పట్నం రోడ్డుపై పల్లె తల్లి | Mother in the village on the road Pattanam | Sakshi
Sakshi News home page

పట్నం రోడ్డుపై పల్లె తల్లి

Published Thu, May 5 2016 12:34 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

పట్నం రోడ్డుపై పల్లె తల్లి - Sakshi

పట్నం రోడ్డుపై పల్లె తల్లి

కరువు కాటుతో హైదరాబాద్‌కు వలస వచ్చిన లక్షల మంది రైతులు, కూలీలు
అడ్డాకూలీలుగా మారి పనుల కోసం ఎదురుచూపులు..
సెక్యూరిటీ గార్డులుగా, వాచ్‌మన్‌లుగా చేరిన వైనం
ఇరుకు గదులు, మురికివాడల్లో జీవనం
కూకట్‌పల్లి నుంచి ఉప్పల్ దాకా ఎక్కడ చూసినా రైతుల వెతలే
ఛిద్రమైన పల్లె బతుకుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం

 
పచ్చని పొలాలు.. భూతల్లికి తీరొక్క పంటల తోరణాలు.. నల్లరేగళ్లలో నాగళ్ల సాళ్లు..
ఎద్దూ ఎవుసం.. వాగూవంక, చేనూచెలక..  ఎక్కడ చూసినా తడిసిన మట్టివాసనే..!  ఇదంతా గతం..
పొట్ట చేతబట్టుకొని హైదరాబాద్‌కు వలస వచ్చిన లక్షల మంది రైతులు, కూలీలు
అడ్డాకూలీలుగా మారి పనుల కోసం ఎదురుచూపులు.. సెక్యూరిటీ గార్డులుగా, వాచ్‌మెన్‌లుగా చేరిన వైనం

మరి ఇప్పుడు.. పల్లె తల్లడిల్లుతోంది. నీళ్లు లేక కన్నీళ్లు పెట్టుకుంటోంది. చేన్లు, చెలకలన్నీ బీడు పడ్డాయి. బోర్లన్నీ ఎత్తిపోయాయి. చెరువులు నైచ్చాయి. కాస్తోకూస్తో నిలబడ్డ పంటలూ నిలువునా ఎండిపోయాయి. కనీవినీ ఎరుగని ఈ కరువు, దుర్భిక్ష పరిస్థితులు పల్లె జీవనాన్ని ఛిద్రం చేస్తున్నాయి. నలుగురికి పట్టెడన్నం పెట్టే రైతన్నను పట్నానికి తరుముతున్నాయి. నలుగురికి పని కల్పించిన చేతులే ఇప్పుడు పనికోసం చేయి చాస్తున్నాయి. భార్యాబిడ్డలను పస్తులుంచలేక పొట్ట చేతబట్టుకొని ఎందరో రైతులు పట్నం బాట పట్టారు. హైదరాబాద్ మహానగరంలో అడ్డాకూలీల అవతారమెత్తారు. గతంలో ఎప్పు డూ లేనట్లుగా వివిధ జిల్లాల నుంచి రైతులు, రైతు కూలీలు, బడుగు జీవులు రాజధానికి చేరుకుంటున్నారు. మట్టిపని, తట్టపని, పారపని.. ఏది దొరికినా సరేనంటూ రోడ్లపై నిలబడు తున్నారు.
 
 ఊళ్లో నాలుగెకరాల పొలమున్న రైతులు సైతం నగరంలో అపార్ట్‌మెంట్ల వద్ద సెక్యూరిటీ గార్డుగా, నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద వాచ్‌మన్‌లుగా చేరిపోయారు. ఇరుకు గదుల్లో, మురికివాడల్లో కాలం వెళ్లదీస్తున్నారు. 80 ఏళ్ల వయసులోనూ ఓ గుడి వద్ద వాచ్‌మన్‌గా చేరిన మైల ఐలయ్య... మూడెకరాల పొలం ఉండీ పంటలు పండే పరిస్థితి లేక నగరానికి వచ్చిన మెదక్  రైతు సాయమ్మ.. ఇలా లక్షలాదిగా  రైతులు, పేదలు ఉపాధి కోసం నగరానికి తరలి వచ్చారు. నగరంలోని కూకట్‌పల్లి, మూసాపేట్, మియాపూర్, బొల్లారం చౌరస్తా, చందానగర్, సికింద్రాబాద్, రామంతాపూర్, చంపాపేట్, అఫ్జల్‌గంజ్, ఉప్పల్, రామంతాపూర్, తార్నాక, అంబర్‌పేట్ వంటి ప్రాంతాలన్నీ అడ్డాకూలీలతో కిటకిటలాడుతున్నాయి. వారి వ్యథాభరిత బతుకుల కన్నీటిగాథలపై ప్రత్యేక ‘సాక్షి’ ప్రత్యేక కథనం..

కూటి కోసం కూలి కోసం ఉన్న ఊళ్లో పనుల్లేక పట్టణంలో బతుకుదామని బయలుదేరిన బడుగు రైతుకు మండుటెండలో ఒక్కతీరుగ వెదుకుతున్న పనులు దొరకక భాగ్యనగరిలో బిక్కుబిక్కుగా పంటను తలచుకు బాధపడుతూ..అప్పును తలచి భయపడుతూ..తిరుగుతుంటే..చండ ప్రచండం ఎండ కాస్తే బండలు కొట్టే కూలీగా బంగ్లా కట్టే మేస్త్రీగా జ్యూస్‌లు పిండే వ్యాపారిగా అలవాటు లేని అడ్డాపై తడబడి నిలబడి తల్లడిల్లుతున్న నేలపుత్రుడికి ఎంత కష్టం.. ఎంత కష్టం..!!
 
 హైదరాబాద్‌లోని కూలీల అడ్డాలన్నీ కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ చూసినా పల్లెల నుంచి వచ్చిన రైతులు, కూలీలు, వారి కుటుంబీకులతో నిండిపోతున్నాయి. కరువు దెబ్బకు పల్లె నుంచి పొట్టచేతబట్టుకొని వచ్చిన వీరంతా ఇక్కడ పనుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఏడాదంతా చేతినిండా పనితో గడిపిన రైతులు.. ఇప్పుడు ‘ఈ రోజు పని దొరికితే చాలు..’ అన్నట్టుగా కాలం గడుపుతున్నారు. మట్టిపని, తట్టపని, పారపని.. ఇలా ఏది దొరికినా సరేనంటూ కదులుతున్నారు. ఘట్కేసర్ నుంచి సికింద్రాబాద్ వరకు, శంషాబాద్ నుంచి అఫ్జల్‌గంజ్ వరకు, మొయినాబాద్ నుంచి మొహదీపట్నం వరకు, కొంపల్లి నుంచి ప్యారడైజ్ వరకు ‘సాక్షి’ పలువురు రైతుల్ని, కూలీలను పలకరించింది. వారి గోడు ఇదిగో...
 - సాక్షి, హైదరాబాద్
 
 పొలం వదులుకొని పండ్లు అమ్ముకొంటూ...

 ఇరవై రోజుల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఈమె పేరు చెన్నమ్మ. మహానగరంలో మేడిపల్లి వద్ద పండ్ల వ్యాపారం చేసుకుంటూ పొట్టబోసుకుంటోంది. ఈమెకు రెండెకరాల పొలం ఉన్నా.. ఎండిపోయింది. ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లయ్యాయి. కరువు కాటుతో వారంతా నగరానికి వచ్చి కూలి పని చేసుకుంటున్నారు. తలోదిక్కు పని చేసుకున్నారు. రూ.2 వేలు అప్పు చేసి పండ్ల వ్యాపారం మొదలుపెట్టింది చెన్నమ్మ. ‘‘వానలు పడి నీళ్లొస్తే మా ఊరుకు మేం వెళ్లిపోతం. అప్పటిదాకా ఏదో ఒక పని చేసుకొని ఇక్కడ బతుకుదామని వచ్చినం’’ అని ఆమె చెప్పింది.
 
 మూడెకరాలు ఉన్నా ఏం లాభం?
 మెదక్ జిల్లా తుర్కపల్లికి చెందిన కొండ భిక్షపతి, బాలలక్ష్మి దంపతులకు మూడెకరాల భూమి ఉంది. బోర్లు ఎండిపోవడంతో పంటలూ ఎండాయి. గత్యంతరం లేక ఉప్పల్‌కు వచ్చి ఇలా భవన నిర్మాణ కూలీలుగా బతుకీడుస్తున్నారు. ఇద్దరూ రోజంతా కష్టపడితే రోజుకు రూ.400 నుంచి రూ.500 వరకు వస్తున్నాయి. ‘‘ఇక్కడ ఎంతకాలం బతుకుత ం? ఎన్ని రోజులు ఉన్నా మా ఊరుకు పోవాల్సిందే. అక్కడ పని ఉంటే ఏ బాధ ఉండదు’’ అని చెప్పాడు భిక్షపతి.
 
 పంట చేతికొచ్చే సమయానికి బోరు ఎండింది..
 ఈయన పేరు శ్రీనివాస్. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట్ మండలం దానంపల్లి. ఊళ్లో రెండెకరాల పొలం ఉంది. ఏడాది క్రితం అప్పు తెచ్చి బోరు వేశాడు. తొలినాళ్లలో కాసింత నీళ్లు వచ్చినా మొక్కజొన్న పంట చేతికొచ్చే సమయానికి బోరు ఎండిపోయింది. దీంతో గుండె దిటవు చేసుకొని భార్య, కొడుకుతో కలిసి పట్నం దారి పట్టాడు. అప్పు తెచ్చి మొయినాబాద్‌లో చెరుకు బండి పెట్టుకున్నాడు. ‘‘పొద్దంతా కష్టపడితే రూ.300 వరకు మిగులుతున్నాయి. బండి కోసం చేసిన అప్పు తీరితే చాలు..’’ అని ఆయన చెప్పాడు.
 
 పంటలు పండితే... ఇలా రాళ్లు కొట్టాల్సి వచ్చేది కాదు
 మహబూబ్‌నగర్‌కు చెందిన రాములు, ఖమ్మం నుంచి వచ్చిన లింగయ్యను కరువు ఇలా ఒక్కటి చేసింది! ఇద్దరికి వారి ఊళ్లో చెరో రెండెకరాల పొలం ఉంది. బోర్లల్లో నీళ్లు  ఉండి పంటలు పండి ఉంటే హైదరాబాద్‌కు వచ్చి ఇలా రాళ్లు కొట్టుకోవల్సి వచ్చేది కాదని వారు ఆవేదన వ్యక్తంచేశారు. వీరు ఇప్పుడు నారపల్లి వద్ద ఒకచోట కూర్చొని రోళ్లు తయారు చేస్తున్నారు. ఒక్క రోలు అమ్మితే రూ.వంద వస్తాయని చెప్పారు. ‘‘రాళ్లు కొట్టి కొట్టి చేతులు నొప్పి పెడుతున్నాయి. రోజంతా కష్టపడితే ఒక్క రోలు తయారైతది. ఎవరన్నా కొంటేనే ఆ రోజుకు పూట గడిచినట్లు లెక్క’’ అని ఇద్దరు రైతులు గోడు వెళ్లబోసుకున్నారు.
 
 కరువుతో రోడ్డున పడ్డం..
 వీరు సోమ్లానాయక్, ఈరమ్మ దంపతులు. ఊరు నల్లగొండ జిల్లా భువనగిరి దగ్గర ఉన్న జేపల్లె తండా. కాలం లేక నగరానికి వచ్చి ఇలా తాటి ముంజలు అమ్ముకుంటూ బతుకుతున్నారు. ‘‘ఇన్నాళ్లూ రెండెకరాల పొలం మీదనే బతికినం. ఇద్దరు బిడ్డల పెళ్లి చేసిన. కష్టాలు తీరినై అ నుకున్నాం గానీ కరువుతో బతుకులు రోడ్డున పడ్డయి. ఇగో ఇట్ల తాటి ముం జలు అమ్ముకొని బతుకుతున్నం’’ అని గోడు వెళ్లబోసుకున్నాడు సోమ్లానాయక్.
 
 ఎనభై ఏళ్ల వయస్సులో వాచ్‌మెన్‌గా..
 ఈయన పేరు మైల ఐలయ్య. వయసు 80 ఏళ్లు. ఊరు వరంగల్ జిల్లా జనగామ సమీపంలోని కోడూరు. సొంతూళ్లో రెండెకరాల భూమి ఉంది. పంటల్లేక ఇద్దరు కొడుకులతో కలిసి నగరానికి వలస వచ్చాడు. ఈ వయసులో మహానగరంలో ఓ గుడి దగ్గర చిన్న చిన్న పనులు చేసి ఎవరైనా నాలుగు డబ్బులిస్తారేమోనని ఆశగా ఎదురు చూస్తున్నాడు. మొన్నటి వరకు వాచ్‌మెన్‌గా పని చేశాడు. అయితే పెద్ద వయసు కావడంతో పనిలోంచి తీసేశారు. ఆయన ఇద్దరు కొడుకులు ఆటో నడుపుకొంటున్నారు.
 
 ఇంత కరువు ఎప్పుడూ చూడలేదు
 ఈయన పేరు విశ్వనాథం. మెదక్ జిల్లా శంకర్‌పల్లి. ఈయన్ను పలకరించగా.. ‘‘నా 50 ఏళ్ల జీవితాన్ని గ్రామంలోనే గడిపా. ఇలాంటి కరువును ఎప్పుడూ చూడలేదు. నీటి చుక్క లేక పొలాలన్నీ ఎండిపోయాయి. ఉన్న కొద్దిపాటి పొలాన్ని వదులుకుని ఏదైనా పని చేద్దామని నగరానికి వచ్చా. మట్టి పని, సిమెంట్ పని, మాల్ కలిపే పని.. ఇలా ఏది దొరికితే అది చేసుకుని పొట్ట నింపుకుంటున్నాం. ఇంటిల్లిపాదిది ఇదే పరిస్థితి. ఇక్కడ కూడా కూలీ పని కోసం పోటీ పెరిగిపోవడంతో కొందరికి ఆ పని దొరకడం లేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.
 
 ఐదెకరాలున్నా.. సెక్యూరిటీ గార్డుగా..
 ఈయన పేరు బతుకన్న(45). కర్నూలు జిల్లా నందనగి రి మండలం అలాద్రి. ఊళ్లో ఐదెకరాల భూమి ఉంది. వానల్లే క, పంటల్లేక ఐదు నెలల కిందట నగరానికి వలస వ చ్చి.. డీ మార్ట్ షాపింగ్ మాల్‌లో సెక్యూరిటీ గార్డుగా పనికి కుదిరాడు. మధ్యాహ్నం జీహెచ్‌ఎంసీ అందించే రూ.5 భోజనం చేస్తానని, రాత్రిళ్లు పస్తులుంటానని చెప్పాడు. వర్షాలు కురిస్తే ఊరెళ్లి వ్యవసాయం చేసుకుంటానని చెబుతున్నాడు.
 
 ఊళ్లో పనుల్లేక వచ్చా..
 మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్‌కు చెందిన ఈయన పేరు అనిల్ కుమార్. నాలుగెకరాల్లో ఉల్లి గడ్డ వేసినా నీళ్లు లేక పంట పూర్తిగా ఎండిపోయింది. రూ.80 వేలు మట్టిపాలయ్యాయి. అంతకుముందు పత్తి వేసినా నష్టాలే పలకరించాయి. ఈ ఏడాది చుక్క నీరు లేకపోవడంతో అసలు పంటే వేయలేదు. ‘‘పంటలు వేసి నష్టపోవడం కంటే బీళ్లుగా ఉంచడమే మేలనుకున్న. అప్పులు తీరుద్దామంటే ఊళ్లో పనుల్లేవు. అందుకే హైదరాబాద్ బస్సు ఎక్కి వచ్చా’’ అని చెప్పాడు. ఈయన వచ్చి వారం రోజులైంది. ఇప్పటివరకు వ్యవసాయమే చేసిన చేతులు ఇప్పుడు ఏ పని దొరికితే ఆ పనికి సిద్ధపడుతున్నాయి.
 
 ఉపాధి పనులు కూడా లేవు...
 ఈయన పేరు రాములు. నిజామాబాద్ జిల్లా జూకల్. హైదరాబాద్ వచ్చి వారం రోజులైంది. ఊళ్లో సాగుభూమి ఉన్నా నీళ్లు లేక పట్నం బాటపట్టాడు. ‘‘కరువు తీవ్రంగా ఉంది. గతంలో ప్రభుత్వం వారి ఉపాధి హామీ పనులు ఉండేవి. అవి కాస్తా బతుకుదెరువుగా ఉండేవి. ఇప్పుడు అవి కూడా లేకపోవడంతో నాలాగా చాలామంది బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి ఏదో ఒక పని చేసుకుంటున్నారు’’ అని ఆయన  ఆవేదన వ్యక్తంచేశాడు.
 
 మూడేళ్ల నుంచి పంటల్లేక..
 నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన ఈయన పేరు బదిలయ్య. వృత్తిపరంగా తాపీ మేస్త్రీ. ఊళ్లో రెండెకరాల పొలం ఉంది.  ఒకప్పుడు మేస్త్రీ పనితో బాగానే డబ్బులు సంపాదించినా.. తన నలుగురు కుమారులను చదివించేందు కోసం నానా కష్టాలు పడ్డాడు. అంతా బాగుందనుకున్న సమయంలో ప్రకృతి కన్నెర్ర జేసింది. మూడేళ్ల నుంచి పంటల్లేవు. అప్పులు పెరిగాయి. ఇప్పుడు నగరానికి వలస వచ్చి నిమ్మరసం బండి పెట్టుకున్నాడు. ఆయన నలుగురు కొడుకులు అదే పని చేస్తున్నారు. ఈ 2 నెలలు వ్యాపారం చేసి ఊరె ళ్తానని, వానలు పడితే వ్యవసాయం చేసుకొని బతుకుతానని చెబుతున్నాడు.
 
 సరస్వతీ పుత్రుల వలస బాట
 సరస్వతీ పుత్రులను సైతం కరువు వదల్లేదు! ఈ చిత్రంలో కనిపిస్తున్న అన్నదమ్ముల పేర్లు శివ, విష్ణు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం రామకృష్ణాపురం. మల్లికార్జున్, లక్ష్మి దంపతులకు వీరిద్దరితోపాటు కూతురు అనిత ఉంది. వరుస కరువుతో సాగులో అప్పులు రెట్టింపయ్యాయి. దీంతో నగరానికి వలస వచ్చారు. మొదట్లో తండ్రి మల్లికార్జున్ మేస్త్రీ పని చేసేవాడు. ఇటీవల ఆయన కిడ్నీలు దెబ్బతినడంతో కుటుంబ భారం పెద్ద కుమారుడు శివపై పడింది. శివ గతేడాది టెన్త్ పూర్తి చేశాడు. 8.2 జీపీఏ గ్రేడ్ సాధించాడు. అతడి ప్రతిభను గుర్తించి నగరంలోని ఓ ప్రైవేటు కాలేజీ ఎలాంటి ఫీజులు లేకుండా చేర్చుకొనేందుకు ఆహ్వానం పంపింది. అక్కడ ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేశాడు. ఓవైపు ఊళ్లో కరువు.. మరోవైపు తండ్రి అనారోగ్యంతో చదువు వదిలేసి హైదరాబాద్‌లో ఇలా చెరుకు బండి ఏర్పాటు చేసుకున్నారు.

 ఈయన తమ్ముడు విష్ణు ఇటీవలే టెన్త్ పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాడు. విష్ణుతో కలిసి ఈ చెరుకు బండితో ఉపాధి పొందుతున్నారు. ‘‘మా అమ్మ ఒంటిపై ఉన్న రెండు తులాల బంగారం అమ్ముకొని చెరుకు బండి పెట్టుకున్నాం. ఏదో ఒక విధంగా బతకాలి కదా సార్..’’ అని శివ అన్నాడు. తల్లి చెరుకు గడలను ఇరుసుల మధ్య పెడుతుంటే అన్నదమ్ములిద్దరూ కాడిని తిప్పుతూ చెరుకు రసం తీస్తున్నారు.
 
 ఒకప్పుడు సర్పంచ్‌గా పనిచేసి..
 ఈమె పేరు నాగమణి. భర్త కిష్టాగౌడ్. స్వస్థలం నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండలం రాఘవ్‌పల్లి. ఒకప్పుడు ఆ గ్రామానికి సర్పంచ్‌గా పనిచేసిన నాగమణి.. నేడు ఇళ్లలో పనులు చేసుకుంటూ భర్తకు చేదోడు వాదోడుగా ఉంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెళ్లిళ్లు చేశారు. సర్పంచ్‌గా పని చేసిన సమయంలో ఐదున్నర ఎకరాల భూమిలో పోచారం డ్యామ్ కింద పంటలు సమృద్ధిగా పండేవి. ఇద్దరు పనివారు ఉండేవారు. కరువు దెబ్బకు సాగులో అప్పులయ్యాయి. రెండు బోర్లు వేసినా నీళ్లు పడలేదు. అప్పులు పెరగడంతో ఐదెకరాల భూమి అమ్మేశారు. ఆరేళ్ల కిందట పొట్ట చేత పట్టుకుని నగరానికి వలస వచ్చి సూరారం రాజ్యలక్ష్మినగర్‌లో ఓ గదిని రూ.1500లకు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. కిష్టాగౌడ్ ఆటో నడుపుతుండగా.. నాగమణి టెక్ మహేంద్రలో కూలి పనులు చేస్తూ ఉదయం, సాయంత్రం ఇళ్లల్లో పాచిపని చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement