
వైఎస్ జగన్ ప్రసంగానికి మంత్రుల ఆటంకం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో మూడో రోజు బుధవారం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు మంత్రులు అడ్డుతగిలారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చలో వైఎస్ జగన్.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాజధానికి భూసేకరణ, ప్రాజెక్టులు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, హామీల అమలులో ముఖ్యమంత్రి చంద్రబాబు వైఫల్యం సహా పలు అంశాల గురించి మాట్లాడారు.
వైఎస్ జగన్ తన ప్రసంగాన్ని పూర్తిచేయకుముందే మంత్రులు మధ్యమధ్యలో జోక్యం చేసుకుని అంతరాయం కలిగించారు. మొదట పల్లె రఘునాథ్ రెడ్డి, తర్వాత అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడారు. విమర్శలు చేస్తూ ఎదురుదాడికి దిగారు. ప్రతి 5 నిమిషాలకోసారి తన ప్రసంగాన్ని ఆపడం ఆన్యాయమని, తాను మాట్లాడేది పూర్తయిన తర్వాత వాళ్లు మాట్లాడవచ్చని వైఎస్ జగన్ అన్నారు. ఆయన సంయమనంతో వ్యవహరిస్తూ చర్చలో మాట్లాడారు.