ఎమ్మెల్యేలకు ‘కార్పొరేషన్’ పదవులు!
- వారంలో కనీసం 4 పోస్టుల భర్తీ!
- ఆర్టీసీ చైర్మన్ రేసులో పలువురు ఎమ్మెల్యేలు
- టీఆర్‌ఎస్‌లో రసవత్తర చర్చ
సాక్షి, హైదరాబాద్: పలు అధికారిక పదవులను ప్రస్తుత బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపే రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసే అవకాశముందని అధికార టీఆర్‌ఎస్ నేతల్లో చర్చ మొదలైంది. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల నామినేటెడ్ పదవులను కొందరు ఎమ్మెల్యేలతో భర్తీ చేయనున్నారని సమాచారం. వీటిలో కేబినెట్ ర్యాంకు పదవులు కూడా ఉండడంతో ఎమ్మెల్యేల్లో పోటీ తీవ్రమైంది. మంత్రివర్గంలో సంఖ్యా పరిమితి వల్ల అవకాశాలు దక్కని సీనియర్లు వీటికోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
మంత్రి పదవుల కోసం తనపై వస్తున్న ఒత్తిడి నుంచి బయట పడేందుకు పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు గతంలో పార్లమెంటరీ సెక్రటరీ పదవులను తెరపైకి తెచ్చి ఏడుగురు ఎమ్మెల్యేలకు అవకాశమిచ్చినా కోర్టు తీర్పు నేపథ్యంలో వాటిని రద్దు చేయాల్సి రావడం తెలిసిందే. దాంతో నామినేటెడ్ పదవులకు ఒక్కసారిగా పోటీ పెరిగింది. టీఆర్‌ఎస్‌లో మొదటినుంచీ కొనసాగుతున్న సీనియర్ నేతలు, సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ దక్కని వారు, ఓడిపోయి నియోజకవర్గ ఇన్‌చార్జీలుగా ఉన్నవారు... ఇలా ఎంతోమంది పదవుల కోసం ఆశగా చూస్తున్నారు.
వారంలోగా కనీసం మూడు నాలుగు కార్పొరేషన్ల చైర్మన్ పోస్టులు భర్తీ కానున్నట్టు అధికార పార్టీలో చర్చ జరుగుతోంది. బ్రాహ్మణుల సంక్షేమానికి తాజా బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించినందున ‘బ్రాహ్మణ కార్పొరేషన్’కు చైర్మన్‌ను వేస్తారంటున్నారు. పార్లమెంటరీ సెక్రటరీగా చే సిన హుస్నాబాద్ ఎమ్మెల్యే వడితల సతీశ్ పేరు ఇందుకు పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌కు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పేరు పరిశీలనలో ఉందంటున్నారు. ఓ మంత్రి తాలూకు ప్రధాన అనుచరునికి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (శాప్) చైర్మన్ పదవి ఖరారైందని తెలిసింది. ఇక బాగా డిమాండున్న ఆర్టీసీ చైర్మన్ పదవి కోసం ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుతో పాటు వరంగల్‌కు చెందిన మరో ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు పేరూ తెరపైకి వచ్చినట్టు సమాచారం. వ్యవసాయ మార్కెట్ల పాలక మండళ్లు, దేవాలయ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థలు తదితర నామినేటెడ్ పదవులనూ భర్తీ చేయాల్సి ఉంది.