
ఇక్కడ బీద ఏడుపులు.. అక్కడ పొగడ్తలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీద ఏడుపులు ఏడుస్తూ.. ఢిల్లీ వెళ్లినప్పుడు మాత్రం అక్కడ బ్రహ్మాండంగా పొగుడుతున్నారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో భాగంగా మూడో రోజు సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చలో ఆయన మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
- ప్రతిసారీ గవర్నర్ ప్రసంగంలో బంగారం లాంటి రాష్ట్రాన్ని విడగొట్టారని అంటున్నారు
- ఇప్పుడు ప్రవేశపెట్టేది మూడో బడ్జెట్. ఇక మిగిలినవి రెండు మాత్రమే.
- పార్లమెంటు సాక్షిగా రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత.. అధికార, ప్రతిపక్షాలు ఇద్దరూ కలిసి హామీలు ఇచ్చాయి
- ప్రత్యేక హోదా కల్పిస్తామని, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు, పారిశ్రామికంగా ముందుకు వెళ్లేందుకు, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు, హైదరాబాద్ లాంటి నగరం తీసేస్తున్నారు కాబట్టి నష్టపరిహారంగా ప్రత్యేక హోదా అన్నారు
- అప్పటి ప్రధానమంత్రి, కేబినెట్ 2014 మార్చిలో తీర్మానం తీసుకుని నిర్ణయం చేసి, ప్లానింగ్ కమిషన్‌కు ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆదేశాలు కూడా ఇచ్చారు
- ఇప్పటికి 24 నెలలు అయ్యింది. ప్లానింగ్ కమిషన్ పోయి నీతి ఆయోగ్ వచ్చి కూడా 16 నెలలు అయ్యింది
- గవర్నర్ తొలి ప్రసంగంలో కూడా ఇదే అంశం జరిగింది. ప్రసంగంలో ప్రత్యేక హోదా కనీసం 15 సంవత్సరాలు ఉండేలా తెస్తామని ఇదే సభలో ఆయనతో చెప్పించారు.
- ఇప్పటికి రెండేళ్లు అయిపోయింది. ప్రతి సందర్భంలోనూ ఏదో ఒకటి చెబుతూ కాలం నెట్టేస్తున్నారు, కథలు చెబుతున్నారు
- పార్లమెంటు సాక్షిగా రాష్ట్రాన్ని విడగొడుతూ మరో హామీ ఇచ్చారు. యుద్ధప్రాతిపదికన పోలవరం ప్రాజెక్టు కడతామన్నారు.
- అవసరమైతే దానికోసం చట్టాలను సవరిస్తామన్నారు. మూడేళ్లలోనే దాన్ని పూర్తిచేస్తామని చంద్రబాబు గారు గవర్నర్‌తో చేయించిన మొదటి ప్రసంగంలో కూడా చెప్పించారు. రెండేళ్లు అయ్యింది. ఇప్పటికీ ఆ ప్రాజెక్టు నత్తనడకనే నడుస్తోంది.
- ఇప్పుడు.. ఆ ప్రాజెక్టులో ఫేజ్ 1 పూర్తిచేస్తామని కొత్తగా చెబుతున్నారు. అది ఒకటి ఉంటుందని కూడా మాకు ఎవరికీ తెలీదు. ఎప్పటివరకు కడతారో దాన్నే ఫేజ్ 1 అంటారో, లేదా పట్టిసీమనే ఫేజ్ 1 అంటారో కూడా తెలియదు
- మరో హామీ కూడా ఇచ్చారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజి ఇస్తామని చెప్పారు
- చంద్రబాబు ఈ ప్రాంతాలకు వెళ్లినప్పుడు ప్రత్యేక ప్యాకేజి తెస్తామని, అభివృద్ధి చేస్తామని ఊదరగొడుతున్నారు
- ఆయన తెస్తారని, ఇస్తారని ఎదురు చూస్తూ చూస్తూ ఇప్పటికి రెండేళ్లు అయిపోయింది
- పార్లమెంటు సాక్షిగా ఏదైనా రిసోర్స్ గ్యాప్ ఉంటే దాన్ని పూర్తిగా కాంపన్సేట్ చేస్తామని కూడా చెప్పారు
- ఇక్కడ చంద్రబాబు బీద ఏడుపులు ఏడుస్తారు, ఢిల్లీలో మాత్రం వాళ్లను బ్రహ్మాండంగా పొగుడుతారు
- ఆయన ఢిల్లీ ఎందుకు వెళ్తారో మాకు అర్థం కాదు.. సొంతపనులు చక్కబెట్టుకోడానికి వెళ్తున్నారా, లేదా తెలంగాణలో ఓట్ల కోసం కోట్లు కేసులో ఆడియో వీడియో టేపులతో సహా పట్టుబడ్డ నేపథ్యంలో వెళ్తున్నారా అన్నది కూడా తెలియట్లేదు
- కానీ రిసోర్స్ గ్యాప్ వస్తూనే ఉంది, చంద్రబాబు తెస్తారని ఎదురుచూస్తూనే ఉన్నాం
- రాజధాని లేదు కాబట్టి అవసరమైతే అటవీభూములను డీనోటిఫై చేస్తామని కూడా అన్నారు
- ఇదే గుంటూరు జిల్లా వినుకొండలో 22వేల ఎకరాల అటవీభూమి ఉన్నా అది అవసరం లేదని చంద్రబాబు అంటారు
- ఆయనకు తన బినామీల కోసం ల్యాండ్ పూలింగే ముద్దు అంటారు
- కేంద్రం వనరులిచ్చి, చేయమంటే.. చేయం, సింగపూర్‌తోను, చైనాతోను చేయిస్తామంటారు
- ఏ దేశం పోతే ఆ దేశంతో చేయిస్తామంటారు
- రెండేళ్లు అయిపోయింది, ఇప్పటికీ అక్కడ ఒక ఇటుక కూడా పడలేదు
- పెద్ద పెద్ద ఫొటోలు చూపించి, అందులో పెద్ద బిల్డింగులు చూపిస్తారు.. ఆ బిల్డింగుల్లోనే చూసుకోవాల్సి వస్తోంది
- ఇంకా రైల్వే జోన్, పెట్రో కెమికల్ కాంప్లెక్సు, కడపలో స్టీల్ ప్లాంటు పెడతామన్నారు. ఇప్పటికి మూడు బడ్జెట్లు అయిపోయాయి
- ఎక్కడా ఈ మూడింటి ప్రస్తావనే లేదు. కానీ చంద్రబాబు మాత్రం ఈ ప్రాంతాలకు వెళ్లినప్పుడు అదిగో జోన్ అంటారు, ఇదిగో కాంప్లెక్స్ అంటారు, అదిగో ప్లాంటు అంటారు.
- ఈ హామీలలో ఏ ఒక్కటైనా చంద్రబాబు సంతృప్తి కలగజేసేలా తేగలిగారా?
- ఎందుకు ఆయన చిత్తశుద్ధి, సిన్సియారిటీ చూపించడంలేదు, కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదు?
- కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు అల్టిమేటం ఇవ్వలేకపోతున్నారు?
- మీరు నెలరోజుల్లోగా చేయలేకపోతే.. మా కేంద్ర మంత్రులను ఉపసంహరించుకుంటాం అని ఎందుకు అల్టిమేటం ఇవ్వలేకపోతున్నారని అడుగుతున్నా
- చంద్రబాబు ప్రవర్తిస్తున్న తీరు చూస్తే బాధ అనిపిస్తుంది.
- ఆయనకు సిన్సియారిటీ, చిత్తశుద్ధి కనిపించడం లేదు
- కేంద్ర మంత్రులకు వేరే రకమైన పిక్చర్ ఇస్తారు, ప్రపంచానికి వేరే రకంగా పిక్చర్ ఇస్తారు
- చంద్రబాబు సిన్సియారిటీని ఎందుకు శంకించాల్సి వస్తోందంటే, ఆయన ప్రవర్తిస్తున్న తీరు అలా ఉంది
- రాష్ట్రంలో విశాఖపట్నంలో రెండు రోజుల పెట్టుబడి సదస్సు పెట్టారు
- దానికి అరుణ్ జైట్లీ దగ్గర నుంచి అరడజను మంది కేంద్రమంత్రులను కూడా పిలిచారు
- దానికి పెద్దగా పబ్లిసిటీ చేసుకున్నారు
- రెండు రోజుల్లో 4.67 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం, ఎంఓయూలు సైన్ చేశామని గొప్పలు చెప్పుకొన్నారు, డంబాలు కొట్టుకున్నారు
- తాను చైనా, దావోస్ తిరిగి వచ్చాను కాబట్టి తన వ్యక్తిగత చరిష్మావల్లే ఇవన్నీ వచ్చాయని చెప్పుకొన్నారు.
- 48 గంటల్లోనే చంద్రబాబు అని పెట్టుబడులు తెచ్చారు, ఈ రాష్ట్రానికి అన్నీ బాగున్నాయి.. ఇలాంటి రాష్ట్రానికి మనం ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్వాలేదని కేంద్ర మంత్రులు అనుకోరా?
- 1994 నుంచి 2004 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పాలించారు
- అప్పుడు కూడా ఇలాగే ప్రతియేటా స్విట్జర్లాండ్, సింగపూర్ వెళ్లేవారు, ఇన్వెస్టర్ మీట్లు పెట్టేవారు
- ఆ తొమ్మిదేళ్లలో వెయ్యి కోట్ల పైబడి పెట్టుబడులతో ఎన్ని గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులు తెచ్చారని అడుగుతున్నా
- ఎన్నివేల కోట్ల పెట్టుబడులు తెచ్చారు, ఎన్ని వేల మందికి ఉద్యోగాలు ఇప్పించారని అడుగుతున్నా
- ఏ ప్రభుత్వమైనా ఎలా పనిచేసిందనడానికి కొలబద్దలు ఉంటాయి
- ఆయన చెప్పిన ఐదేళ్లలో ఫిగర్లు ఒకసారి చూద్దాం
- 1999 నుంచి 2004 వరకు వ్యవసాయంలో సాధించిన పెరుగుదల 2.89 శాతం
- పరిశ్రమల రంగంలో సాధించిన పెరుగుదల 5.20 శాతం
- సేవల రంగంలో సాధించిన పెరుగుదల 7.7 శాతం
- రాష్ట్రానికి సంబంధించి జీఎస్‌డీపీ గ్రోత్‌రేటు 5.81 శాతం
- ఆ తర్వాత 2009 వరకు రాజశేఖరరెడ్డి పాలన సాగింది. ఆయన దావోస్ వెళ్లలేదు, గొప్పలు చెప్పుకోలేదు
- వ్యవసాయం 6.41 శాతం పెరుగుదల వచ్చింది.
- పరిశ్రమల రంగంలో 10.91 శాతం పెరుగుదల వచ్చింది.
- సేవా రంగంలో 10.6 శాతం పెరుగుదల వచ్చింది.
- రాష్ట్రానికి సంబంధించి జీఎస్‌డీపీ గ్రోత్‌రేటు 9.56 శాతం
- ఇవన్నీ చెప్పడానికి బలమైన కారణం ఉంది
- హీరో మోటార్ కార్పొరేషన్ కోసం వాళ్లు ఫ్యాక్టరీ పెడతామంటే వాళ్లతో చంద్రబాబు ఉన్నారు
- ఏషియన్ పెయింట్స్ ఫ్యాక్టరీ కోసం వచ్చినప్పుడూ వాళ్లతో చంద్రబాబు ఉన్నారు
- వీళ్లిద్దరూ ఇంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డితో కూడా ఇలాగే ఫొటోలు దిగారు
- చంద్రబాబు సీఎం అయ్యి రెండేళ్లయిన తర్వాత.. ఇప్పుడు ఈ రెండు సంస్థల పెట్టుబడులు ఏమయ్యాయని అడుగుతున్నా
- విశాఖపట్నంలో ఒక్క ఐటీ కంపెనీ అయినా తీసుకురాగలిగారా అని అడుగుతున్నా
- ప్రభుత్వం ఇచ్చిన నివేదికలోనే పెద్ద పరిశ్రమలు.. 2014-15లో 3080 కోట్లు, 2015-16లో 3986 కోట్లు వచ్చాయని ప్రకటించారు.
- బహుశా ఇవి కూడా గ్రీన్ ఫీల్డ్ పరిశ్రమలు కావు, బ్రౌన్ ఫీల్డ్ అనుకుంటా..
- ఒకవైపు వాస్తవాలు ఇలా ఉంటే.. అక్కడ మాత్రం 4.67 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతున్నారు
- అదే పారిశ్రామికవేత్తలు మిగిలిన 9 రాష్ట్రాల్లో కూడా ఎంవోయూల మీద సంతకాలు చేస్తారని అందరికీ తెలుసు
- దీంట్లో 5 శాతం కూడా నిజస్వరూపం దాల్చవన్న విషయం కూడా అందరికీ తెలిసిందే
- ఇలా అరడజను మంది కేంద్రమంత్రులను పిలిచి, జరగనిది జరుగుతున్నట్లు చెబుతూ దేశానికి రాంగ్ మెసేజి పంపుతుంటే ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన పరిస్థితి లేదని వాళ్లు అనుకుంటే, ఆ పాపం చంద్రబాబుది కాదా అని అడుగుతున్నా
- మనకు ప్రత్యేక హోదా వచ్చి ఉంటే.. నిజంగానే ఈ 4.67 లక్షల కోట్లే కాదు, వాటికి నాలుగింతల పెట్టుబడులు, ఉద్యోగాలు వచ్చి ఉండేవని చెబుతున్నా
- బీజేపీ నాయకుడు చెబుతున్నట్లు మాకేమీ భయంలేదు.. దీన్ని చూసి ప్రత్యేక హోదా ఇవ్వకుండా పోతారేమోనన్నదే మా భయం. వేరే భయాలేవీ లేవు
- సొంత ఇమేజి పెంచుకోడానికి రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారన్నదే భయం
- ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే ఆ పోరాటాన్ని నీరుగారుస్తున్నారన్నదే భయం
- ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ధర్నా చేశాం, నిరాహార దీక్షలు చేశాం, ఈవాల్టికి కూడా పోరాటం చేస్తూనే ఉన్నాం
- ప్రత్యేక హోదా అంశం వచ్చినప్పుడల్లా ఏవేవో మాట్లాడతారు. వీళ్ల మాటలు చూస్తే గుండె తరుక్కుపోతుంది
- దీన్ని చట్టంలో పెడితే సమస్య రాకపోయేదని అంటారు
- ఇతర రాష్ట్రాలు ఒప్పుకోలేదు కాబట్టి ఇవ్వలేదని మరోసారి అంటారు
- ఈ చట్టాన్ని ఈ రెండేళ్లలో ఎన్నిసార్లు సవరించలేదు?
- సీమాంధ్ర నుంచి తెలంగాణకు ఏడు మండలాలు బదిలీ చేయడానికి సవరించలేదా?
- 50 మంది ఎమ్మెల్సీలను 58 మంది ఎమ్మెల్సీలుగా చేయడానికి సవరించలేదా?
- ఎమ్మెల్యే స్థానాలను పెంచుకోడానికి అవసరమైతే రాజ్యాంగాన్ని కూడా సవరిస్తామన్నారు
- ఇక్కడ, అక్కడ వాళ్ల పార్టీలే ఉన్నప్పుడు.. చట్టాన్ని ఈ అంశం కోసం సవరించలేరా?
- 2003లో వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఒక్క సంతకంతో ఇచ్చేశారు
- ఎన్‌డీసీ నిర్ణయం తీసుకోవాలి, దానికి చైర్మన్ ప్రధానమంత్రి. నీతి ఆయోగ్‌కు, కేబినెట్ అధ్యక్షుడు కూడా ప్రధానే
- ఆయన తలచుకుంటే ఒక నిమిషంలో జరిగే పని అని కూడా అందరికీ తెలుసు
- ప్రధాని కేబినెట్‌లో నిర్ణయం తీసుకుని, ప్లానింగ్ కమిషన్‌కు ఆదేశాలు ఇచ్చి కూడా రెండేళ్లు అయ్యిందన్న బాధతోనే ఇలా చెబుతున్నా
- 11 రాష్ట్రాలకు ఇప్పటికీ ప్రత్యేక హోదా కొనసాగుతున్నప్పుడు, మనకు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని అడుగుతున్నా
- పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చంద్రబాబుకు సిన్సియారిటీ, చిత్తశుద్ధి లేవనడానికి మరో ఉదాహరణ ఉంది
- రాష్ట్రంలో జీఎస్‌డీపీ గ్రోత్ రేటు 10.99 శాతం ఉందని చెప్పారు
- అదే గవర్నర్ ప్రసంగంలో మాట్లాడుతూ కేంద్రం 7.3 శాతం నమోదు చేసినా, మేం కేంద్రం కన్నా ఎక్కువ నమోదు చేశామని ఊదరగొడుతున్నారు
- కేంద్రం చూపించే జీడీపీ గ్రోత్‌రేటును చాలామంది నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అదే ఎక్కువ అని అంటున్నారు
- దానికి కారణం ఏమిటంటే, బ్యాంకులలో 17 శాతం ఎన్‌పీయేలుగా ఉన్నాయి.
- బ్యాంకింగ్ రంగం మూలుగుతూ, కొత్త పరిశ్రమలకు రుణాలు ఇవ్వలేకపోతోంది
- ఉన్న పరిశ్రమలు 50 - 60 శాతం సామర్థ్యంతోనే నడుస్తున్నాయి, రెండేళ్లుగా దేశంలో కరువు కాటకాలున్నాయి
- దాంతో అక్కడి గ్రోత్‌రేటే ఎక్కువ చూపిస్తున్నారని అంటే, ఇక్కడ మాత్రం 10.99 శాతం వచ్చిందని అంటున్నారు
- దేశం కన్నా మనం దారుణంగా ఉన్నాం. హైదరాబాద్ మన నుంచి వెళ్లిపోయాక ఒక్క ఐటీ పరిశ్రమ కూడా మనకు రాలేదు
- స్పిన్నింగ్ మిల్లులు, జిన్నింగ్ మిల్లులు, షుగర్ ఫ్యాక్టరీలు అన్నీ మూతపడుతున్నాయి.
- చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో వరుసగా రెండేళ్లు కరువులు వచ్చాయి, వరదలు కూడా చూశాం
- ఇలాంటి దారుణ పరిస్థితిలో రుణమాఫీ కూడా కాకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
- ఇలాంటి పరిస్థితిలో 10.99 శాతం గ్రోత్ రేటు ఎలా సాధ్యమని అడుగుతున్నాం
- ఈయన చెబుతున్న లెక్కలను అడ్వాన్స్ ఎస్టిమేట్లు అంటారు. వాటిలో నిజమెంతో తెలిసేసరికి నాలుగేళ్లు పడుతుంది
- అంచనాలను ఒకసారి కాదు మూడు నాలుగు సార్లు సవరిస్తారు
- ఈ నాలుగేళ్లలో ఏమైనా బొంకచ్చనే ఉద్దేశంతో చంద్రబాబు విపరీతమైన అబద్ధాలు చెబుతున్నారు
- గ్రోత్ రేటుకు, ఆదాయానికి ప్రత్యక్షంగా సంబంధం ఉంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే
- మీరు చూపిస్తున్న తప్పుడు లెక్కల వల్ల జరిగే నష్టం ఏంటో చెబుతున్నా
- అరుణ్ జైట్లీ 7.3 శాతం గ్రోత్ రేటు చూపిస్తూ.. పరోక్ష పన్నుల ఆదాయం 31 శాతం పెరిగాయని చెప్పారు
- ఓవరాల్ ఆదాయం 22 శాతం పెరిగిందని చెప్పారు
- మన రాష్ట్రానికి కూడా ప్రత్యక్ష పన్నులు రావు.. పరోక్ష పన్నుల ద్వారానే మనకు వస్తాయి
- పెట్రోలు, డీజిల్ మీద మన ప్రభుత్వం వ్యాట్‌కు అదనంగా 4 రూపాయల పన్ను వేస్తోంది. దేశం మొత్తమ్మీద వీటి ధరలు మన రాష్ట్రంలోనే ఎక్కువ
- లిక్కర్ మీద వ్యాట్ 190 శాతానికి పెంచాం
- భూముల రిజిస్ట్రేషన్ విలువలు కూడా విపరీతంగా పెంచాం
- కరెంటు పెంచాం, ఆర్టీసీ చార్జీలు, మున్సిపల్ పన్నులు పెంచాం.. విపరీతంగా బాదుడే బాదుడు బాదాం
- కేంద్రం 7.3 శాతం వృద్ధితోనే 22 శాతం రెవెన్యూ పెరిగిందంటే మన గ్రోత్ రేటుతో మనకు ఇంకెంత ఆదాయం వస్తుందని అనుకుంటారు?
- కానీ వాస్తవంగా మన పరిస్థితి ఏంటంటే మన ఆదాయం పెరిగింది కేవలం 13 శాతం. అంటే ఇదైనా తప్పు కావాలి, గ్రోత్ రేటు అయినా తప్పు అయి ఉండాలి
- మనకు కేంద్రం నుంచి సహాయం చేసేవాళ్లంతా ఏమనుకుంటారు.. ఆంధ్ర రాష్ట్రం దేశం కన్నా ఎక్కువ పురోగతిలో ఉంది, ఇలాంటి రాష్ట్రానికి మనం ఏ రకమైన సాయం చేయాల్సిన పని లేదని, వాళ్ల కాళ్ల మీద వాళ్లు బతుకుతారనే ఇంప్రెషన్ ఇవ్వడం లేదా అని అడుగుతున్నా.
- సొంత ఇమేజి పెంచుకోడానికి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం సబబా అంటున్నా
- పోలవరం ప్రాజెక్టు కేంద్రం మూడేళ్లతో కడుతుందని కేంద్రమంత్రుల నుంచి చంద్రబాబు వరకు అందరూ అంటారు
- మరోవైపు 1600 కోట్ల రాష్ట్ర నిధులతో పట్టిసీమ ప్రాజెక్టు కడతారు
- చంద్రబాబు ఎక్కడకు పోయినా ప్రైవేటు విమానాలలోనే వెళ్తారు
- రాజధాని శంకుస్థాపన కార్యక్రామానికి 400 కోట్లు దుబారా చేస్తారు
- పుష్కరాలకు 1600 కోట్లు నామినేషన్ పద్ధతిలో ఖర్చుపెడతారు
- హైదరాబాద్‌లో సచివాలయానికి మరమ్మతులు, కన్సల్టెంట్లకు నామినేషన్ పద్ధతిలో డబ్బులిస్తారు
- విదేశీ టూర్లు, వాటికి మీతో పాటు ఒక సైన్యాన్ని తీసుకెళ్తారు
- వీటన్నింటికీ దుబారా ఖర్చు మరో 200 కోట్లు పెడతారు
- ఇవన్నీ చూస్తే పైనున్న కేంద్రం, బయటి రాష్ట్రాలు ఏమనుకుంటారు.. మన దగ్గర డబ్బులు చాలా ఉన్నాయని అనుకోరా?
- కేంద్రం పార్లమెంటు సాక్షిగా రాష్ట్రాన్ని విడగొడుతూ ఇచ్చిన మరో ప్రధానమైన హామీ పోలవరం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుపై చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి చూద్దాం
- ఆ ప్రాజెక్టును పూర్తి చేయడం కన్నా, కమీషన్ల మీదే ఎక్కువ చిత్తశుద్ధి చూపుతున్నారు
- ప్రాజెక్టు నత్తనడకన సాగుతోందని 2015 ఆగస్టులో పోలవరం అథారిటీ లేఖ రాసింది
- 2015 జనవరి నుంచి జూన్ వరకు 2 శాతం మాత్రమే ప్రగతి ఉందని చెప్పారు
- కాంట్రాక్టరు ఈ పనులు చేయడానికి ఆసక్తి చూపడం లేదని రాశారు
- 2015 అక్టోబర్ 10న జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం పోలవరం పనితీరును సమీక్షించింది
- పనుల పురోగతి 5.52 శాతం అని అందులో చూపించారు
- అలా తెలుసుకున్నాక కాంట్రాక్టర్‌ను తీసేసి, కొత్త టెండర్లు పిలవాలి
- పోలవరం ప్రాజెక్టు అథారిటీ మీద ఒత్తిడి తేవాల్సింది పోయి.. ఇదే కాంట్రాక్టరును కొనసాగిస్తూ, ధరల మార్పుతో రేట్లు పెంచుకోడానికి ఈపీసీ కాంట్రాక్టులో లేకపోయినా వెసులుబాటు ఇచ్చారు.
- సబ్ కాంట్రాక్టర్లను నామినేషన్ పద్ధతిలో తెచ్చుకోవచ్చని, ఆ విషయాన్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి కూడా చెప్పాల్సిన అవసరం లేదని కేబినెట్ సమావేశంలో చెప్పారు
- దానిమీద చీఫ్ సెక్రటరీలు సంతకాలు పెట్టడానికి భయపడ్డారు
- అసలు కాంట్రాక్టర్లకు రేట్లు పెంచాల్సిన అవసరం ఏముంది, డీజిల్ ధరలు తగ్గాయి, స్టీల్ ధరలు తగ్గాయి. ఇసుక కూడా ఫ్రీగా ఇస్తామన్నారు. సిమెంటు, అల్యూమినియం రేట్లు సైతం పెరిగిన దాఖలాలు లేవు. మరి ధరలు ఎందుకు పెంచాలి?
- కొత్త టెండర్లు పిలిస్తే పాతరేట్లకు గానీ అంతకంటే తక్కువకు గానీ వస్తారేమో.. రేట్లు పెంచి కమీషన్లు తీసుకుంటున్నారు
- పోలవరం, ఇతర ఇరిగిషన్ ప్రాజెక్టులు దారుణంగా చేస్తున్నారు
- రైట్ మెయిన్ కెనాల్‌కు సంబంధించిన పనిలో ఎల్ అండ్ టీ సంస్థ నుంచి 22 కోట్ల పనులు తీసేసి, నామినేషన్ ప్రాతిపదికన బొలినేని శీనయ్య కంపెనీకి ఇచ్చారు.
- ఎవరి పద్ధతి బాగాలేదో ప్రజలంతా చూస్తున్నారు
- సీఎస్ లు సైతం సంతకాలు పెట్టడానికి భయపడుతుంటే ఏమేరకు అవినీతి జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నాం
- రాజధానికి అటవీ భూమిని ఇస్తామని కేంద్రం ముందుకు వచ్చినా చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ కు వెళ్లారు
- రాజధాని ప్రాంతంలో భారీస్థాయిలో కుంభకోణాలు జరుగుతున్నాయి
- చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ అథారిటిగా సీఆర్ డీఏను చెప్పవచ్చు
- సింగపూర్ కంపెనీ సుర్బానాకు డిటైల్ మాస్టర్ ప్లాన్ కోసం రూ.12 కోట్లు ఇచ్చారు
- ఈ మేరకు చంద్రబాబు స్వయంగా సంతకం చేసిన లేఖ కూడా ఉంది
- సింగ్ పూర్ కంపెనీ ఉచితంగా మాస్టర్ ప్లాన్ ఇచ్చినట్టు గవర్నర్ చేత అబద్దాలు చెప్పించారు
- రాజధాని ఎక్కడ వస్తుందని నీకు, నీ బినామీలకు తప్ప ఇతరులకు చెప్పకుండా ఉండడం న్యాయమేనా
- రాజధాని వేరే చోట వస్తున్నట్టు ప్రకటలు చేయించడం మోసం కాదా
- నీ బినామీలు రైతుల దగ్గర నుంచి తక్కువ రేటుకు భూములు కొనలేదా
- వాళ్ల భూములకు డిమాండ్ క్రియేట్ చేయడానికి వాటిని రియల్ జోన్ లో పెట్టలేదా?
- అసైన్డ్, లంక భూములు కొనడం నేరమని తెలిసినా కొన్నారు
- రైతులను భయపట్టి తక్కువ ధరలకు భూములు లాక్కోలేదా?
- రూ5 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పేదల భూములు కొని మోసం చేశారు
- టీడీపీ నేతలు భూములు కొన్నాక రాజధాని ప్రకటించి మీ బినామీలకు మేలు జరిగేలా ప్యాకేజీ ప్రకటించింది నిజం కాదా?
- పుల్లారావు గారికి కూడా బినామీ పేర్లతో భూములున్నాయి కాబట్టి ఆమాత్రం రియాక్ట్ అవడం మామూలే. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకోవడం మామూలే
- మీరు చెబుతున్న 43వేల కోట్లలో పావలా భాగం ఇచ్చేయండి.. మీరు ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకాలు పెడతాం
- రేపు ఈ అసెంబ్లీ చూపించి ఇది కూడా నాదేనంటారు.. అదికూడా మీరే తీసుకోండి
- అక్కడ ఏం జరుగుతోంది.. ఫలానా చోట రాజధాని వస్తోందని తెలిసి, ఆ విషయాన్ని దాచిపెట్టి అక్కడ చక్కగా భూములు కొనుక్కున్న తర్వాత రాజధాని ప్రకటించడం ధర్మమేనా అని అడుగుతున్నా
- అసైన్డ్ భూములకు సంబంధించిన జీవో నెంబర్ 41ను 2016 ఫిబ్రవరిలో ఇచ్చారు.
- అసైన్డ్ భూములు కొన్న తర్వాత ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములను కొనుక్కోవచ్చంటూ చట్టంలో దిక్కుమాలిన మార్పు చేయడం కరెక్టేనా
- రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన 2వేల కోట్లను డైవర్ట్ చేస్తూ, సింగపూర్ ప్రైవేటు కంపెనీలు తెచ్చుకోడానికి చివరకు రాష్ట్ర రాజధానిని తాకట్టు పెట్టడం ధర్మమేనా అని అడుగుతున్నా
- తొలుత సింగపూర్ ప్రభుత్వం చేస్తుందన్నారు, తర్వాత సింగపూర్ ప్రైవేటు కంపెనీ చేస్తుందని చెబుతున్నారు
- చంద్రబాబు నోట మాటలు వస్తుంటే.. చాలా అన్యాయస్తుడు మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంది
- నామీద కేసులు పెట్టింది చంద్రబాబు, కాంగ్రెస్ నాయకులు కలిసి పెట్టారు
- రాజశేఖరరెడ్డి ఉన్నంతవరకు ఆయన మీద కేసులు లేవు
- జగన్ కాంగ్రెస్‌లో ఉన్నంతవరకు కేసులు లేవు
- కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టి వెళ్లిన తర్వాత వాళ్లు, చంద్రబాబు కలిసి కేసులు పెట్టారు
- అయినా అధికారంలో ఉన్న సోనియాగాంధీతో పోరాడేందుకు కూడా నేను వెనకడాలేదు
- నా మీద విచారణ వద్దని కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకోలేదు
- చంద్రబాబు ఇంతసేపు మాట్లాడినా సీబీఐ దర్యాప్తుకు అంగీకరించలేదు
- దీనినిబట్టి చంద్రబాబు ఏమేరకు నిజాయితీ పరుడో అర్థమవుతున్నది
- సింగపూర్ కంపెనీలను రాజధానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి తీసుకొచ్చారు
- ఇందుకోసం సర్వీసు చార్జీలు కూడా వసూలు చేసే వెసులుబాటు కల్పించడం ఎంతవరకు సబబు?
- ఒక పద్ధతిప్రకారం మీకు చెందిన ప్రైవేటు కంపెనీలు సింగపూర్ కంపెనీల పేరిట తీసుకొచ్చారు
- సీబీఐ ఎంక్వైరీ అనగానే తేలుకుట్టిన దొంగల్లా ఎవరు వెనక్కి పోతున్నారో ప్రజలు చూస్తున్నారు
- ఔటర్ రింగ్ రోడ్డులో ఇదేరకరమైన ఆరోపణలు వచ్చినప్పుడు సీబీఐ ఎంక్వైరీకి అప్పటి ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. నిజాయితీ ఉంది కాబట్టే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆ ఆదేశాలు ఇచ్చారు.
- రాజధాని భూముల విషయంలో ఓత్ సీక్రెసీని సీఎం చంద్రబాబు ఉల్లంఘించారు.