ఐటీఐఆర్ పరుగు
- ప్రాజెక్టు పరిధిలో వసతుల కల్పన దిశగా సర్కారు అడుగులు
- నాగార్జునసాగర్ జలాశయం నుంచి ప్రత్యేక నీటి కేటాయింపులు
- నేడు ఆయా విభాగాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ‘మహా’నగర రూపురేఖలను సమూలంగా మార్చనున్న ఐటీఐఆర్(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్) ప్రాజెక్టులో ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మౌలిక వసతుల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. విద్యుత్, మంచినీరు, మురుగునీటి పారుదల వ్యవస్థ, రహదారుల ఏర్పాటు వంటి వసతుల కల్పనపై ఆయా విభాగాల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సోమవారం సమీక్షాసమావేశంనిర్వహించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
రాజధానికి ఆనుకొని సుమారు 202 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఐదు క్లస్టర్లుగా ఏర్పడనున్న ఐటీఐఆర్ పరిధిలో సైబరాబాద్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ఉప్పల్-పోచారం, సైబరాబాద్-ఎయిర్‌పోర్ట్(గ్రోత్‌కారిడార్-1), ఎయిర్‌పోర్ట్-ఉప్పల్(గ్రోత్‌కారిడార్-2) ప్రాంతాలు ఉన్నాయి. ప్రాజెక్టు మొదటి దశను 2018 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఐటీఐఆర్ ద్వారా ఐటీ, హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్స్ అనుబంధ కంపెనీలు, పరిశ్రమల్లో సుమారు 14.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు అంచనా. 2013లో ప్రతిష్టాత్మక ప్రైస్ వాటర్ కూపర్స్ సంస్థ సుమారు రూ. 2.18 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా ఐటీఐఆర్‌కు రూపకల్పన చేసింది. ప్రాజెక్టు మౌలిక వసతులకు అవసరమైన నిధుల అంచనాలను కూడా నివేదికలో పొందుపరిచింది. తొలిదశ (2013-18 మధ్య)కు అత్యావశ్యకమైన మంచినీటి వసతుల కల్పనకు రూ.6,355 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. ఇందులో రాష్ట్రం రూ.5,084 కేటాయించాలని, మరో రూ.1,271 కోట్లను ప్రైవేటు రంగం నుంచి సేకరించాలని సూచించింది.
మురుగు లెక్కలివీ..
ఐటీఐఆర్ మొదటిదశలో మురుగునీటి వ్యవస్థ నిర్వహణకు రూ.1,084 కోట్లు అవసరమవుతాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.867 కోట్లు వ్యయం చేయాలని, మరో రూ.217 కోట్లు ప్రైవేటు రంగం నుంచి సేకరించాలని నిర్దేశించింది. మరోవైపు ఐటీఐఆర్ పరిధిలో నెలకొల్పబోయే హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ సంస్థల వల్ల ఆయా ప్రాంతా ల్లో ఈ-వ్యర్థాలు భారీగా ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. దీంతో ఘన వ్యర్థాల నిర్వహణకు రూ.105 కోట్లను ప్రైవేటు రంగం నుంచి కేటాయించాలని పేర్కొంది. ఐటీఐఆర్ పరిధిలో వర్షపునీటి సంరక్షణకు రూ.156 కోట్లు వ్యయం అవుతాయని, ఈ నిధులను సైతం ప్రైవేటు రంగం నుంచి సేకరించాలని సూచించింది. తాజా సమావేశంలో ఈ అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
వంద మిలియన్ గ్యాలన్లు కావాల్సిందే..!
ఐటీఐఆర్ తొలి దశలో ఏర్పాటు కానున్న ఐటీ, హార్డ్‌వేర్ సంస్థల అవసరాలకు నిత్యం సుమారు వంద మిలియన్ గ్యాలన్ల జలాలు అవసరమవుతాయని జలమండలి అంచనా వేస్తోంది. ప్రస్తుతం నగరానికి రోజువారీగా సరఫరా చేస్తున్న 340 ఎంజీడీల జలాల్లో ఐటీఐఆర్‌కు ప్రత్యేకంగా నీటిని కేటాయించడం సాధ్యపడదని, త్వరలో పూర్తికానున్న కృష్ణా మూడోదశ, గోదావరి మంచినీటి పథకం ద్వారా వచ్చే జలాలు సైతం తాగునీటి అవసరాలకే సరిపోతాయని జలమండలి భావిస్తోంది. ఐటీఐఆర్ కోసం ప్రత్యేక మంచినీటి పథకానికి రూపకల్పన చేయాల్సిందేనని ప్రభుత్వానికి జలమండలి స్పష్టం చేయనుంది. ఈ రీజియన్‌కు నాగార్జున సాగర్ జలాశయం నుంచి ప్రత్యేకంగా పైప్‌లైన్ ద్వారా నీటిని తరలించే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని, అందుకు నిపుణుల కమిటీని నియమించాలని ప్రభుత్వాన్ని కోరనుందని సమాచారం.