మహేశ్వరంలో పెరిగిన స్థిరాస్తి ధరలు
సాక్షి, హైదరాబాద్: సరిగ్గా ఐదేళ్ల క్రితం ఆదిభట్ల, మహేశ్వరం ప్రాంతాల్లో గజం రూ.2 వేలుండేది. కానీ, ఇప్పుడు రూ.8 వేలకు పైగానే పలుకుతోంది. ఏరో స్పేస్ కంపెనీలు, ప్రతిపాదిత ఐటీఐఆర్ ప్రాజెక్టులే ఇందుకు కారణమంటున్నారు మెట్రో సిటీ డెవలపర్స్ చైర్మన్ కే మనోహర్‌రెడ్డి. మహేశ్వరం, ఆదిభట్ల ప్రాంతాల అభివృద్ధి గురించి ‘సాక్షి రియల్టీ’తో మాట్లాడారు. ఆయనేమన్నారంటే..
► గతంలోనే ఆదిభట్లలో 250 ఎకరాల్లో వైమానిక సెజ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సెజ్‌లో టాటా సికోర్ స్కై, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్, టాటా లాక్హిడ్ మార్టిన్ సిస్టమ్, సముహా ఏరోస్పేస్ సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. వీటికి తోడు ఇక్కడి మొబైల్ హబ్‌లో పలు మొబైల్ కంపెనీలు ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాయి కూడా.
► మరోవైపు హైదరాబాద్ నగరం చుట్టూ మూడు క్లస్టర్లుగా ఐటీఐఆర్ ప్రాజెక్ట్ రానుంది. ఇందులో క్లస్టర్-3లో భాగంగా హైదరాబాద్ ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్ అథారిటీలో ఆదిభట్ల, మహేశ్వరం, రావిరాల, మామిడిపల్లిలో 79.2 చ.కి.మీ. పరిధిలో ఐటీఐఆర్ విస్తరించి ఉంటుంది. అంతేకాకుండా ఔటర్ రింగ్‌రోడ్డు గ్రోత్ కారిడార్-1కు 11.5 చ.కి.మీ., కారిడార్-2కు 14.3 చ.కి.మీ. కేటాయించి శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బొంగ్లూరు ఔటర్ రింగ్‌రోడ్డు వరకు దీన్ని అనుసంధానం చేస్తారు.
► ఆదిభట్ల, మహేశ్వరంలోని ఐటీ, ఏరో స్పేస్ కంపెనీల్లో వేల సంఖ్యలో ఉద్యోగులున్నారు. ఈ ఏడాది ముగింపు నాటికి కొత్తగా మరో 30 వేల ఉద్యోగులు రానున్నట్లు సమాచారం. దీంతో ఆదిభట్ల, మహేశ్వరం చుట్టుపక్కల ప్రాంతాలు హైటెక్ సిటీని తలపించనున్నాయన్నమాట. ఆదిభట్ల ప్రాంతం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 10 కి.మీ., ఎల్బీనగర్‌కు 12 కి.మీ., ఔటర్ రింగ్ రోడ్డుకు 1.5 కి.మీ. దూరంలో ఉండటమూ మరింత కలిసొస్తుంది.
► ధరలు కూడా అందుబాటులో ఉండటం, మెరుగైన రవాణా, మౌలిక వసతులు పుష్కలంగా ఉండటంతో ఐటీ ఉద్యోగులు, పెట్టుబడిదారులు. ఎన్నారైలు ఈ ప్రాంతంలో స్థలాలు కొనేందుకు ఎగబాకుతున్నారు. దీంతో మంగల్‌పల్లి, కొంగర, రావిరాల, ఇంజాపూర్, గుర్రంగూడ వంటి ప్రాంతాల్లో రియల్ వ్యాపారం ఊపందుకుంది.
► ఇప్పటి వరకు ఓపెన్ ప్లాట్లు, ఇండిపెండెంట్ హౌజ్, విల్లాల నిర్మాణానికే పరిమితమైన మెట్రోసిటీ ఇన్‌ఫ్రా డెవలపర్స్ రానున్న రోజుల్లో ఆదిభట్లలో మల్టీప్లెక్స్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. బొంగ్లూరు ఓఆర్‌ఆర్ వద్ద 50 ఎకరాల్లో మెట్రోసిటీ ఇన్‌ఫ్రాటెక్‌ను ప్రారంభించాం. ధర గజానికి రూ.5,500.
► ఆదిభట్లలో 10 ఎకరాల్లో ఓపెన్ ప్లాట్లను వేశాం. ఇక్కడ ధర గజానికి రూ.9 వేలుగా నిర్ణయించాం. ఫార్మాసిటీకి దగ్గర్లో దాసర్లపల్లిలో మరో వెంచర్‌ను వేయనున్నాం. ఇందులో ధర గజానికి రూ.2 వేలుగా నిర్ణయించాం.
ఐదేళ్లలో నాలుగింతల వృద్ధి!
Published Fri, Jun 12 2015 11:51 PM | Last Updated on Sun, Sep 3 2017 3:38 AM
Advertisement
Advertisement