సోమవారం స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ నగరంలో తెలంగాణ ఎన్నారైలు ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సాధించిన అద్భుత ప్రగతిని దశదిశలా చాటేందుకు ఎన్నారైలు ముందుకు రావాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రవాస భారతీయులు రాష్ట్రానికి గుడ్ విల్ అంబాసిడర్‌గా, బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండాలని కోరారు. రాష్ట్రాన్ని ఇతర దేశాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు పరిచయం చేసేందుకు, ఆసక్తిగల పారిశ్రామికవేత్తలను తెలంగాణ ప్రభుత్వంతో అనుసంధానం చేయడానికి ఎన్నారైలు కలసి రావాలన్నారు. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ నగరంలో సోమవారం తెలంగాణ ఎన్నారైలు ఏర్పాటు చేసిన ముఖాముఖీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు, విధానాలు, వాటి అమలు తీరుతో పాటు రాష్ట్ర రాజకీయాలపై ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు.
రాష్ట్రం ఆవిర్భావం నాటి అయోమయ పరిస్థితి నుంచి ప్రభుత్వం అద్భుత ప్రగతి దిశగా రాష్ట్రాన్ని తీసుకుపోతోందని కేటీఆర్ అన్నారు. దశాబ్దంన్నర క్రితం ఏర్పాటైన రాష్ట్రాలు కూడా ఇంకా పూర్తిగా కుదురుకోని పరిస్థితుల్లో ఉంటే తెలంగాణ రాష్ట్రం మాత్రం మూడున్నర ఏళ్లలోనే అనేక రంగాల్లో దేశానికి ఆదర్శవంతమైన విధానాలతో ముందుకు పోతోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో బంగారు తెలంగాణను సాధిస్తామని ఉద్ఘాటించారు. రాష్ట్రం ఏర్పాటును వ్యతిరేకించిన వారే ప్రస్తుతం అభినందించే పరిస్థితి ఏర్పడిందన్నారు. తెలంగాణ వచ్చాక ప్రజలకి పవర్ కష్టాలు తొలగిపోతే కాంగ్రెస్ పార్టీకి మాత్రం పవర్ పోయిందన్నారు. కేవలం రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ మొత్తం కాంగ్రెస్ పవర్ పోతోందని, అందుకే రైతాంగానికి ఇస్తున్న 24 గంటల కరెంట్ సరఫరాను సైతం రాజకీయం చేస్తోందని విమర్శించారు.
ఎన్నారైలు ఇక ధైర్యంగా భూములు కొనవచ్చు..
తెలంగాణ ప్రభుత్వం ప్రజల కనీస అవసరాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. తాగునీరు, సాగునీరు సదుపాయం కల్పనలకే ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యధిక ప్రాదాన్యత ఇస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌లో ప్రజల కనీస అవసరాలైన రోడ్లు, ఫుట్‌పాత్‌లు, తాగునీటి సరఫరా వంటి ప్రాథమిక అంశాలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిపారు. చెరువుల ప్రక్షాళన, హైదరాబాద్‌లో మెరుగుపడిన శాంతి భద్రతలు, వాతావరణ కాలుష్యం, క్రీడల అభివృద్ధి తదితర అంశాలపై ఎన్నారైలు లేవనెత్తిన ప్రశ్నలకు కేటీఆర్ బదులిచ్చారు. ఎన్నారైలు తెలంగాణలో భూము లు కొనా లంటే ఇక ధైర్యంగా కొనవచ్చని, భూ రికార్డుల ప్రక్షాళన చేసి అన్నీ ఆన్‌లైన్‌లోకి తెస్తున్నామన్నారు. ఈ సమావేశాన్ని జ్యూరిక్‌లో నివాసముంటున్న తెలంగాణ ఎన్నారైలు శ్రీధర్ గండె, అల్లు కృష్ణారెడ్డి, అనిల్ జాలా, కిశోర్ తాటికొండ ఏర్పాటు చేశారు. సమావేశానికి నగర మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు స్వీడన్, జర్మనీ, యూకే, స్విట్జర్లాండ్ దేశాల్లోని తెలుగువారు హాజరయ్యారు.
స్విట్జర్లాండ్‌లో టీఆర్‌ఎస్ శాఖ..
స్విట్జర్లాండ్ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో పలువురు ఎన్నారైలు టీఆర్‌ఎస్‌లో చేరారు. జ్యూరిక్‌లో జరిగిన పార్టీ ఆవిర్భావ సమావేశంలో మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్‌ఎస్ ఇప్పటికే దేశ విదేశాల్లో పార్టీ శాఖలను కలిగి ఉందని, తాజాగా స్విట్జర్లాండ్ పార్టీ శాఖను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర అభివృద్ధి, ప్రపంచం నలుమూలలా ఉన్న తెలంగాణ వారందరికీ చేరేందుకు దోహదం చేస్తుందని కేటీఆర్ అన్నారు. వివిధ దేశాల్లో టీఆర్‌ఎస్ పార్టీ శాఖల ఏర్పాటుకు ప్రత్యేక చొరవ చూపిస్తున్న టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నారై సమన్వయకర్త మహేశ్ బిగాల స్విట్జర్లాండ్ పార్టీ శాఖను ఏర్పాటు చేశారు. పది మందితో అడహక్ కమిటీని ఏర్పాటు చేశారు. త్వరలోనే పూర్తి స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని మహేశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment