కాల్పుల ఘటనపై కేంద్రం నిరసన తెలపాలి
కూచిభొట్ల శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో జరిగిన కాల్పుల ఘటనకు నిరసనగా కేంద్రం అమెరికాపై ఒత్తిడి తీసుకురావాలని, అవసరమైతే ప్రత్యక్ష నిరసనకు దిగాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. అమెరికాలో దుండగుడి కాల్పుల్లో మరణించిన కూచిభొట్ల శ్రీనివాస్ తల్లిదండ్రులను శనివారం మల్లం పేటలోని వారి నివాసంలో కేటీఆర్ పరామర్శించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ట్రంప్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. అమెరికాలో ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. శ్రీనివాస్ మృతదేహం సోమవారం రాత్రికి ఎయిర్ ఇండియా విమానంలో హైదరాబాద్‌కు చేరుకుంటుందని, అందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, ఎమ్మెల్యే వివేకానంద, టీఆర్‌ఎస్ జీహెచ్‌ఎంసీ ఇంచార్జి మైనంపల్లి హన్మంతరావు మంత్రి వెంట ఉన్నారు. శ్రీనివాస్ భార్య సునయన అమెరికాలో మీడియాతో మాట్లాడిన వీడియోను కేటీఆర్ ఫోన్‌లో వీక్షించారు.
అత్తామామల ఇంట విషాద ఛాయలు
శ్రీనివాస్ మృతితో చైతన్యపురిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన భార్య సునయన తల్లిదండ్రులు బాలకృష్ణ, వరలక్ష్మి దంపతులు చైతన్యపురి హనుమాన్‌నగర్‌లో నివసిస్తున్నారు. సిరిసిల్లకు చెందిన బాలకృష్ణ బీడీఎల్‌లో డీజీఎంగా రిటైర్ అయి చైతన్య పురిలో స్థిరపడ్డారు. సునయన తొమ్మిదేళ్ల కింద ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి ఉద్యోగం చేస్తోంది. ఆమెకు నాలుగేళ్ల కింద శ్రీనివాస్‌తో వివాహమైంది.
రెచ్చగొట్టడం వల్లే ఘటనలు: సుధీర్‌రెడ్డి
ఇదే ఘటనలో గాయపడిన అలోక్‌రెడ్డి కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పరామర్శించారు. ఘటన వివరాలను అలోక్ తల్లి రేణుకను అడిగి తెలుసుకున్నారు. ట్రంప్, సీఎం కేసీఆర్‌లు రాజకీయ లబ్ధి కోసం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ప్రాంతీయ తత్వాన్ని రెచ్చ గొట్టడం వల్లే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుం టున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
‘కాల్పుల’ దోషులను శిక్షించాలి
జాత్యాహంకారంతో అమె రికాలో తెలుగు వారిపై కాల్పులు జరిపి న ఉదంతంలో దోషులను కఠినంగా శిక్షించేలా కేంద్రం ఒత్తిడి తేవాలని అఖిల భారత శాంతి సంఘీభావ సంస్థ పేర్కొంది. అఖిలపక్ష నాయకులతో కలసి హైదరాబాద్ బేగంపేటలోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం వద్ద శనివారం నిరసనకు దిగారు. అయితే వీరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అమెరికా జాత్యాహంకార తీరుపై పలువురు మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, కాంగ్రెస్ నేత వినోద్ రెడ్డి, సీపీఎం నేత రఘుపాల్, సీపీఐ నాయకుడు సుధాకర్, అఖిల భారత శాంతి సంఘీభావ సంస్థ ఉపాధ్యక్షురాలు రేఖ, కార్యదర్శి టీఎన్ మూర్తి, ప్రతినిధులు శ్రీనివాస్, సలీంఖాన్ తదితరులు ఆందోళనకు దిగి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ట్రంప్ అధికారంలోకి వచ్చాక జాత్యాంహకార దాడులు పెరిగిపోయాయని విమర్శించారు. అక్కడి తెలుగు వారిపై తరచూ దాడులు జరుగుతున్నాయని, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు వెళ్లిపోవాలని హుకుం జారీ చేయడంతో అక్కడి భారతీయుల్లో భయాందోళనలు నెలకొన్నాయని చెప్పారు. ట్రంప్ విధానాలే ఇక్కడ దౌత్య అధికారి కూడా అమలుచేస్తున్నట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. నిరసన అనంతరం బేగంపేట ఇన్‌స్పెక్టర్ జగన్‌కు వినతిపత్రం అందజేసి దౌత్యాధికారులకు చేర్చాలని విజ్ఞప్తి చేశారు. నిరసన నేపథ్యంలో అమెరికా దౌత్య కార్యాలయానికి పోలీసులు భారీ బందోబస్తుతో పాటు బారీకేడ్లు ఏర్పాటుచేశారు.