‘ఏరోస్పేస్’లో యువతకు శిక్షణ
సుముఖత వ్యక్తం చేసిన బోయింగ్ ఇంటర్నేషనల్
అమెరికా పర్యటనలో మంత్రి కేటీఆర్ బిజీబిజీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యార్థులు, యువతకు ఏరోస్పేస్ రంగంలో శిక్షణ ఇచ్చేందుకు బోయింగ్ ఇంటర్నేషనల్ సంస్థ సుముఖత వ్యక్తం చేసింది. పెట్టుబడుల సమీకరణలో భాగంగా రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా తొలిరోజు వాషింగ్టన్‌లో పలువురు పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశమయ్యారు. బోయింగ్ ఇంటర్నేషనల్ సంస్థ అధ్యక్షుడు బెర్ట్రాండ్ మార్క్ మాట్లాడుతూ ఏరోస్పేస్ రంగంలో శిక్షణ, నైపుణ్యాభివృద్ధికి తమ సంస్థ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనుందన్నారు.
ఫార్మారంగ పెట్టుబడులపై దృష్టి సారించిన కేటీఆర్.. అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ(యూఎస్‌ఈపీ ఏ)ప్రతినిధుల బృందంతో భేటి అయ్యారు. కాలుష్యాన్ని తగ్గించి, అంతర్జాతీయ పర్యావరణ ప్రమాణాలతో కంపెనీల స్థాపనపై చర్చించారు. నగరంలో ఉన్న ఫార్మా కంపెనీలను ఔటర్ రింగ్‌రోడ్డు బయటకు తరలించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాల రూపకల్పనకు సహకరించేందుకు యూఎస్‌ఈపీఏ ముందుకు వచ్చింది.
అనంతరం అమెరికాలోని ప్రముఖ ఫార్మా కంపెనీలైన ఫైజర్, ఎలీ లిల్లీ, అలెక్సియన్, ఆమ్జెన్ సంస్థలు పాల్గొన్న ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ అండ్ మాన్యుఫ్యాక్చర్ ఆఫ్ అమెరికా సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రారిశ్రామిక విధానాన్ని, ఫార్మాసిటీ అంశాన్ని సమావేశంలో వివరించారు. ఆ తర్వాత క్లీవ్‌లాండ్ మోటర్ సైకిల్ వర్క్ కంపెనీ సీఈఓ జోనాథన్‌తో ఆయన సమావేశమయ్యారు.
రాష్ట్రంలో సంస్థ తయారీ విభాగాన్ని నెలకొల్పాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్‌లో కమ్యూనిక్లిక్ సంస్థ విభాగాన్ని ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి రాంరెడ్డి మంత్రికి వివరించారు. గ్లోబల్ ఎంటర్పెన్యుయర్‌షిప్ సమిట్-2017 నిర్వాహకురాలితోనూ కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన వివరించారు. మంత్రి కేటీఆర్ వెంట ఇంధన, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అరవింద్‌కుమార్ ఉన్నారు.