కరెంటు బకాయిల చెల్లింపులకు పాత నోట్లు
హైదరాబాద్: కరెంటు బకాయిల చెల్లింపులకు పాత రూ.500, రూ.1000 నోట్లు తీసుకోవాలని చేసిన విజ్ఞప్తికి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి సానుకూలంగా స్పందించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. గురువారం ఉదయం కేటీఆర్ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో ఢిల్లీలో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... కరెంటు చార్జీల చెల్లింపులకు పాత నోట్లను అంగీకరించేలా చర్యలు తీసుకోవాలని కోరానన్నారు. ఫలితంగా మొండి బకాయిలు వసూలు అవటంతోపాటు దేశవ్యాప్తంగా వినియోగదారుల ఇబ్బందులు తగ్గుతాయన్నారు. కేటీఆర్ సూచనలకు సానుకూలంగా స్పందించిన ఆర్థికమంత్రి జైట్లీ కేంద్ర విద్యుత్ శాఖాధికారులతో మాట్లాడారు. గురువారం సాయంత్రమే విద్యుత్ శాఖ కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ పాత నోట్లను స్వీకరిస్తామని ప్రకటన చేశారు. ఈనెల11వరకు విద్యుత్ బకాయిల చెల్లింపులకు పాతనోట్లు చెల్లుబాటవుతాయని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రి సత్వర నిర్ణయానికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.