సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఐటీఐఆర్ ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకూ అడగలేదని కేంద్రమంత్రి రవిప్రసాద్ పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించిన విషయాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గుర్తు చేశారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద భట్టి విక్రమార్కతో పాటు మంథని ఎమ్మెల్యే డి.శ్రీధర్‌బాబు, ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రాజెక్టుపై వాస్తవాలను ప్రజలకు తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం పక్కదోవ పట్టిస్తుందని, ఈ ప్రాజెక్టుతో 70 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని ఆయన తెలిపారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు తెలంగాణ హక్కు అని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రాజెక్టును ఎలాగైనా సాధించాలని సూచించారు. అంతేకాక తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్లో ఐటీఐఆర్ ప్రాజెక్టుతో 68 లక్షల మందికి లాభం చేకూరతుందని స్పష్టంగా ఉందని అన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఐటీఐఆర్ ప్రాజెక్టు సాధించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. స్పీకర్ కూడా అసెంబ్లీలో ఐటీఐఆర్ ప్రాజెక్ట్ విషయాన్ని చర్చించడానికి సమయం ఇవ్వలేదని, ప్రభుత్వ ఆలోచన విధానం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తే.. ప్రభుత్వాన్నీ గట్టిగా నిలదీస్తామని ఎమ్మెల్యే ఈ మేరకు హెచ్చరించారు.
ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల వల్లే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందని అన్నారు. గత ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న మంత్రులు ఇప్పుడు మాట మార్చి గతంలో ఏ అభివృద్ధి జరగలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నదని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment