
శారీరక వాంఛ తీర్చలేదని...
- బండరాయితో కొట్టి... కత్తితో గొంతు కోసిన కిరాతకుడు
- గండిపేటలో మైనర్ బాలిక హత్య కేసు నిందితుడి అరెస్టు
హైదరాబాద్: గండిపేట చెరువు ప్రాంతంలో ఆదివారం జరిగిన మైనర్ బాలిక హత్య కేసును నార్సింగ్ పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. శారీరక వాంఛ తీర్చేందుకు నిరాకరించడంతో బాలికను బండరాయితో కొట్టి... గొంతు కోసి చంపిన చాంద్రాయణగుట్ట కూరగాయల వ్యాపారి అక్బర్(25)ను సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పట్టుకున్నారు. కేసు వివరాలను నార్సింగ్ ఇన్‌స్పెక్టర్ రాంచందర్‌రావు, రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డితో కలిసి శంషాబాద్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ నార్సింగ్ ఠాణాలో సోమవారం మీడియాకు వెల్లడించారు.
డబ్బు కోసం ఎర: బండ్లగూడలో నిందితుడు అక్బర్, మృతురాలి తండ్రి కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. దీంతో వీరి మధ్య స్నేహం ఏర్పడింది. దుబాయ్‌లో పనిచేస్తున్న బాలిక తండ్రి సోదరులిద్దరూ... డబ్బులను అక్బర్ బ్యాంక్ ఖాతాకు పంపిస్తుండేవారు. ఆ డబ్బును అక్బర్ మృతురాలి తండ్రికి ఇస్తుండేవాడు. ఐదు నెలల కిందట అక్బర్‌కు పెళ్లైంది. కాగా, ఇటీవల బాలిక తండ్రి సెకండ్ హ్యాండ్ కారు ఉంటే చూడమని అక్బర్‌కు చెప్పాడు.ఈ క్రమంలో అతడి వద్ద నుంచి డబ్బు గుంజవచ్చని భావించిన అక్బర్... బాలిక తండ్రి కుటుంబానికి దగ్గరయ్యాడు. 9వ తరగతి చదువుతున్న అతని 14 ఏళ్ల అతని కుమార్తెతో పరిచయం పెంచుకున్నాడు.
ప్రేమిస్తున్నానని నమ్మించి ఇంట్లో నుంచి డబ్బులు తీసుకొస్తే ఎక్కడికైనా వెళ్లిపోదామని బాలికను మభ్యపెట్టాడు. రూ.40వేల నగదు, 2 తులాల బంగారు ఆభరణాలు వెంట తెచ్చుకున్న బాలికను ఆదివారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో నంబర్ ప్లేట్ లేని పల్సర్ బైక్‌పై ఎక్కించుకొని గండిపేట చెరువువైపు వెళ్లాడు. నార్సింగ్ రోడ్డుకు కొంతదూరంలో ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి శారీరక వాంఛ తీర్చమని బలవంత పెట్టాడు. ఆమె నిరాకరించింది. విషయం ఎవరికన్నా తెలిస్తుందన్న భయంతో అక్కడున్న రాయితో తలపై కొట్టాడు. చున్నీతో చేతులు కట్టేసి బండ రాయితో మోదాదు. రక్తంలో కొట్టుమిట్టాడుతున్న బాలిక... డబ్బులు, నగలు అన్నీ ఇచ్చేస్తానని, తనను ఆసుపత్రికి తీసుకెళ్లమని ఎంత ప్రాథేయపడినా కిరాతకుడు కనికరించలేదు. వెంట ఉన్న కూరగాయల కత్తితో బాలిక గొంతు కోశాడు. చనిపోయిందని నిర్ధారించుకున్నాక... డబ్బు, నగలుతో బైక్‌పై అక్బర్ ఇంటికి వెళ్లిపోయాడు.
సీసీ కెమెరాలతో చిక్కాడు
నార్సింగ్ గండిపేట ప్రధాన రహదారిలో అమర్చిన సీసీకెమెరాల్లో అక్బర్, మృతురాలు బైక్‌పై వెళ్లిన దృశ్యాలు చిక్కాయి. నిందితుడి ఫొటోను పోలీసు వాట్సప్ గ్రూప్‌ల్లో అందరికీ పంపించి అప్రమత్తం చేశారు. అదే సమయంలో తన కూతురు కనిపించడం లేదని బాలిక తండ్రి ఆదివారం రాత్రి ఫిర్యాదు చేశారు. అతడి సమాచారంతో అక్బర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.40వేల నగదు, రెండు తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.