ఎస్సీ ఎస్టీలపై జరిగే నేరాలు తగ్గినట్లు హోం మంత్రి చెబుతున్నారు గానీ విజయనగరం జిల్లాలో గిరిజనుల మీద నేరాలు ఏమాత్రం తగ్గకపోగా పెరుగుతున్నాయని సాలూరు వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాజన్నదొర అన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో భాగంగా మంగళవారం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. సాలూరులో జనవరిలో ఇద్దరు గిరిజనులను సజీవ దహనం చేశారని, ఫిబ్రవరిలో సాలూరు నియోజకవర్గ పరిధిలోని మెంటాడ మండలంలో గిరిజన మహిళపై లైంగిక దాడి జరిగిందని, మార్చి 19న ఓ గిరిజనుడిని హత్య చేశారని ఆయన చెప్పారు.
దళితులు, గిరిజనులపై నేరాలు పదే పదే జరుగుతున్నాయని, అందువల్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. బాధితులను ఆర్థికంగా కూడా ఆదుకోవాలని సూచించారు. నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కేసులు పెట్టి బాధితులకు, ముఖ్యంగా మహిళలకు న్యాయం చేయాలని రాజన్నదొర డిమాండ్ చేశారు. బాధితులలో అమ్మాయిలకు కనీసం ఉపాధి కల్పించాలన్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అత్యాచార బాధితురాలికి పరిహారంగా కేవలం రూ. 50 వేలు ఇచ్చి చేతులు దులుపుకొన్నారని, గిరిజినులు, దళితులపై జరిగే నేరాల్లో బాధితులను ఆర్థికంగా, సామాజికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని ఆయన చెప్పారు.
గిరిజనులపై నేరాలు.. పట్టించుకోరా?
Published Tue, Mar 22 2016 9:22 AM | Last Updated on Sat, Aug 18 2018 5:18 PM