటీ, హార్డ్‌వేర్ పరిశ్రమలు ముందుకు రావడం లేదని సమాచారం. పైగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులో మార్పుచేర్పులు చేయాలని యోచిస్తుండటంతో భాగ్యనగరం ఐటీఐఆర్ కల సాకారమయ్యే పరిస్థితులు కనిపించడంలేదు. మౌలిక వసతులు కల్పిస్తేనే.. కనీస మౌలిక వసతులు కల్పిస్తేనే ప్రముఖ అంతర్జాతీయ ఐటీ, హార్డ్‌వేర్ కంపెనీలు ఐటీఐఆర్ రీజియన్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయని సాంకేతిక రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వీటికి తోడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా కంపెనీలకు పలు అంశాల్లో రారుుతీలు, ప్రోత్సాహకాలు ప్రకటిస్తే వారు ముందుకొచ్చే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని వారు పేర్కొంటున్నారు. -
ఐదేళ్లలో నాలుగింతల వృద్ధి!
మహేశ్వరంలో పెరిగిన స్థిరాస్తి ధరలు సాక్షి, హైదరాబాద్: సరిగ్గా ఐదేళ్ల క్రితం ఆదిభట్ల, మహేశ్వరం ప్రాంతాల్లో గజం రూ.2 వేలుండేది. కానీ, ఇప్పుడు రూ.8 వేలకు పైగానే పలుకుతోంది. ఏరో స్పేస్ కంపెనీలు, ప్రతిపాదిత ఐటీఐఆర్ ప్రాజెక్టులే ఇందుకు కారణమంటున్నారు మెట్రో సిటీ డెవలపర్స్ చైర్మన్ కే మనోహర్‌రెడ్డి. మహేశ్వరం, ఆదిభట్ల ప్రాంతాల అభివృద్ధి గురించి ‘సాక్షి రియల్టీ’తో మాట్లాడారు. ఆయనేమన్నారంటే.. ► గతంలోనే ఆదిభట్లలో 250 ఎకరాల్లో వైమానిక సెజ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సెజ్‌లో టాటా సికోర్ స్కై, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్, టాటా లాక్హిడ్ మార్టిన్ సిస్టమ్, సముహా ఏరోస్పేస్ సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. వీటికి తోడు ఇక్కడి మొబైల్ హబ్‌లో పలు మొబైల్ కంపెనీలు ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాయి కూడా. ► మరోవైపు హైదరాబాద్ నగరం చుట్టూ మూడు క్లస్టర్లుగా ఐటీఐఆర్ ప్రాజెక్ట్ రానుంది. ఇందులో క్లస్టర్-3లో భాగంగా హైదరాబాద్ ఎయిర్‌పోర్టు డెవలప్మెంట్ అథారిటీలో ఆదిభట్ల, మహేశ్వరం, రావిరాల, మామిడిపల్లిలో 79.2 చ.కి.మీ. పరిధిలో ఐటీఐఆర్ విస్తరించి ఉంటుంది. అంతేకాకుండా ఔటర్ రింగ్‌రోడ్డు గ్రోత్ కారిడార్-1కు 11.5 చ.కి.మీ., కారిడార్-2కు 14.3 చ.కి.మీ. కేటాయించి శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బొంగ్లూరు ఔటర్ రింగ్‌రోడ్డు వరకు దీన్ని అనుసంధానం చేస్తారు. ► ఆదిభట్ల, మహేశ్వరంలోని ఐటీ, ఏరో స్పేస్ కంపెనీల్లో వేల సంఖ్యలో ఉద్యోగులున్నారు. ఈ ఏడాది ముగింపు నాటికి కొత్తగా మరో 30 వేల ఉద్యోగులు రానున్నట్లు సమాచారం. దీంతో ఆదిభట్ల, మహేశ్వరం చుట్టుపక్కల ప్రాంతాలు హైటెక్ సిటీని తలపించనున్నాయన్నమాట. ఆదిభట్ల ప్రాంతం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 10 కి.మీ., ఎల్బీనగర్కు 12 కి.మీ., ఔటర్ రింగ్ రోడ్డుకు 1.5 కి.మీ. దూరంలో ఉండటమూ మరింత కలిసొస్తుంది. ► ధరలు కూడా అందుబాటులో ఉండటం, మెరుగైన రవాణా, మౌలిక వసతులు పుష్కలంగా ఉండటంతో ఐటీ ఉద్యోగులు, పెట్టుబడిదారులు. ఎన్నారైలు ఈ ప్రాంతంలో స్థలాలు కొనేందుకు ఎగబాకుతున్నారు. దీంతో మంగల్‌పల్లి, కొంగర, రావిరాల, ఇంజాపూర్, గుర్రంగూడ వంటి ప్రాంతాల్లో రియల్ వ్యాపారం ఊపందుకుంది. ► ఇప్పటి వరకు ఓపెన్ ప్లాట్లు, ఇండిపెండెంట్ హౌజ్, విల్లాల నిర్మాణానికే పరిమితమైన మెట్రోసిటీ ఇన్ఫ్రా డెవలపర్స్ రానున్న రోజుల్లో ఆదిభట్లలో మల్టీప్లెక్స్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. బొంగ్లూరు ఓఆర్ఆర్ వద్ద 50 ఎకరాల్లో మెట్రోసిటీ ఇన్‌ఫ్రాటెక్‌ను ప్రారంభించాం. ధర గజానికి రూ.5,500. ► ఆదిభట్లలో 10 ఎకరాల్లో ఓపెన్ ప్లాట్లను వేశాం. ఇక్కడ ధర గజానికి రూ.9 వేలుగా నిర్ణయించాం. ఫార్మాసిటీకి దగ్గర్లో దాసర్లపల్లిలో మరో వెంచర్‌ను వేయనున్నాం. ఇందులో ధర గజానికి రూ.2 వేలుగా నిర్ణయించాం. -
ఐటీఐఆర్ పరుగు
ప్రాజెక్టు పరిధిలో వసతుల కల్పన దిశగా సర్కారు అడుగులు నాగార్జునసాగర్ జలాశయం నుంచి ప్రత్యేక నీటి కేటాయింపులు నేడు ఆయా విభాగాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష? సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ‘మహా’నగర రూపురేఖలను సమూలంగా మార్చనున్న ఐటీఐఆర్(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్) ప్రాజెక్టులో ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మౌలిక వసతుల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. విద్యుత్, మంచినీరు, మురుగునీటి పారుదల వ్యవస్థ, రహదారుల ఏర్పాటు వంటి వసతుల కల్పనపై ఆయా విభాగాల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సోమవారం సమీక్షాసమావేశంనిర్వహించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాజధానికి ఆనుకొని సుమారు 202 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఐదు క్లస్టర్లుగా ఏర్పడనున్న ఐటీఐఆర్ పరిధిలో సైబరాబాద్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ఉప్పల్-పోచారం, సైబరాబాద్-ఎయిర్పోర్ట్(గ్రోత్‌కారిడార్-1), ఎయిర్పోర్ట్-ఉప్పల్(గ్రోత్‌కారిడార్-2) ప్రాంతాలు ఉన్నాయి. ప్రాజెక్టు మొదటి దశను 2018 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఐటీఐఆర్ ద్వారా ఐటీ, హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్స్ అనుబంధ కంపెనీలు, పరిశ్రమల్లో సుమారు 14.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు అంచనా. 2013లో ప్రతిష్టాత్మక ప్రైస్ వాటర్ కూపర్స్ సంస్థ సుమారు రూ. 2.18 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా ఐటీఐఆర్‌కు రూపకల్పన చేసింది. ప్రాజెక్టు మౌలిక వసతులకు అవసరమైన నిధుల అంచనాలను కూడా నివేదికలో పొందుపరిచింది. తొలిదశ (2013-18 మధ్య)కు అత్యావశ్యకమైన మంచినీటి వసతుల కల్పనకు రూ.6,355 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. ఇందులో రాష్ట్రం రూ.5,084 కేటాయించాలని, మరో రూ.1,271 కోట్లను ప్రైవేటు రంగం నుంచి సేకరించాలని సూచించింది. మురుగు లెక్కలివీ.. ఐటీఐఆర్ మొదటిదశలో మురుగునీటి వ్యవస్థ నిర్వహణకు రూ.1,084 కోట్లు అవసరమవుతాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.867 కోట్లు వ్యయం చేయాలని, మరో రూ.217 కోట్లు ప్రైవేటు రంగం నుంచి సేకరించాలని నిర్దేశించింది. మరోవైపు ఐటీఐఆర్ పరిధిలో నెలకొల్పబోయే హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ సంస్థల వల్ల ఆయా ప్రాంతా ల్లో ఈ-వ్యర్థాలు భారీగా ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. దీంతో ఘన వ్యర్థాల నిర్వహణకు రూ.105 కోట్లను ప్రైవేటు రంగం నుంచి కేటాయించాలని పేర్కొంది. ఐటీఐఆర్ పరిధిలో వర్షపునీటి సంరక్షణకు రూ.156 కోట్లు వ్యయం అవుతాయని, ఈ నిధులను సైతం ప్రైవేటు రంగం నుంచి సేకరించాలని సూచించింది. తాజా సమావేశంలో ఈ అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వంద మిలియన్ గ్యాలన్లు కావాల్సిందే..! ఐటీఐఆర్ తొలి దశలో ఏర్పాటు కానున్న ఐటీ, హార్డ్‌వేర్ సంస్థల అవసరాలకు నిత్యం సుమారు వంద మిలియన్ గ్యాలన్ల జలాలు అవసరమవుతాయని జలమండలి అంచనా వేస్తోంది. ప్రస్తుతం నగరానికి రోజువారీగా సరఫరా చేస్తున్న 340 ఎంజీడీల జలాల్లో ఐటీఐఆర్‌కు ప్రత్యేకంగా నీటిని కేటాయించడం సాధ్యపడదని, త్వరలో పూర్తికానున్న కృష్ణా మూడోదశ, గోదావరి మంచినీటి పథకం ద్వారా వచ్చే జలాలు సైతం తాగునీటి అవసరాలకే సరిపోతాయని జలమండలి భావిస్తోంది. ఐటీఐఆర్ కోసం ప్రత్యేక మంచినీటి పథకానికి రూపకల్పన చేయాల్సిందేనని ప్రభుత్వానికి జలమండలి స్పష్టం చేయనుంది. ఈ రీజియన్‌కు నాగార్జున సాగర్ జలాశయం నుంచి ప్రత్యేకంగా పైప్‌లైన్ ద్వారా నీటిని తరలించే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని, అందుకు నిపుణుల కమిటీని నియమించాలని ప్రభుత్వాన్ని కోరనుందని సమాచారం. -
వచ్చే ఐదేళ్లలో ఐటీ రంగంలో ఏపీదే అగ్రస్థానం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ అభివృద్ధికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని ఆ శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో పల్లె రఘునాథ్‌రెడ్డి మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉన్న సమయంలో ఐటీ ఎగుమతులు రూ. 65 వేల కోట్లు ఉందని... రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నూతన ఆంధ్రప్రదేశ్‌లో రూ. 1700 కోట్లు ఉందని తెలిపారు. విశాఖలో ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు కొత్త కంపెనీలు ముందుకు వచ్చాయని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌దే అగ్రస్థానమవుతుందని పల్లె రఘునాథరెడ్డి వెల్లడించారు. -
‘మాస్టర్ ’కు మళ్లీ మార్పులు
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ విస్తరిత ప్రాంతానికి ప్రస్తుతం అమల్లో ఉన్న మాస్టర్ ప్లాన్ త్వరలో కొత్త రూపు సంతరించుకోనుంది. ఐటీఐఆర్ ప్రాజెక్టుకనుగుణంగా మాస్టర్ ప్లాన్‌ను సవరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈమేరకు మాస్టర్ ప్లాన్‌లో మళ్లీ మార్పులు చేసేందుకు హెచ్ఎండీఏ సన్నద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకునేందుకు వీలుగా ఐటీఐఆర్‌కు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించడంతో ఆ మేరకు కసరత్తు మొదలైంది. నగర పరిధిలో ఇప్పటికే ఉన్న ఏడు మాస్టర్ ప్లాన్లను ఒకే గొడుగు కిందకు తెస్తూ హెచ్ఎండీఏ రూపొందిం చిన బృహత్ ప్రణాళికను ఏడాది క్రితం ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. మరోమారు మార్పులకు శ్రీకారం చుట్టారు. వాస్తవానికి హెచ్ఎండీఏ యాక్టు ప్రకారం... మహా నగరంలో మరో అథార్టీ ఉండకూడదు. ఇప్పటికే హెచ్ఎండీఏ రూపొందించి అమలు చేస్తున్న విస్తరిత ప్రాంత మాస్టర్‌ప్లాన్‌లో ఐటీఐఆర్‌కు ప్రత్యేకంగా భూముల కేటాయింపు జరగలేదు. అదే ఇప్పుడు ఈ మెగా ప్రాజెక్టుకు ప్రతిబంధకంగా మారింది. ఐటీఐఆర్ ప్రాజెక్టుతో ‘మహా’ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని యోచిస్తోన్న ప్రభుత్వానికి మాస్టర్‌ప్లాన్ సవరణ ఇప్పుడు ఓ సవాల్‌గా మారింది. నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ గ్రోత్ కారిడార్ లోపల సుమారు 202 చ.కి.మీ. మేర 5 జోన్లలో ఐటీఐఆర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపుతుండటంతో మాస్టర్ ప్లాన్‌లో మార్పులు అనివార్యమయ్యాయి. ఫంక్షనల్ యూనిట్..: ఐటీఐఆర్ కు ప్రత్యేకంగా మాస్టర్‌ప్లాన్ రూపొందించాలంటే సాంకేతికంగా ఇబ్బందులతో కూడుకున్న అంశం. ఇది జరగాలంటే ప్రత్యేకంగా ఓ ఫంక్షనల్ యూనిట్‌ను ఏర్పాటు చేసి దానికింద ఐటీఐఆర్‌ను పెట్టవచ్చని హెచ్ ఎండీఏ అధికారుల పరిశీలనలో తేలింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేసి హెచ్ఎండీఏ పరిధిలోనే ఉంచాలని నిర్ణయించారు. ఈ కమిటీకి హెచ్ఎండీఏ కమిషనర్ చైర్మన్‌గా, ఐటీ సెక్రటరీ కన్వీనర్‌గా, ఫైనాన్స్, ఎంఏ అండ్ యూడీ, టీఎస్ఐఐసీ, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఇరిగేషన్, పీసీబీ, జీహెచ్ఎంసీ, జలమండలి విభాగాల ఉన్నతాధికారులను సభ్యులుగా ప్రతిపాదిస్తూ హెచ్ఎండీఏ ఇటీవల ప్రభుత్వానికి ఓ ప్రతిపాదన పంపింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే కొత్త కమిటీ ఏర్పాటవుతుందని అధికారులు చెబుతున్నారు. అనంతరం ఈ కమిటీ రంగంలోకి దిగి ఐటీఐఆర్ కింద ప్రాజెక్టులు ఎక్కడెక్కడ వస్తాయి? వాటి సరిహద్దులు, సర్వే నంబర్లు వంటివాటిని గుర్తించాల్సి ఉంటుంది. ఆమేరకు ప్రస్తుతం ఉన్న మాస్టర్‌ప్లాన్‌లో కొన్ని మార్పులు చేసి సవరించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ వేగవంతంగా జరగాలంటే ఫంక్షనల్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతి రావాలంటున్నారు. మార్పులు అనివార్యం..: హెచ్ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌లో ఐటీఐఆర్ కోసం ప్రత్యేకంగా భూ వినియోగాన్ని ప్రతిపాదించక పోవడం వల్లే ఇప్పుడు మార్పులు, సవరణలు అనివార్యమయ్యాయి. నివాస, వాణిజ్య, పబ్లిక్, సెమీ పబ్లిక్, మల్టీపుల్ జోన్లలో ఐటీఐఆర్‌కు అనుమతి ఉంది. నిజానికి ఇవి కాలుష్యరహితమైన సంస్థలు కాబట్టి అన్నింట్లో అనుమతిస్తామని హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. ఐటీఐఆర్‌కు అనుగుణంగా భూ వినియోగం ఉండాలి గనుక ప్రభుత్వ అనుమతితో ప్రణాళికలో మళ్లీ మార్పులు చేయాల్సి ఉంటుందంటున్నారు. ఇప్పటికే కేంద్రం ప్రకటించిన ఐటీఐఆర్ ప్రాజెక్టులు ఒక్క మహేశ్వరం మండలంలో తప్ప మిగతావన్నీ ఔటర్ రింగ్‌రోడ్డు లోపలే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో అవసరమైన మార్పులు చేయడం పెద్ద సమస్యేమీ కాదని, ప్రభుత్వ నుంచి అనుమతి వస్తే వెంటనే పని ప్రారంభించి మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేసేందుకు పక్కాగా ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నారు. -
ఐటీ జోష్..
* సాఫ్ట్వేర్ కంపెనీల విస్తృతికి బృహత్ ప్రణాళిక * ఐటీమయం కానున్న శివారు ప్రాంతాలు * నాగ్‌పూర్ రాజీవ్ రహదారి మార్గంలో ప్రత్యేక జోన్లు * ఐటీఐఆర్ ప్రాజెక్టుతో సర్కారుకు కాసుల పంట * రింగ్‌రోడ్డును కలుపుతూ 24 రేడియల్ రోడ్లు * కంపెనీలకు సింగిల్‌విండో పద్ధతిలో అనుమతులు! సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: నగర శివార్లలో ఐటీ కంపెనీల విస్తృతికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమైన సాఫ్ట్వేర్ ఆధారిత సంస్థలను మరిన్ని ప్రాంతాల్లో నెలకొల్పే దిశగా ఐటీ కారి డార్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాజధాని పరిసరాల్లో ఐటీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఐటీఐఆర్ ప్రాజెక్టును మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇబ్బడిముబ్బడిగా ఐటీ దిగ్గజాలు నగరానికి తరలివస్తారని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. ఈ ప్రాజెక్టు ముసాయిదాలో ప్రకటించిన హబ్‌లే కాకుండా మరికొన్ని ప్రాంతాలనుఐటీ కారిడార్లుగా మార్చే దిశగా కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రస్తుతం గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లోనే ఐటీ కంపెనీల కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అక్టోబర్‌లో ఆదిబట్లలో నిర్మిం చిన సొంత క్యాంపస్‌లోకి టాటా టెలీ సర్వీసెస్ (టీసీఎస్) సంస్థ మారనుంది. దేశంలోనే అతిపెద్ద ప్రాంగణంగా చెప్పుకుంటున్న ఈ సముదాయంలోకి ప్రస్తుతం జంటనగరాల్లో వివిధ చోట్ల కార్యకలాపాలు నిర్వహిస్తున్న టీసీఎస్ శాఖలు తరలిరానున్నాయి. తద్వారా సుమారు 25 వేల మంది ఉద్యోగులు ఇక్కడి నుంచి తమ విధులు నిర్వర్తించనున్నారు. అదే సమయంలో కాగ్నిజెంట్ కూడా త్వరలోనే ఆదిబట్లలో తమ క్యాంపస్ నిర్మాణానికి ముహుర్తం పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 800 ఎకరాల సేకరణ నూతన పారిశ్రామిక విధానానికి రూపకల్పన చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. మేడ్చల్, శామీర్‌పేట పరిసరాల్లో ఐటీ కారిడార్లను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఉత్తర తెలంగాణకు ముఖద్వారాలుగా పేర్కొనే రాజీవ్ రహదారి, నాగ్‌పూర్ హైవేలను కూడా పారిశ్రామిక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని సంకల్పించిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. ఈ ప్రాంతాలను సాఫ్ట్వేర్ సంస్థల స్థాపనకు అనువుగా తీర్చిదిద్దాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ క్రమంలో అధికారయంత్రాంగం రెండు చోట్ల కలిపి 800 ఎకరాలను గుర్తించే పనిలో నిమగ్నమైంది. జవహర్‌నగర్ ప్రాంతంలో ప్రభుత్వం భూమి ఇప్పటికే అందుబాటులో ఉండడం, మేడ్చల్‌లో 400 ఎకరాల సేకరణ పెద్ద కష్టం కాదని భావిస్తున్న అధికారులు.. ఆ దిశగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. 24 రేడియల్ రోడ్లు ఐటీ ఎగుమతులతో రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలుపుతుందని భావిస్తున్న ఐటీఐఆర్ ప్రాజెక్టుపై రాష్ట్ర సర్కారు ఎన్నో కలలు కంటోంది. రాష్ట్ర ఖజానాను కూడా ఇదే భర్తీ చేస్తుందని భావిస్తున్న ప్రభుత్వం.. ఐటీ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. ముఖ్యంగా పేరొందిన సాఫ్ట్వేర్ సంస్థలను ఇక్కడకు రప్పించడానికి చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఒరాకిల్ కంపెనీతో సంప్రదింపులు జరిపిన ప్రభుత్వం.. మరిన్ని సంస్థలను ఆకట్టుకునే దిశగా కార్యాచరణ రూపొందించింది. ఈ నేపథ్యంలో బడా సంస్థల రాకకు అనువైన వాతావరణాన్ని సృష్టించాలని, ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పన, భూకేటాయింపులు, రాయితీల విధానం, అనుమతుల జారీని సరళతరం చేయాలని నిర్ణయించింది. సింగిల్‌విండో పద్ధతిలో అనుమతులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత ఐటీఐఆర్ కారిడార్లకు రోడ్డు మార్గాలను విస్తరించాలని నిర్ణయించింది. ఔటర్ రింగ్‌రోడ్డు కిరువైపులా ఐటీఐఆర్ ప్రాజెక్టులను ప్రతిపాదించినందున.. రింగ్‌రోడ్డును అనుసంధానం చేసేలా 24 రేడియల్ రోడ్లు నిర్మించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు అతిత్వరలో రోడ్ల నిర్మాణం నిర్ణయం తీసుకునేదిశగా సన్నాహాలు చేస్తోంది. -
'సభ్య సమాజం తలదించుకునేలా హరీష్ వ్యవహరించారు'
అనంతపురం:విధి నిర్వహణలో ఉన్న ఓ కానిస్టేబుల్ ను టీఆర్ఎస్ నేత హరీష్ రావు దూషించడాన్ని పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఎమ్మెల్యే హోదాలో ఉన్న హరీష్ రావు సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించారని పోలీస్ అధికారుల సంఘం కార్యదర్శి గోరంట్ల మాధవ్ విమర్శించారు. కానిస్టేబుల్ పై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, దూషణలకు దిగిన హరీష్ రావును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేస్తామని హెచ్చరించారు. ఐటీఐఆర్ ప్రాజెక్టులో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గేమింగ్ సిటీ శంకుస్థాపనను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు హరీష్ రావు అక్కడకు వచ్చారు. అయితే వారిని పోలీసులు అరెస్టుచేసి అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఓ పోలీసుపై హరీష్ రావు ......నువ్వు ఆంధ్రోడివా... తెలంగాణ వాడివా..? అంటూ ప్రశ్నించారు. ఇంతలో తనను మీడియా గమనిస్తున్నట్లు తెలుసుకున్న హరీష్ రావు నోటికి తాళం వేశారు. పరుష పదజాలంతో చేసిన వ్యాఖ్యలపై పోలీసు వర్గాల్లో విమర్శలు చెలరేగుతున్నాయి.