పాతబస్తీకి ‘కొత్త’ కళ..
కొత్తనగరంతో సమానంగా పాతబస్తీ అభివృద్ధి
- అందుకు అనుగుణంగా నిధులు కేటాయిస్తాం
- మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్
- రూ.4 వేల కోట్లతో మూసీ సుందరీకరణ
- ఎంఐఎం మాకు ఫ్రెండ్లీ పార్టీ
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ అభివృద్ధిలో భాగంగా కొత్త నగరంతో సమానంగా పాతబస్తీకీ తగిన నిధులు కేటాయించి, అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామని మున్సిపల్ మంత్రి కె.తారకరామారావు స్పష్టంచేశారు. పాతబస్తీ అభివృద్ధికి చిత్తశుద్ధి, నిబద్ధతతో పనిచేస్తున్నామన్నారు. రాబోయే మూడు నెలల్లో రూ.27 కోట్ల వ్యయంతో నగరంలోని 16 ప్రాంతాల్లో కమ్యూనిటీ హాళ్లను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. మంగళవారం ఫిల్మ్‌నగర్‌లో కమ్యూనిటీ హాల్‌తోపాటు పాతబస్తీలోని మొఘల్‌పురా స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఫరూఖ్‌నగర్ బస్ డిపో–బస్ టెర్మినల్ కాంప్లెక్స్, మైలార్‌దేవ్‌పల్లి ప్లేగ్రౌండ్, ప్రేమావతి పేటలో మోడల్ మార్కెట్, రాజేంద్రనగర్ సర్కిల్‌లో చింతకుంట పార్క్, ఆరాంఘర్ చౌరస్తా వద్ద ఏసీ టాయిలెట్స్‌ను డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో కలసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. చార్మినార్ కాలి బాట పథకాన్ని 3 నెలల్లో పూర్తి చేయనున్నట్లు చెప్పారు. మూసీ సుందరీకరణ కోసం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైందని, సబర్మతీ తరహాలో మూసీ సుందరీకరణను ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు.
సంక్షేమానికి ప్రాధాన్యం..
స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా సీఎం కేసీఆర్.. పారిశుధ్య కార్యక్రమాలే కాక పేదలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారని కేటీఆర్ చెప్పారు. పేద బాలింతలకు ఉపకరించే ‘అమ్మఒడి’కార్యక్రమాన్ని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న ప్రారంభిస్తామన్నారు. అన్ని నియోజకవర్గాల్లో‡సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఫారూక్‌నగర్‌లో రూ.1.5 కోట్లతో నిర్మించనున్న ఎస్సీ, ఎస్టీ, బీసీల వసతి గృహ భవన నిర్మాణ పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమాల్లో శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
నగరానికి ఐకాన్‌గా ఫలక్‌నుమా
జీహెచ్‌ఎంసీ రూ.5 వేల కోట్లు అప్పు తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, ఇందులో రూ.4 వేల కోట్లు దీనికి ఖర్చు చేస్తామన్నారు. తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్ నగరానికి ఒక ప్రత్యేకమైన ఐకాన్‌గా మారిందని, ఈ ప్రాంతంలోని ఫలక్‌నుమా రైల్వే బ్రిడ్జి విస్తరణకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రూ.27 కోట్ల జీహెచ్‌ఎంసీ నిధులతో అదనపు బ్రిడ్జిని నిర్మిస్తామన్నారు. మహబూబ్ చౌక్‌లో క్లాక్ టవర్ మరమ్మతులకు రూ.5 కోట్లను వారం రోజుల్లో విడుదల చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
ఫలక్‌నుమా పీటీవో ప్రాంతంలోని 10 ఎకరాల పోలీస్ స్థలానికి సంబంధించి హోం మంత్రితో మాట్లాడి అభ్యంతరాలు లేకుంటే ఆ స్థలాన్ని రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణానికి కేటాయిస్తామని కేటీఆర్ చెప్పారు. ఎంఐఎం తమకు ఫ్రెండ్లీ పార్టీ అని, అసెంబ్లీతో పాటు బయట కూడా తమకు సహకారంగా ఉంటుందన్నారు. పాతబస్తీలో తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి తీరతామన్నారు.