ఐటీఐఆర్ వెనక్కే..?
► మూడేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..
► ఐటీఐఆర్ ప్రాజెక్టులో మార్పుచేర్పులకు కేంద్రం యోచన
► మౌలిక వసతుల కల్పనపై చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం
► తమ వాటా నిధుల విడుదలపై కేంద్రం మొండిచేయి
► సకాలంలో తొలిదశ పూర్తయ్యేందుకు
► సన్నగిల్లుతున్న అవకాశాలు... దీంతో పెట్టుబడులకు ముందుకురాని ప్రముఖ ఐటీ కంపెనీలు
భాగ్యనగరం రూపురేఖలనే మార్చేసే భాగ్యరేఖ.. అంతర్జాతీయ స్థాయి కంపెనీల రాక.. రూ. రెండు లక్షల కోట్ల పెట్టుబడుల ప్రవాహం.. లక్షలాది కొలువుల ఆశాదీపం.. ఇదీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ఐటీఐఆర్)ప్రాజెక్టు గురించి ప్రభుత్వాలు చేసిన ప్రచారం. కానీ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టు ఇప్పుడు అటకెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. యూపీఏ ప్రభుత్వం 2013లో ఆర్భాటంగా ప్రకటించిన ఐటీఐఆర్ ప్రాజెక్టుకు సమూల మార్పులు చేయాలని తాజాగా కేంద్ర ప్రభుత్వం సంకల్పించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టు అమలు చేసే ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ఉద్దేశించిన రూ.3 వేల కోట్ల ఆర్థిక సహాయం అందజేసేందుకు కేంద్రం ససేమిరా అంటోందని సమాచారం.
దీంతో 2013-18 మధ్యకాలంలో ఐటీఐఆర్ మొదటి దశను పూర్తిచేయాలన్న లక్ష్యం కాగితాలకే పరిమితమైంది. ఈ పరిణామాలతో సైబర్ సిటీగా పేరొందిన భాగ్యనగరం మరో సిలికాన్ వ్యాలీగా అవతరించే అవకాశాలను కోల్పోతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. మూడేళ్లుగా ఐటీఐఆర్‌కు కేంద్రం పైసా విదల్చకపోవడం.. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ రీజియన్ పరిధిలో వసతుల కల్పనపై చేతులెత్తేయడంతో విశ్వవ్యాప్తంగా పేరొందిన ప్రముఖ ఐటీ, హార్డ్‌వేర్ సంస్థలు ఇక్కడ ఆశించిన స్థారుులో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం లేదు. - సాక్షి, హైదరాబాద్
ఇదీ ప్రాజెక్టు స్వరూపం..
సుమారు 202 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఐదు క్లస్టర్లుగా ఏర్పాటు చేయాలనుకున్న ఐటీఐఆర్ పరిధిలో సైబరాబాద్, శంషాబాద్ ఎరుుర్‌పోర్టు, ఉప్పల్-పోచారం, సైబరాబాద్-ఎరుుర్‌పోర్ట్(గ్రోత్‌కారిడార్-1), ఎరుుర్‌పోర్ట్-ఉప్పల్ (గ్రోత్‌కారిడార్-2) ప్రాంతాలు ఉన్నారుు. మొదటి దశ ప్రాజెక్టును 2018 నాటికి పూర్తిచేయాలని సంకల్పించారు. ఈ ప్రాజెక్టుతో నగరానికి రూ. 2.18 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించవచ్చని ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థ ప్రైస్ వాటర్ కూపర్స్ అంచనా వేసింది. ఈ ప్రాజెక్టు పూర్తి కావడంతో సుమారు 25 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అప్పట్లో వెల్లడించింది.
ప్రస్తుత పరిస్థితి ఇదీ..
ఐటీఐఆర్ రీజియన్‌కు ఐటీ, హార్డ్‌వేర్ పరిశ్రమలు తరలిరావాలంటే రూ.13,093 కోట్ల అంచనా వ్యయంతో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయాలని 2013లోనే ప్రైస్ వాటర్ కూపర్స్ సంస్థ అంచనా వేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.3 వేల కోట్లు మిగతా రూ.10,093 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేయాలని నిర్దేశించింది. వసతుల కల్పనలో ప్రధానంగా తాగునీరు, మురుగు నీటిపారుదల, వాననీటి సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ, రహదారుల విస్తరణ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. ఈ ప్రతిపాదనలు వినడానికి బాగానే ఉన్నా.. మూడేళ్లుగా కార్యాచరణ మాత్రం మొదలుకాలేదు.
కేంద్ర ప్రభుత్వం పైసా నిధులు విదల్చకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా చేపట్టాల్సిన పనులపై మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో ఈ ప్రాజెక్టుపై ముందడుగు పడడంలేదు. మౌలిక వసతులు లేకపోవడంతో ఐటీఐఆర్ రీజియన్ పరిధిలో పెట్టుబడులు పెట్టేందుకు విశ్వవ్యాప్తంగా పేరొందిన ప్రముఖ ఐటీ, హార్డ్‌వేర్ పరిశ్రమలు ముందుకు రావడం లేదని సమాచారం. పైగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులో మార్పుచేర్పులు చేయాలని యోచిస్తుండటంతో భాగ్యనగరం ఐటీఐఆర్ కల సాకారమయ్యే పరిస్థితులు కనిపించడంలేదు.
మౌలిక వసతులు కల్పిస్తేనే..
కనీస మౌలిక వసతులు కల్పిస్తేనే ప్రముఖ అంతర్జాతీయ ఐటీ, హార్డ్‌వేర్ కంపెనీలు ఐటీఐఆర్ రీజియన్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయని సాంకేతిక రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వీటికి తోడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా కంపెనీలకు పలు అంశాల్లో రారుుతీలు, ప్రోత్సాహకాలు ప్రకటిస్తే వారు ముందుకొచ్చే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని వారు పేర్కొంటున్నారు.